
మధుసూదన్ అంత్యక్రియలు అప్‌డేట్స్..
- మధుసూదన్ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
- సోమిశెట్టి మధుసూదన్ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
- రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అంత్య క్రియలకు హాజరుకానున్న మంత్రి ఆనం
- కావలి పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొననున్న మంత్రి ఆనం.

👉జమ్ము కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాం కావలి చేరుకుంది. మధుసూదన్‌ను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మధుసూదన్ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో బంధువులు, స్థానికులు చేరుకున్నారు.
👉వివరాల ప్రకారం.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాం గురువారం ఉదయం స్వగ్రామం చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు చెన్నై ఎయిర్‌పోర్టు చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహాన్ని కావలికి తరలించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద మధుసూదన్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళి అర్పించారు. మరోవైపు.. ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

👉ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి దుర్ఘటన జరగడం, అందులో కావలి వాసి మృతి చెందడం బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. దేశం మొత్తం మృతుడి కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం ఇది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా.. కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. మృతుని కుటుంబ సభ్యులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు’ అని తెలిపారు.

👉కశ్మీర్‌లో పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మరణించారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ ఘటన జరిగింది. సోమిశెట్టి మధుసూదన్ తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. మధుసూదన్ తండ్రి తిరుపాల్, తల్లి పద్మావతి పట్టణంలోని పెదపవని బస్టాండ్‌లో అరటిపళ్లు, టెంకాయల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెల తరువాత మధుసూదన్‌రావు పుట్టారు. స్థోమత లేకున్నా కష్టపడి చదివించారు. అన్నితరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న మధుసూదన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా చేరారు.
👉వృత్తిరీత్యా బెంగళూరులో ఉంటున్న మధుసూదన్ అక్కడ సొంతింటిని కూడా కట్టుకున్నారు. వృత్తిలో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఆశలు పండాయని వృద్ధ తల్లిదండ్రులు సంబరపడ్డారు. వేసవి విడిది కోసమని మధుసూదన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న తన భార్య కామాక్షి, కుమార్తె మేధు (ఇంటర్) కుమారుడు దత్తు (8వతరగతి)తో కలసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల తూటాలకు మధుసూదన్‌రావు బలయ్యారు. తమ కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలియని ఆ తండ్రి బుధవారం ఉదయం కూడా అరటిపళ్ల బండి వద్ద ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు. మృతుడు మధుసూదన్‌కు భార్య మీనాక్షి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.