ఊరెళ్లిపోతోంది!
ఊరెళ్లిపోతోంది!
Published Sat, Feb 4 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
ఉపాధి లేక వలసబాట పట్టిన 200 కుటుంబాలు
నిర్మానుష్యంగా మారిన మీరాపురం గ్రామం
బనగానపల్లె: స్థానికంగా పనులు లేక వసల బాట పడుతున్నారు పల్లెజనం. కరువుకు తోడు గత రెండు సంవత్సరాలుగా మైనింగ్ పనులు లేకపోవడంతో మండలంలోని మీరాపురం గ్రామానికి చెందిన సుమారు 200 కుటుంబాలు పిల్లాపాపలతో శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లాకు బయలుదేరారు. గ్రామం పుట్టినప్పటి చూస్తే అన్ని కుటుంబాలు ఒకేసారి వలస వెళ్లడం మొదటిసారి కావడంతో ఊరు నిర్మానుష్యంగా మారింది. ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో గ్రామం ఖాళీ అయినట్టు కనిపించింది. మైనింగ్ కార్మికులు, వ్యవసాయకూలీలు, రైతులు మూల్లెమూట తలపై పెట్టుకుని వెళ్లేటప్పుడు పలువురి హృదయాలను కలచివేసింది. ప్రభుత్వం స్థానికంగా ఉపాధి కల్పించకపోవడమే వలసకు కారణమని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు
ఉపాధికి నాడు పుట్టినిళ్లు:
గ్రామ సమీపంలోని 150 ఎకరాల మైనింగ్ ప్రాంతం స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఉపా«ధి కల్పించేది. సుమారు 1000–1500 కూలీలకు ఇక్కడ రోజు ఉపాధి పనులు లభించేవి. రెండు సంవత్సరాల క్రితం ఎద్దుల బిలుకు మైనింగ్ ప్రాంతాన్ని స్థానిక సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం లీజుకు తీసుకొని చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. దీంతో నాటి నుంచి కార్మికులకు ఉపాధి కరువైంది. ఇక్కడే ఉపాధి పనులు కల్పించాలని మైనింగ్ కార్మికులు గత రెండు సంవత్సరాలుగా ఆందోళనలు చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ సమీపంలోని అటవీ శాఖకు చెందిన భూమిలో మైనింగ్ పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే, అటవీశాఖ భూమిలో మైనింగ్ పనులు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆశాఖ అధికారుల అడ్డుకోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. తర్వాత వారి గోడు ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు వలసబాట పట్టారు.
Advertisement