సురక్షితమేనా ..?
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో మధ్యాహ్నం భోజనం (మిడ్ డే మీల్) నాణ్యత ఎంత వరకు సురక్షితమనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పిల్లలకు ఉత్తమ విద్యతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్న కర్ణాటకలో శుక్రవారం డీజే హళ్లి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కలుషిత ఆహారం తిని ఉర్దూ పాఠశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే.
భోజనం తయారీ, రవాణా వంటి విషయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో ఒకటి నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,113 పాఠశాలల్లోని 61.40 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం వల్ల లబ్ధిపొందుతున్నారు.
గ్రామాలు, ఓ మోస్తరు పట్టణ పాఠశాలల్లో భోజనాన్ని అప్పటికప్పుడు వండి విద్యార్థులకు అందిస్తున్నారు. అయితే బెంగళూరు, మైసూరు వంటి నగరాల్లో, ఈ పథకంలో భాగస్వాములైన ఆయా స్వచ్ఛంద సంస్థలు ఒకే చోట మధ్యాహ్న భోజనాన్ని వండి వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలకు రవాణా చేస్తున్నాయి. ప్రస్తుతం 93 స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా 5,768 పాఠశాలల్లోని 10.66 లక్షల మంది విద్యార్థులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి.
పిల్లలకు అందజేసే ఆహార తయారీ, సరఫరా విధానాల్లో అనుసరించాల్సిన ప్రమాణాల విషయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు విషయమై మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్‌మెంట్ (ఎంహెచ్‌ఆర్‌డీ) గత ఏడాది చివర్లో సమీక్ష నిర్వహించి కొన్ని సూచనలను జారీ చేసింది. పాఠశాలకు, మధ్యాహ్న భోజనం వండే చోటికి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండకూడదని సూచించింది.
విద్యార్థులకు అందించే ఆహారంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు 490 గ్రాముల క్యాలరీలు, 10 గ్రాముల ప్రోటీన్లు అదే ప్రాథమికోన్నత విద్యార్థులకు రోజుకు 720 గ్రాముల క్యాలరీలు, 16 గ్రాముల పోట్రీన్లు ఉండాలి. అయితే ఏ స్వచ్ఛంద సంస్థ కూడా ఈ నిబంధనలను పాటిస్తున్న దాఖలాలు లేవు. డీ.జే హళ్లి ఘటననే తీసుకుంటే ఆ పాఠశాలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న అక్షయపాత్ర సంస్థ నగరంలోని మరో 897 పాఠశాలకు కూడా మధ్యాహ్న భోజనాన్ని రవాణా చేస్తోంది.
ఇందుకోసం వసంతపురలో కేంద్రీకృత వంటతయారీ కేంద్రం (సెంట్రలైజ్డ్ కిచెన్) ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌కు దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు కూడా ఇక్కడి నుంచే భోజనాన్ని సరఫరా చేస్తున్నారని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మద్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్న మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇదే తరహాలో ఎక్కువ దూరం ఉన్న భోజనశాలల నుంచి ఆహార పదార్థాలను రవాణా చేస్తున్నాయి.
భోజనాన్ని మధ్యాహ్నానికే ఆయా పాఠశాలలకు చేర్చాల్సి ఉండడంతో తెల్లవారుజామునే వండటాన్ని పూర్తిచేసి మూత ఉన్న పాత్రల్లో ఉంచి ఈ సంస్థలన్నీ సంబంధిత పాఠశాలలకు పంపిస్తున్నాయి. దూరం ఎక్కువకావడం, వాతావరణ పరిస్థితులు తదితర కారణాలతో ఆహారం చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా రవాణాకు ఉపయోగించే వాహనాలు అపరిశుభ్రత కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది.
దీంతో డీ.జే హళ్లి తరహా ఘటనలు పునరావృతమవుతాయేమోననే ఆందోళనలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సమస్య పరిష్కారం కోసం ఆయా నగరాల్లోని కమ్యూనిటీ హాల్స్, కల్యాణమంటపాలతోపాటు ప్రభుత్వ స్థలాల్లో మినీ కిచెన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశమిస్తే ‘ఎంహెచ్‌ఆర్‌డీ’ ప్రమాణాలకు అనుగుణంగా ఆహారాన్ని వండటం, రవాణా చేయడానికి వీలవుతుందని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ విషయమై అక్షయపాత్ర అధికార ప్రతినిధి భరత్‌దాస్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.... ‘పాఠశాల నుంచి భోజనశాలకున్న దూరం 20 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉండాలన్నది కేవలం సూచన మాత్రమే. ఖచ్చితంగా పాటించాలనే నిబంధన కాదు. మా కిచెన్‌కు ఐఎస్‌వో సర్టిఫికెట్ ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకునే మధ్యాహ్నభోజనాన్ని తయారు చేస్తున్నాం. ఆహారాన్ని అందించడం వరకే మా బాధ్యత. పాఠశాలల్లో ఏదైనా జరిగి ఉంటే మాకు సంబంధం లేదు. డీ.జే హళ్లి ఘటనకు సంబంధించి ఈ విషయంపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది’ అని పేర్కొన్నారు.