అనకాపల్లి జిల్లా బంగారమ్మపాలెం పాఠశాలలో మాడిపోయిన మధ్యాహ్న భోజనం.. తినలేక పారేసిన విద్యార్థులు.. ఆపై ఆందోళన
పేరెంట్స్ కమిటీ సమావేశం రోజే ఇలా పెడితే.. మిగిలిన రోజుల మాటేంటి?
పాఠశాల సదుపాయాలూ బాగోలేవని తల్లిదండ్రుల మండిపాటు
మెనూ ప్రకారం పెట్టడంలేదని విద్యార్థుల ఆరోపణ
ప్రభుత్వం నాసిరకం గుడ్లు సరఫరా చేస్తే మేమేం చేయగలమన్న హెచ్‌ఎం
అఎస్.రాయవరం: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం యూపీ స్కూల్లో మధ్యాహ్న భోజనం అత్యంత దారుణంగా ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం వండాల్సిన సాంబారు కిచిడీని మాడ్చేసి వడ్డించడంతో విద్యార్థులు దాన్ని తినలేక పారబోశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వడ్డించిన భోజనాన్ని పరిశీలించారు. ఆరోగ్యంగా ఎదగాల్సిన పిల్లలకు ఇంత దారుణమైన భోజనం పెడతారా? దీన్ని తినేదెలా? అని మండిపడ్డారు.
పేరెంట్స్ కమిటీ సమావేశం రోజే..
ఇక గురువారం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు భోజనం తినేసరికి మాడు వాసన రావడంతో పడేసి ఆందోళనకు దిగారు. అదే సమయంలో పేరెంట్స్ కమిటీ సమావేశం సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అందుబాటులో ఉండటంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను, ఉపాధ్యాయులను నిలదీశారు.
తరచూ భోజనం నాసిరకంగా పెడుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారని ఆరోపించారు. పేరెంట్స్ సమావేశం ఉన్నప్పుడే ఇంత దారుణంగా ఉంటే సాధారణ రోజుల్లో ఇంకెలా ఉంటుందో తెలుస్తోందన్నారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు సంతోష్ స్పందిస్తూ.. విద్యార్థులకు మంచిగా ఆహారం మళ్లీ వండిపెట్టాలని నిర్వాహకులను ఆదేశించారు.
తమకిచ్చే గుడ్లు కూడా బాగోలేవని విద్యార్థులు చెప్పగా, ప్రభుత్వం అలాంటి గుడ్లనే సరఫరా చేస్తున్నపుడు, తామేం చేయగలమని తల్లిదండ్రులతో హెచ్‌ఎం చెప్పారు. ఇక పాఠశాలలో వసతులూ బాగోలేవని, మైదానం దారుణంగా తయారైందని, ఇలా ఉంటే పిల్లల పరిస్థితి ఏంటని ప్రశి్నంచారు. చివరికి.. నిర్వాహకులు మళ్లీ భోజనం వండి పెట్టడంతో ఆందోళన ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment