చిరుధాన్యాలకూ ‘కత్తెర’ బెడద! | Fall armyworm in small grain forming | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాలకూ ‘కత్తెర’ బెడద!

Published Tue, Jan 8 2019 5:41 AM | Last Updated on Tue, Jan 8 2019 5:41 AM

Fall armyworm in small grain forming - Sakshi

కత్తెర పురుగు ఆశించిన జొన్న పంట; కత్తెర పురుగు ఆశించిన రాగి పంట

మొక్కజొన్నకు తీవ్ర నష్టం కలిగిస్తున్న కత్తెర పురుగు (ఫాల్‌ ఆర్మీవామ్‌) ఈ రబీ సీజన్‌లో తొలిసారిగా జొన్నతోపాటు సజ్జ, రాగి, ఊద వంటి చిరుధాన్య పంటలను ఆశించి నష్టం కలిగిస్తోంది. మన దేశంలో 14 రాష్ట్రాల్లో 30 వేల హెక్టార్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో చిరుధాన్య పంటలు సాగవుతున్నాయి. కర్ణాటకలో గత ఏడాది మే నెలలో మొక్కజొన్న, జొన్న, రాగి పంటలను కత్తెర పురుగు ఆశించింది. అమెరికా, ఆఫ్రికా దేశాల్లో గత కొన్ని సంవత్సరాలుగా మొక్కజొన్న, జొన్న, చెరకు, వరి, గోధుమ సహా 27 కుటుంబాలకు చెందిన 100కు పైగా ఆహార పంటలను కత్తెర పురుగు తీవ్రస్థాయిలో ఆశిస్తూ పౌష్టికాహార, ఆహార భద్రతకు ముప్పుగా పరిణమించిన సంగతి తెలిసిందే.

మన దేశంలో కర్ణాటకతో ప్రారంభమైన కత్తెర పురుగు ఈ ఏడాది ఇతర రాష్ట్రాలకూ వేగంగా విస్తరించింది. అధిక విస్తీర్ణంలో చిరుధాన్య పంటలు సాగవుతున్న అనేక రాష్ట్రాలకు విస్తరించడం గమనార్హం. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్‌ రాష్ట్రాల్లో చిరుధాన్య పంటలను ఈ ఏడాది రబీ సీజన్‌లో తొలిసారి కత్తెర పురుగు ఆశించినట్లు భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ (ఐ.ఐ.ఎం.ఆర్‌.) సంచాలకుడు డాక్టర్‌ తొనపి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.

హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లోని ఐ.ఐ.ఎం.ఆర్‌. ఆవరణలోని 110 ఎకరాల్లో 9 రకాల చిరుధాన్య పంటలకు సంబంధించి కొన్ని పదుల సంఖ్యలో వంగడాలపై పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి. వీటిలో దాదాపు అన్ని పంటలనూ ఈ రబీలో తొలిసారి కత్తెర పురుగు సోకిందని, జొన్న, రాగి, సజ్జ, ఊద పంటలపై తీవ్రంగా ఆశించినట్లు డా. తొనపి వివరించారు. ఇవన్నీ ఏక పంటలుగానే సాగువుతుండటం గమనార్హం.
అయితే, ఏక దళ పంటలైన చిరుధాన్యాలను ద్విదళ పంటలైన పప్పు ధాన్యాలు, నూనె గింజ పంటలతో మిశ్రమ సేద్యం చేస్తే కత్తెర పురుగు బెడద అంతగా ఉండదని ప్రకృతి వ్యవసాయవేత్తలు చెబుతున్నారు.  

ఖరీఫ్‌లో స్వల్పం.. రీబీలో తీవ్రం..
ఈ ఏడాది ఖరీఫ్‌లో జొన్న, రాగి, సజ్జ, ఊద తదితర పంటలపై (1–2%) అక్కడక్కడా కనిపించిన కత్తెర పురుగు.. ఈ రబీ పంటకాలంలో తీవ్రంగా ఆశించిందని ఐ.ఐ.ఎం.ఆర్‌.లో ప్రధాన కీటక శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్న డాక్టర్‌ పి. జి. పద్మజ, డాక్టర్‌ జి. శ్యాంప్రసాద్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. కత్తెర పురుగు లార్వాలు ఆవురావురుమంటూ ఆకులను తినేసి ఈనెలను మాత్రం మిగుల్చుతున్నాయి. ప్రతి మొక్క సుడి(మొవ్వు)లో ఒకటి, రెండు పురుగులు కనిపించాయన్నారు. పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న పంట అందుబాటులో లేకపోవడం కూడా రబీలో చిరుధాన్య పంటలను ఎక్కువగా ఆశించడానికి ఒక కారణమన్నారు.

కత్తెర పురుగు యాజమాన్యానికి అనేక విధాల చర్యలు తీసుకున్నందున ఫలితాలు బాగున్నాయని, జొన్న పంటలో నష్టాన్ని 18–40% వరకు తగ్గించగలిగామని వారు వివరించారు. జీవనియంత్రణ, సమగ్ర కీటక యాజమాన్య చర్యలపై అధ్యయనం కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాది నాటికి మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు.

కత్తెర పురుగు యాజమాన్య చర్యలు
కత్తెర పురుగును అదుపు చేయడానికి రైతులు తీసుకోవాల్సిన 7 చర్యలను ఐ.ఐ.ఎం.ఆర్‌. శాస్త్రవేత్తలు సూచించారు.
► కత్తెర పురుగు గుడ్లను కుప్పలు కుప్పలుగా పెడుతుంది. మొక్కల కాండం, ఆకులపైనే కాకుండా మట్టి పెడ్డల మీద కూడా గుడ్లు పెడుతున్నట్లు గమనించారు. వీటిని రైతులు గుర్తించిన వెంటనే నాశనం చేయాలి.
► పురుగు ఉనికిని గుర్తించడానికి ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. పురుగు తీవ్రంగా ఉంటే ఎకరానికి 24 లింగాకర్షక బుట్టలు అమర్చి, అందులో పడిన పురుగులన్నిటినీ నాశనం చేయాలి.
► ఇసుక పది కేజీలు,  50 గ్రాముల సున్నం కలిపిన మిశ్రమాన్ని మొక్క సుడిలో నిండుగా కూలీలతో వేయించాలి. ఈ మిశ్రమం ఎకరానికి ఎంత అవసరమవుతుందన్నది పంట వయసును బట్టి ఆధారపడి ఉంటుంది.
► కత్తెర పురుగును అదుపు చేయడానికి పంట పొలంలో ట్రైకో కార్డులను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాల బయోకంట్రోల్‌ లేబరేటరీలు వీటిని రైతులకు అందుబాటులోకి తెచ్చాయి.
► పురుగు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు అజాడిరక్టిన్‌ 5% (వేప నూనె)ను లీటరు నీటికి 0.5 ఎం.ఎల్‌. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
► నోమురా రిలేయి అనే శిలీంధ్రాన్ని లీటరు నీటికి 2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
► పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుమందు కలిపిన వరి తవుడు మిశ్రమాన్ని సుడుల్లో వేయాలి.


తవుడు మిశ్రమం తయారీ పద్ధతి
తవుడు మిశ్రమం తయారీకి కావాల్సిన పదార్థాలు: 50 కిలోల వరి తవుడు, 4 కిలోల బెల్లం, 8 లీటర్ల నీరు, క్లోరిపైరిఫాస్‌ 20 ఇ.సి. అర లీటరు. 50 కిలోల వరి తవుడును నేలపై పోసి.. 4 కిలోల బెల్లాన్ని 2 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని చల్లాలి. రెండు లీటర్ల నీటిలో పురుగుమందును తగుమాత్రంగా కలిపి తవుడుపై చల్లాలి. చేతికి రబ్బరు తొడుగులు తొడుక్కొని తవుడు మిశ్రమాన్ని 4 లీటర్ల నీటిని చల్లుతూ బాగా కలపాలి. తవుడు మిశ్రమాన్ని గన్నీ బ్యాగులలో నింపి, రెండు రోజులు పులియబెట్టాలి. ఇలా తయారు చేసుకున్న తవుడు మిశ్రమాన్ని సాయంత్రం వేళల్లో మొక్కల సుడుల్లో వేయండి. లేదా మొక్క పైన చల్లండి.

► పురుగు మరీ తీవ్రమై అదుపు చేయలేని పరిస్థితుల్లో ఆఖరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగుమందులు చల్లాలి. ఎమామెక్టిన్‌ బెంజోట్‌ 5 ఎస్‌.జి.ను లీటరు నీటికి 0.4 గ్రాముల చొప్పున లేదా క్లోరోయాంత్రిప్రినోల్‌ 18.5 మందును లీటరు నీటికి 0.3 ఎం.ఎల్‌. చొప్పున లేదా ఫ్లుబెండమైడ్‌ 20% డబ్ల్యూ. జి.ని లీటరు నీటికి 0.4 ఎం.ఎల్‌. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. హై వాల్యూమ్‌ స్ప్రేయర్‌ను వాడాలి. మందు మొక్కల సుడుల్లో పడేలా చేయాలి. పురుగు తీవ్రతను బట్టి అవసరమైతే 10–15 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి.
ఇతర వివరాలకు.. ఐ.ఐ.ఎం.ఆర్‌. ప్రధాన శాస్త్రవేత్తలు, కీటక శాస్త్ర నిపుణులు డా. పి. జి. పద్మజ  – 99631 01952, డా. జి. శ్యాంప్రసాద్‌ – 98664 31157

సంప్రదాయ పద్ధతులే మేలు
కత్తెర పురుగు ప్రధానంగా ఆకులను చాలా వేగంగా తినేస్తుంటుంది. ఆ తర్వాత సుడిలో చేరి లేలేత ఆకులను తింటుంది. దీన్ని సంప్రదాయ పద్ధతుల్లో వేప నూనె, ఇసుక +సున్నం మిశ్రమం, తవుడు మిశ్రమం వంటివి వాడుతూ అదుపు చేయడమే ఉత్తమం. కత్తెర పురుగు తీవ్రస్థాయిలో ఆశించిన పక్షంలో ఆఖరి అస్త్రంగా మాత్రమే ఒకటి, రెండు సార్లు పురుగుమందులు వాడాలి. మొదటి నుంచే రసాయనిక పురుగుమందులు వాడితే పురుగు వాటికి త్వరగా అలవాటు పడే ప్రమాదం ఉంది. జీవనియంత్రణ పద్ధతులు, కత్తెర పురుగును తినే కీటకాలపై వచ్చే ఏడాది నాటికి పూర్తిగా అందుబాటులోకి తెస్తాం. రైతులు అప్రమత్తంగా ఉండాలి, బెంబేలు పడాల్సిన అవసరం లేదు.

– డా. విలాస్‌ ఎ. తొనపి, సంచాలకులు, భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్‌


కత్తెర పురుగు ఆశించిన సజ్జ పంట


లార్వా తుది రూపం


ఇసుక, సున్నం మిశ్రమం


ఇసుక, సున్నం మిశ్రమాన్ని ఐ.ఐ.ఎం.ఆర్‌లో చిరుధాన్య పంటలపై వేస్తున్న కూలీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement