మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి, పక్కన ఈటల
వరంగల్: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం 13 నెలల భీకర పోరాటం.. వేలాది మంది బలిదానాలతో వచ్చిందని, ఈ వాస్తవాలను నిజాం వారసుడు ఖాసీం రజ్వీకి చెందిన మజ్లిస్ పార్టీ కోసం నాడు కాంగ్రెస్.. నేడు బీఆర్‌ఎస్ సర్కార్ వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
ఈరెండు పార్టీలు.. మజ్ల్లిస్ ఆత్మలేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ సమైక్యతా దినోత్సం పేరిట కేసీఆర్ సర్కారు తెలంగాణకు ఉన్న చరిత్ర కనుమరుగు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి బైక్ ర్యాలీగా పరకాల అమరధామం చేరుకున్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు.
పరకాల పశువుల సంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భుక్తి కోసం.. స్వేచ్ఛా వాయువుల కోసం తుపాకులకు గుండెలను ఎదురుపెట్టి వేలాది మంది బలిదానాలతో 75 సంవత్సరాల తెలంగాణ విమోచన చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అన్నారు.
అలాంటి పార్టీకి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదన్నారు. కేసీఆర్ చదివిన 80 వేల పుస్తకాల్లో నాటి తెలంగాణ చరిత్ర గురించి లేదా అని ప్రశ్నించారు. చరిత్రకారులు విమోచన దినోత్సవం అంటారని.. తెలంగాణ సమైక్యత అనే వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే సోనియాగాంధీ కుటుంబం కోసమన్న ఆయన బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబం కోసమేనన్నారు. అదే బీజేపీకి ఓటు వేస్తే ప్రజల కోసం పార్టీ పని చేస్తుందన్నారు.
ఆత్మగౌరవం ఉన్నోళ్లు..
బీఆర్‌ఎస్‌కు ఓటు వేయరు : ఈటల
బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మగౌరవం ఉన్నవాళ్లు ఎవరూ బీఆర్‌ఎస్‌కు ఓటు వేయరని అన్నారు. కులమతాలకతీతంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని మహా భారతంలో ధర్మరాజు సిద్ధాంతంతో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎవరికి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కేసీఆర్ సర్కార్ ఉద్దెర బేరం చేస్తుండగా.. బీజేపీ నగదు చెల్లించే పని చేస్తోందన్నారు. తనను ఓడించేందుకు ఉప ఎన్నికల్లో ఊరురా తిరిగిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఈసారి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమరధామం వద్ద స్వాతంత్య్ర సమరయోధులను, సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారి వారసులను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే గుండె విజయరామారావు, మార్తినేని ధర్మారావు, మొలుగూరి భిక్షపతి, జయపాల్, కొండేటి శ్రీధర్, చింతల రామచంద్రారెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ప్రబారీ మురళీధర్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోశ్‌కుమార్, రాష్ట్ర నాయకులు డాక్టర్ కాళీప్రసాద్‌రావు, దేవు సాంబయ్య, కాచం గురుప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, గుజ్జుల సత్యనారాయణరావు, కాచం గురుప్రసాద్, మార్త భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి నాయకులపై థర్డ్ డిగ్రీ అమానుషం..
పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ప్రశ్నించి ఆందోళన చేసిన విద్యార్థులపై యూనివర్సిటీ అధికారులు కేసులు పెట్టి పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానుషం అని కిషన్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్లను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల జేఏసీ చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం రాత్రి కిషన్‌రెడ్డి.. నాయకులతో కలిసి సందర్శించారు.
పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీ సులతో కొట్టించిన ఘటనపై డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంఎస్‌ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ తిరుపతి మాదిగ, బాధ్యులు కలిసి మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment