సమన్వయ సమావేశంలో అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ శశాంక (ఫైల్)
గద్వాల న్యూటౌన్: నులిపురుగుల సంక్రమణను నిరోధించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. ఈనెల 19న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 1–19 ఏళ్లలోపు ఉన్న 2,02,763 మందికి అల్బెండజోల్ మాత్రలు వేయించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటికే వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులకు అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ మాత్రలను ఆయా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలకు సరఫరా చేశారు. వాస్తవానికి మనిషి పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధిచెందే పరాన్న జీవులే నులిపురుగులు. ముఖ్యంగా పిల్లల్లో ఏలికపాములు, నులి, కొంకి పురుగులుగా ఉంటాయి.
ఆరుబయట ఒట్టికాళ్లతో ఆడుకోవడం ద్వారా, చేతులు శుభ్రం చేసుకోకుండా భుజించడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించేందుకు షూ ధరించడం, భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయొద్దు. పండ్లు, కూరగాయలను శుభ్రం చేసి తినాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఆరుబయట మలవిసర్జనకు వెళ్లరాదు. ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలి. వీధుల్లో విక్రయించే ఆహారాన్ని భుజించరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలపై ప్రభావం
నులిపురుగులతో పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు కలుగుతాయి. దీంతోపాటు శారీరక, మానసిక పెరుగుదల తగ్గిపోతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. రక్తహీనతను నియంత్రించడమేగాక వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.
మాత్రలు ఇలా ఇవ్వాలి
అల్బెండజోల్ మాత్రలు 1–2 ఏళ్లలోపు చిన్నారులకు సగం మాత్రను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలి. జబ్బుతో ఉన్న, ఇతర మందులను తీసుకుంటున్న వారికి ఇవ్వరాదు. 2–19 ఏళ్లలోపు వారు మాత్రను చప్పరించి, నమిలి మింగాలి. కాగా, జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో మొదటి, ఆగస్టులో రెండో విడత నిర్వహిస్తారు. మొదటి విడతలో భాగంగా ఈనెల 19న అల్బెండజోల్ మాత్రల పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాస్థాయిలో గత నెల 22న కలెక్టర్ శశాంక అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. దీనికి ఐసీడీఎస్, విద్యాశాఖ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ తదితర 16 శాఖల అధికారులు హాజరయ్యారు.
ఆ తర్వాత ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించి మాత్రలు వేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులకు వివరించారు. నులిపురుగుల వల్ల వచ్చే ఇబ్బందులు, నివారణ చర్యలతో కూడిన కరపత్రాలు, వాల్‌పోస్టర్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి పది రోజుల క్రితమే చేరాయి. పీహెచ్‌సీల వారీగా వీటిని సరఫరా చేశారు. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా 1–19 ఏళ్లలోపు వారికి అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల వారీగా గుర్తించారు. బడిబయట ఉన్న పిల్లలను సైతం ఆశా కార్యకర్తలు గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల్లో వేస్తారు. మిగిలిన వారికి ఈనెల 23న వేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినో త్సవం రోజు అల్బెండజోల్ మాత్రల పంపిణీని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈపాటికే 1–19 ఏళ్లలోపు ఉన్న వారిని గుర్తించాం. తల్లిదండ్రులు తప్పక తమ పిల్లలకు ఈ మాత్రలు వేయించాలి.
– డాక్టర్ రాజేంద్రకుమార్, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment