తెనాలి: ఆచార్య నాగార్జున వర్సిటీ జంతుశాస్త్ర పరిశోధకుడు, బయోస్పీయాలజిస్ట్ డాక్టర్ షాబుద్దీన్ షేక్ ‘వరల్డ్ రిజిస్టర్ ఆఫ్ మెరైన్ స్పీసిస్’ (వార్మ్స్) ఎడిటర్‌గా నియమితులయ్యారు. భూమిపైనున్న జంతు జాతుల పేర్ల జాబితాతో డేటాబేస్ నిర్వహణ ‘వార్మ్స్’ సంస్థ ప్రధాన కార్యక్రమం. 2008లో ఏర్పాటైన ఈ ప్రపంచ సంస్థ, బెల్జియంలోని ఓస్టెండ్ నగరంలోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా పనిచేస్తోంది. ఈ జాబితా తయారీకోసం 40 దేశాలకు చెందిన 300 మంది శాస్త్రవేత్తలతో కూడిన సంపాదక బృందం నిరంతరం కృషిచేస్తోంది. ఈ బృందంలో భారతదేశం నుంచి ఎంపికైన తొలి శాస్త్రవేత్తను తానేనని డాక్టర్ షాబుద్దీన్ సోమవారం వెల్లడించారు. ‘బేథినిల్లేసియా’ అనే నీటి కీటక జాతికి ప్రాతినిథ్యం వహిస్తూ, కొత్త జాతులు, అధికారిక సమాచారం, ఆసక్తికరమైన ప్రాంతీయ జాతుల కొరత, వాటి ఆవాసాలు వంటి అదనపు సమాచారాన్ని పొందుపరిచేందుకు ‘వారŠమ్స్’ ఒప్పందం చేసుకున్నట్టు డాక్టర్ షాబుద్దీన్ వివరించారు.
మెకానిక్ కొడుకుగా..
షాబుద్దీన్ షేక్ స్వస్థలం గుంటూరు. తండ్రి అమానుల్లా సాధారణ మెకానిక్. తల్లి రహమతూమ్ గృహిణి. షాబుద్దీన్ చిన్నతనంనుంచి తెనాలిలోని తాతయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ షేక్ మొహిద్దీన్ బాచ్చా దగ్గర పెరిగాడు. ఇంటర్ తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. జువాలజీలో బంగారుపతకం సాధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న ‘వార్మ్స్’ ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా షాబుద్దీన్‌కు అవకాశం లభించింది. డాక్టర్ రంగారెడ్డి నేతృత్వంలో షాబుద్దీన్ ప్రకృతి సహజ గుహల్లో కటిక చీకటి మాటున దాగున్న జీవరాశులను అన్వేషిస్తూ డాక్టర్ షాబుద్దీన్, ఆంధ్రాలోని బెలూమ్, బొర్రా, గుత్తికొండ గుహలు, మేఘాలయాలోని భారీ గుహల్లో పరిశోధన సాగించారు. ఇప్పటివరకు 40 కొత్త జీవులను కనుగొన్నారు.
అందులో ఒక జీవికి ‘ఆంధ్రా కొయిడస్ షాబుద్దీన్’గా నామకరణం చేశారు. 18 జీవుల గురించి అంతర్జాతీయ ప్రీ రివ్యూ జర్నల్స్‌లో పబ్లిష్ చేశారు. గుహలలోని జీవవైవిధ్యంపై షాబుద్దీన్ చేసిన పరిశోధనకు నాగార్జున యూనివర్సిటీ 2017లో పీహెచ్‌డీ ప్రదానం చేసింది. ఆ థీసిస్‌ను అధ్యయనం చేసిన ‘ఎడ్యుడికేటర్స్’, ఉత్తమ థీసిస్ అవార్డుకు సిఫార్సు చేయటం మరో విశేషం. జాతీయస్థాయిలో ప్రతిష్టాకరమైన డాక్టర్ కేవీరావ్ యంగ్ సైంటిస్ట్ అవార్డు (2016), డాక్టర్ నాగరాజు మెమోరియల్ రీసెర్చ్ అవార్డును షాబుద్దీన్ అందుకున్నారు. విశాఖలో ఏపీ సైన్స్ కాంగ్రెస్ సభల్లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డు స్వీకరించారు. ఈ యువశాస్త్రవేత్తకు వివిధ అంతర్జాతీయ శాస్త్ర సంస్థలోనూ సభ్యత్వముంది.ఇటీవలే ఆయనకు జువాలజీ సొసైటీ ఆఫ్ లండన్ ఫెలోషిప్ లభించింది.
‘అరుదైన’ పదవిలో తెలుగుతేజం
Published Tue, Sep 25 2018 4:01 AM | Last Updated on Tue, Sep 25 2018 4:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment