- మధ్యాహ్న భోజన పథకం దుస్థితి
- వంట ఏజెన్సీలకు ఇబ్బందులు
- పందిళ్ల కిందే వంటలు
- పురుగుల బియ్యం పంపిణీ
హనుమాన్‌జంక్షన్‌రూరల్ : విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయడంలో అధికారులకు చిత్తశుద్ధి లోపించడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల లో వంట షెడ్లు లేక తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పందిర్ల కింద వంటలు వండలేక నిర్వాహకులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే ప్రాథమిక పాఠశాలలకు కొంతమంది నిర్వాహకులు ఇళ్లవద్దనే ఆహారపదార్థాలను తయారీ చేసి తీసుకువస్తున్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సుమారు 300కు పైగా విద్యార్థులు ఉండటంతో పాఠశాల ఆవరణ లోనే వంటలు తయారు చేయాల్సి వస్తోంది. దీంతో పొగ వెదజల్లి విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ పొయ్యి పైనే వంటవండాలని నిబందనలు విధించినప్పటికి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయకపోవడంతో పుల్లల పొయ్యి వెలిగించక తప్పడంలేదు.
బాపులపాడు మండలంలో ఆరుగొలను, కానుమోలు, రామన్నగూడెం, బాపులపాడు, వీరవల్లి, వేలేరు, రేమల్లె గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాల ల్లో మధ్యాహ్న బోజన పథకం అమలు... ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వీరవల్లి, వేలేరు పాఠశాలల్లో మాత్రమే వంట షెడ్డులు వున్నాయి. గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోవడంతో పుల్లల పొయ్యిలపైనే వంటలు తయారు చేస్తున్నారు. వంట ఏజెన్సీలకు 9,10 తరగతులకు సంబందించి రెండు నెలలు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
కానుమోలు జిల్లా పరిషత్ పాఠ శాలకు సరఫరా చేసిన బియ్యంలో రాళ్లు, ఎర్రటి పెంకు పురుగు, తెల్లటి రంగులో ఉండే పురుగులు కనిపిస్తున్నారు. వీటినే మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాద్యాయురాలిని ఈ విషయమై వివరణ కోరగా బియ్యం మార్చినా మళ్లీ అలాంటి బియ్యం వచ్చాయని చెప్పారు. దీంతో బియ్యం జల్లించి, పురుగులు చెరిగి, నీటితో కడిగి వంటకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
నిత్యం 30కేజీలు బియ్యం నుంచి రాళ్లు, పురుగులు ఏరడం ఎలా సాధ్యమవుతుందని వంట ఏజెన్సీ నిర్వహకులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలు చివరకు పురుగుల అన్నం తినాల్సి వస్తోందని విద్యార్థుల తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పం దించి, మధ్యాహ్న భోజనపథకం సక్రమంగా అమ్చయ్యేలా చూడాలని కోరుతున్నారు.