‘పురుగులు పడితే’ బతుకుతారు..! | Scientists Say That Worms Help Heal Wounds | Sakshi
Sakshi News home page

‘పురుగులు పడితే’ బతుకుతారు..!

Published Sat, Nov 5 2022 3:34 AM | Last Updated on Sat, Nov 5 2022 3:34 AM

Scientists Say That Worms Help Heal Wounds - Sakshi

జంతువులు, మనుషులు.. శరీరం ఏదైనా సరే తీవ్రంగా గాయాలై తగిన చికిత్స చేయకపోతే పురుగులు పట్టడం చూస్తూనే ఉంటాం. సాధారణంగా కుళ్లిన, చనిపోయిన మాంసానికే (మృత కణాలకే) పురుగులు పడతాయి. కానీ అదే పురుగులు తీవ్రమైన గాయాలు మానడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనే గుర్తించిన ఈ విధానాన్ని వినియోగించడం ఇటీవల మళ్లీ పెరిగింది కూడా. మరి ఈ వివరాలు ఏమిటో తెలుసుకుందామా..
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

యాంటీ బయాటిక్స్‌కు లొంగకుండా..
సరైన విధంగా మందులు వాడకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, చికిత్స అందుబాటులో లేకపోవడం, పలు రకాల అనారోగ్య సమస్యలు వంటివాటి వల్ల గాయాలు మానవు. గాయాల్లో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్‌ మొదలవుతుంది. అవి మరింత తీవ్రమై పుండ్లు పడటం, చీమురావడం, కణాలు చనిపోయి కుళ్లిపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.

మరోవైపు పలురకాల బ్యాక్టీరియాలు ఔషధాలకు నిరోధకత (రెసిస్టెన్స్‌)ను పెంచుకోవడంతో.. చికిత్స చేసినా ఫలితం లేకపోవడం లేదా సుదీర్ఘకాలం పట్టడం జరుగుతోంది. ఈలోగా సమస్య ముదిరి.. ఆ శరీర భాగాలను తొలగించాల్సి రావడంగానీ, ఇన్ఫెక్షన్‌ శరీరమంతా వ్యాపించి ప్రాణాలు పోగొట్టుకోవడంగానీ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ‘పురుగుల’ చికిత్సతో ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

మొదటి ప్రపంచ యుద్ధంలోనే..
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కాల్పులు, బాంబు దాడుల్లో లక్షలాది మంది సైనికులు గాయపడ్డారు. యుద్ధ క్షేత్రాల్లో సరైన చికిత్స అందక గాయాలు పుండ్లు పడి, ఇన్ఫెక్షన్లు పెరిగి.. అవయవాలు కోల్పోయినవారు, చనిపోయినవారు ఎందరో. అయితే యుద్ధంలో గాయపడిన ఫ్రెంచ్‌ సైనికుల్లో కొందరికి గాయాలపై పురుగులు పట్టడం, వారి గాయాలు త్వరగా మాని కోలుకోవడాన్ని వైద్యులు గుర్తించారు.

గాయాల్లోని మృత కణాలను ఆ పురుగులు తినేయడం, అదే సమయంలో బ్యాక్టీరియాను హతమార్చే రసాయనాలను విడుదల చేయడమే దీనికి కారణమని తేల్చారు. ఇది తెలిసిన చాలా మంది వైద్యులు సైనికులకు పురుగుల చికిత్స చేశారు. కానీ తర్వాతికాలంలో యాంటీ బయాటిక్స్‌ రావడం, పురుగుల పట్ల ఏవగింపు వంటివి ఈ చికిత్స మరుగునపడిపోవడానికి కారణమయ్యాయి.

పురుగులు ఏం చేస్తాయి?
ఈగలు, తేనెటీగలు వంటి ఎగిరే కీటకాలు గుడ్డు నుంచి ఎదిగే క్రమం భిన్నంగా ఉంటుంది. అవి మొదట గుడ్డు నుంచి పురుగుల రూపంలోని లార్వాగా జన్మించి.. తర్వాత పూర్తిస్థాయి కీటకాలుగా మార్పు చెందుతాయి. ఇందులోని లార్వా దశ పురుగులనే గాయాలను మాన్పడానికి వినియోగిస్తారు.

ఈ పురుగులు నేరుగా మన మృతకణాలను తినవు. ముందుగా వాటి నోటి నుంచి వివిధ ఎంజైమ్‌లు ఉండే లాలాజలాన్ని (సలైవా) విడుదల చేస్తాయి. ఈ ఎంజైమ్‌లు మృతకణాలను కరిగించి పోషక ద్రవంగా మారుస్తాయి. ఇదే సమయంలో అక్కడ ఉండే బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు కూడా చనిపోయి పోషక ద్రవంగా మారుతాయి. పురుగులు ఈ పోషక ద్రవాన్ని పీల్చుకుని జీవిస్తాయి.

మొత్తంగా గాయంపై మృతకణాలు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు నశించడంతో ఇన్ఫెక్షన్‌ తగ్గుతుంది. మరోవైపు పురుగుల సలైవా వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి చురుగ్గా మారుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో సమస్య నుంచి వేగంగా కోలుకున్నట్టు తేల్చారు.

ఇంగ్లండ్‌లోని సౌత్‌వేల్స్‌కు చెందిన బయోమోండే సంస్థ ‘గ్రీన్‌ బాటిల్‌ బ్లోఫ్లై’ రకం ఈగల లార్వాలను టీబ్యాగ్‌ల తరహాలో ప్యాక్‌ చేసి అమ్ముతోంది. ఏటా 9 వేల బయోబ్యాగ్‌లను చికిత్సల కోసం కొంటున్నారని చెబుతోంది.

నర్సుల భయమే సమస్యట!
సాధారణంగా పురుగులను చూస్తే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. కొందరైతే భయంతో కెవ్వున కేకలు కూడా పెడుతుంటారు. ప్రస్తుతం గాయాలకు పురుగుల చికిత్సలోనూ ఇదో సమస్యగా మారిందని ఇంగ్లండ్‌ వైద్యులు చెప్తున్నారు. చాలా మంది నర్సులు పురుగులను చూసి అసహ్యం, భయం వ్యక్తం చేస్తున్నారని.. ఆ చికిత్స చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. అందువల్ల కొందరు నర్సులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఈ చికిత్సల్లో వినియోగిస్తున్నామని చెప్తున్నారు.

కొన్నాళ్లుగా ఇంగ్లండ్‌లో మళ్లీ వినియోగం
గాయాలు, పుండ్లకు చికిత్సలో పురుగుల వినియోగానికి ఇంగ్లండ్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ 2004లోనే అధికారికంగా అనుమతి ఇచ్చింది. కొన్నాళ్లుగా ఈ విధానానికి ఆదరణ వస్తోందని, 2009–19 మధ్య ఈ తరహా చికిత్సలు 50శాతం పెరిగాయని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. 

పుళ్లుపడి, చీముపట్టిన గాయాలైనా..
సాధారణంగా గాయాలు తీవ్రమై పుళ్లుపడటం, చీముపట్టడం (గ్యాంగ్రిన్‌) వంటివి జరిగితే.. అంతమేర ఆపరేషన్‌ చేసి కండరాన్ని కోసి తీసేయాల్సిందేనని వైద్యులు చెప్తుంటారు. చాలా సందర్భాల్లో ఇలాంటి కారణాలతో కాళ్లు, చేతులు, వేళ్లు వంటివి తొలగించిన ఘటనలూ మనకు కనిపిస్తుంటాయి. అలాంటి తీవ్రమైన గాయాలు కూడా మానిపోయేందుకు పురుగుల చికిత్స తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా గ్యాంగ్రిన్‌ సమస్యతో 7లక్షల మంది వరకు చనిపోతున్నట్టు అంచనా. వారిలో చాలా మందిని ‘పురుగుల చికిత్స’తో కాపాడవచ్చని అంటున్నారు.

ఏదో ఓ పురుగు వేసుకుంటే  డేంజర్‌
పురుగులతో గాయం తగ్గిపోతుందికదా అని ఏదో ఒక పురుగును వేసుకుంటే మొదటికే మోసం వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పురుగులు అంటేనే వివిధ బ్యాక్టీరియాలు, వైరస్‌లు, సూక్ష్మజీ­వులకు అడ్డాలు అని.. వాటితో మరిన్ని ఇన్ఫెక్షన్లు సోకుతాయని స్పష్టం చేస్తున్నారు. ఏవైనా ప్రత్యేకమైన ఈగ జాతులకు చెందిన గుడ్లను యాంటీ బ్యాక్టీరియల్‌ ద్రావణంతో శుద్ధిచేసి, ప్రయోగశాలలో వాటిని పొదిగి.. లార్వా దశకు వచ్చాక గాయాలపై వినియోగించాలని స్పష్టం చేస్తున్నారు.

ఈ పురుగులను కూడా గాయాలపై నేరుగా వేయరు. టీబ్యాగ్‌ తరహా ప్రత్యేకమైన పలుచని రంధ్రాలున్న బయోబ్యాగ్‌లో వాటిని ఉంచుతారు. ఈ బ్యాగ్‌లను గాయాన్ని తాకేలా పెట్టి.. పైన వదులుగా పట్టీకడతారు. ఇలా రెండు నుంచి నాలుగు రోజులు ఉంచుతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement