చీమలు పెట్టవు... పాములు ఉండవు! | Prakruthi Engineering College research | Sakshi
Sakshi News home page

చీమలు పెట్టవు... పాములు ఉండవు!

Published Fri, Mar 10 2023 4:09 AM | Last Updated on Fri, Mar 10 2023 10:52 AM

Prakruthi Engineering College research - Sakshi

చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్లని సుమతీ శతకకారుడు బద్దెన సెలవిచ్చినా నిజానికి చీమలు పుట్టలను తయారు చేయవు.. పాములూ వాటిని ఆక్రమించి నివసించవు. పుట్టలు చెదపురుగుల ఆవాసాలు. కొన్ని రకాల చీమలు చెదపురుగులను ఆహారంగా తీసుకునే క్రమంలో పుట్టల్లోకి చొరబడతాయి. పాములు, ఇతర సరీసృపాలు రక్షణ కోసం తాత్కాలికంగా పుట్టల్లో తలదాచుకుంటాయి.   – (సాక్షి, ఏపీ నెట్‌వర్క్, ఆత్మకూరు రూరల్‌)

మండు వేసవిలోనూ గది ఉష్ణోగ్రత.. 
పంట పొలాలు, అడవుల్లో భిన్న ఆకారాల్లో పుట్టలు సాధారణం. పిరమిడ్‌ ఆకారం, భూమికి కొద్ది ఎత్తులో మట్టి కుప్పల్లా పుట్టలు ఏర్పడుతుంటాయి. పైకి ఎంత ఎత్తులో కనిపిస్తాయో భూగర్భంలోనూ అంతే లోతులో గదులుంటాయి. మండు వేసవైనా, ఎముకలు కొరికే చలి కాలమైనా పుట్టల్లో కచ్చితంగా 24 డిగ్రీల సాధారణ గది ఉష్ణోగ్రత ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. కుండపోత వర్షాలకు సైతం ఒక్క చుక్క నీరు కూడా పుట్టల్లోకి వెళ్లకపోవడం, మట్టితో నిర్మించినవే అయినా కరిగిపోకుండా ఉండటం మరో విశేషం. పుట్టల నిర్మాణంపై శాస్త్రవేత్తలు ఇప్పుడు విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారు. 

పర్యావరణ పరిరక్షణ.. 
అడవుల్లో వృక్షాలకు అవసరమైన సేంద్రియ పోషకాలను పుట్టల్లో ఉండే చెద పురుగులే అందిస్తాయి. చెదపురుగులు కీటక విభాగానికి చెందిన జీవులు. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 వేల జాతులున్నాయి. రాలిపోయిన ఆకులు, పడిపోయిన చెట్ల భాగాలను అత్యంత వేగంగా తింటూ విసర్జకాలను విడుస్తుంటాయి. తద్వారా వృక్షాలకు కంపోస్టు ఎరువు లభ్యమవుతుంది. కొన్ని రకాల వృక్ష జాతుల కణజాలంలోని సెల్యులోజ్‌ను ఆహారంగా తీసుకోవడం ద్వారా వాటిలో పరిమితికి మించి పీచు (ఫైబర్‌) పదార్థం పెరగకుండా నిరోధిస్తాయి.  

సరీసృపాలకు రక్షణ దుర్గాలు.. 
సరీసృపాలైన పాములు, తొండలు, బల్లులు, ఉడుములు తమ సహజ శతృవులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునేందుకు మాత్రమే పుట్టల్లో తలదాచుకుంటాయి. ఎలుగుబంట్లు పుట్టలను తవ్వి చెదలను ఆహారంగా తీసుకుంటాయి.  

ప్రకృతి ఇంజనీరింగ్‌.. 
జింబాబ్వే రాజధాని హరారేలో ఓ సంస్థ తన కార్యాలయం, షాపింగ్‌ మాల్‌ కోసం నిర్మించిన బహుళ అంతస్థుల భవనంలో సాధారణ ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఎలాంటి విద్యుత్‌ ఉపకరణాలను వినియోగించకుండా నిర్మాణం పూర్తి చేసింది.

సివిల్‌ ఇంజనీర్‌ మైక్‌ పియర్స్‌ పుట్టలను అధ్యయనం చేసి ప్రకృతి ఇంజనీరింగ్‌ను అనుసరించడంతో ఇది సాధ్యమైంది. భూతాపం, కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు ఇప్పుడు ప్రపంచమంతా ఏసీలు, హీటర్లు అవసరం లేని ఇళ్ల నిర్మాణం వైపు మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో పుట్టల నిర్మాణంలో దాగున్న ప్రకృతి ఇంజనీరింగ్‌ విధానాలను అధ్యయనం చేస్తున్నారు.

పర్యావరణానికి జీవధాతువులు 
ప్రకృతి పచ్చగా ఉందంటే వృక్షాలే కారణం. ఎవరూ ఎరువు­లు వేయకుండా అడవుల్లో అపా­ర వృక్ష సంపద విస్తరించటానికి కారణం పుట్టలు, అందులో ఉండే చెద పురుగులే. రాలిన ఆకులు,  వృక్ష సంబంధ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి తిరిగి చెట్లకు అందించడంలో చెద పురుగులు అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్నాయి. వృక్షాల ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మ పోషకాలన్నీ చెద పురుగులు అందించే సేంద్రియ ఎరువుల్లో ఉన్నాయి.  – అలెన్‌ చోంగ్‌ టెరాన్,  డిప్యూటీ డైరెక్టర్, టైగర్‌ప్రాజెక్టు, ఆత్మకూరు 

పుట్టలు ధ్వంసం చేయొద్దు
పుట్టల్లో పాములుంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. పొలం గట్లపై ఉండే పుట్టలను రైతులు ధ్వంసం చేస్తుంటారు. అది సరికాదు. పుట్టల్లో ఉండే చెదలు వ్యర్థాలను సేంద్రియాలుగా మార్చి సాగు భూమిని సారవంతం చేస్తాయి.  – విజయకుమార్, డైరెక్టర్, ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement