శరీరంలోని పేగుల్లో చేరిన నులిపురుగులకు ఒక్క ఆల్‌బెండజోల్ మాత్రతో చెక్ పెట్టవచ్చని డాక్టర్లు పేర్కొంటున్నారు. పిల్లల్లో ఎక్కువగా నులిపురుగులు ఉంటాయి. నులిపురుగుల వల్ల రక్తహీనత, నీరసం, కడుపులోనొప్పి కలగడమే కాకుండా విద్యార్థులు చదువులో వెనుకబడిపోయే అవకాశం ఉంది. నులిపురుగులను నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఆల్‌బెండజోల్ మాత్రలు మింగించేందుకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నెల్లూరు(అర్బన్): జిల్లాలో అంగన్‌వాడీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు, బ్రిడ్జి స్కూళ్లు, ఇతర సెంటర్లలో 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు గల 6,39,774 మందికి నులిపురుగుల నివారణ మందు ఆల్‌బెండజోల్ మాత్రలు మింగించేలా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. సోమవారం రోజు(10వ తేదీన) ఈ మాత్రలను మింగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ రోజు మాత్రలు వేయించుకోని వారిని గుర్తించి ఈ నెల 17వ తేదీన ఈ మాత్రలను మింగిస్తారు. అలాగే గ్రామాల్లో ఇంటి వద్ద ఉండే పిల్లలకు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఈ మాత్రలు మింగించేలా చర్యలు చేపట్టారు.
నులిపురుగులు వ్యాపించే మార్గాలు
♦ కలుషిత ఆహార పదార్థాలు, ఈగలు వాలిన తినుబండారాలు, దుమ్ము, ధూళి పడిన పదార్థాలు తినడం వల్ల నోటి నుంచి పొట్ట, పేగుల్లోకి నులిపురుగులు చేరుతాయి.
♦ బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్లు వినియోగించడం ద్వారా శరీరంలోనికి నులిపురుగులు చేరుతాయి.
♦ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు శుభ్రమైన నీటితో కడగకపోవడం.
♦ భోజనం వండే వారు, వడ్డించే వారు తినే ముందు, తిన్న తరువాత చేతులను శుభ్రం చేసుకోకపోవడం.
♦ చేతి వేళ్ల గోళ్ల ద్వారా..
♦ వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం ద్వారా..
♦ ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, ఆయా ప్రాంతాల్లో పిల్లలు ఆడుకోవడం అక్కడ ఉండే నులిపురుగులు, వాటి లార్వాలు జీర్ణకోశంలోనికి ప్రవేశించడం వల్ల నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి.
50 నుంచి 60 శాతం మందికి నులిపురుగులు మన దేశంలో 50 నుంచి 60 శాతం మంది ఏదో ఒక రకం నులిపురుగుల బారినపడి రక్తహీనతకు గురవుతున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. నులిపురుగుల్లో ప్రధానంగా ఏలిక పాములు, నులిపురుగులు, కొంకి పురుగులు అనే మూడు రకాల వల్లనే ఎక్కువగా రక్తహీనతకు గురవుతున్నారు.
మాత్రకు దూరంగా ఉండాల్సిన వారు
పూర్తిగా అనారోగ్యంతో ఉన్న వారు కోలుకున్న తరువాతనే ఆల్‌బెండజోల్ మాత్ర వేసుకోవాలి. ఒక సంవత్సరం లోపు వయసున్న వారు, గర్భిణులు, బాలింతలు, కాలేయ వ్యాధిగ్రస్తులు, ఉదర సంబంధ కేన్సర్ ఉన్న వారు, పుట్టుకతో గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు ఈ మాత్రలు వేసుకోకూడదు.
నులిపురుగులతోకలిగే నష్టాలు
నులిపురుగులు పేగుల్లోని రక్తాన్ని తాగి తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఫలితంగా రక్తహీనత వస్తుంది. నీరసించి పోతుంటారు. దగ్గు, ఆయాసం రావచ్చు. విద్యార్థి చదువులో ఏకాగ్రత కోల్పోతాడు. బిడ్డ ఎదుగుదల తగ్గిపోతుంది. చర్మంపై ఎర్రని దద్దులు రావచ్చు. బరువు తగ్గిపోతారు. తరచూ కడుపునొప్పి వస్తూ ఉంటుంది. వాంతులు, విరేచనాలు, మలంలో రక్తం పడడం, తలనొప్పి, ఆకలి తగ్గిపోవడం జరుగుతాయి.
నివారణ చర్యలు
భోజనానికి ముందు, ఆటలు ఆడిన తరువాత, మలవిసర్జన తరువాత సబ్బుతో 2 నిముషాలు చేతులు శుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత 400 మి.గ్రా. మాత్ర ఒక్కటి నోటిలో చప్పరించాలి. లేదా నమిలి మింగాలి. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో ఈ మాత్రలు ఇస్తారు. ఈ నెల 10వ తేదీన అనగా సోమవారం ఈ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు మాత్రలు వేయించుకోని వాళ్లను గుర్తించి మరలా ఈ నెల 17వ తేదీన మాత్రలు మింగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment