వెబ్ సిరీస్‌లోని ఓ దృశ్యం
కోట్లాది అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది. ‘ఫులేరా’ అనే పల్లెటూళ్లో పంచాయతీ ఆఫీసులో ఆ ఆఫీసు ఉద్యోగికి, ఊళ్లోని వారికి మధ్య స్నేహంతో మొదటి సీజన్ సాగితే ఇప్పుడు ముఖ్యపాత్రలకు గట్టి విరోధులు ఈ సీజన్‌లో కనిపిస్తారు. సహజత్వం, హాస్యం, అనుబంధంతో ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ అమేజాన్‌లో మళ్లీ ఒకసారి ప్రేక్షకులను బింజ్ వాచింగ్ చేయిస్తోంది. 8 ఎపిసోడ్ల సెకండ్ సీజన్ పరిచయం ఈ ఆదివారం.
అదే ఊరు. అదే పంచాయతీ ఆఫీసు. వేరే గది తీసుకోకుండా ఆ పంచాయతీ ఆఫీసులోనే నివసించే ఉద్యోగి అభిషేక్. అతన్ని అభిమానంగా చూసుకునే పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆఫీసు అసిస్టెంట్ వికాస్... 2020లో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు పాత దూరదర్శన్ సీరియల్స్‌లా అనిపించి దేశమంతా చూసింది. పంచాయత్ వెబ్ సిరీస్‌కు విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. సెకండ్ సీజన్ కోసం విన్నపాలు, ఒత్తిళ్లు తెచ్చారు. లాక్‌డౌన్ వల్ల ఆ పనులన్నీ ఆగిపోయి ఇప్పుడు పూర్తయ్యి ‘పంచాయత్ సీజన్ 2’ స్ట్రీమ్ అవుతోంది. మళ్లీ అభిమానులను అలరిస్తోంది.
ఫులేరాలో ప్రత్యర్థులు
ఉత్తరప్రదేశ్‌లోని ‘ఫులేరా’ అనే కల్పిత ఊరిలో జరిగినట్టుగా చెప్పే ఈ కథలో అందరూ మంచివాళ్లే. అమాయకులే. ఒకరికొకరు సాయం చేసుకునేవారే. కాని ఆ ఊరికి గ్రామ సచివాలయ ఉద్యోగిగా వచ్చిన అభిషేక్‌కు ఎం.బి.ఏ చదివి వేరే ఉద్యోగం చేయాలని ఎంట్రన్స్ టెస్ట్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఈ లోపల అతనికి ఆ ఊరి సర్పంచ్‌తో, ఉప సర్పంచ్‌తో, అసిస్టెంట్‌తో మంచి స్నేహం ఏర్పడుతుంది. నిజానికి ఆ ఊరి సర్పంచ్ స్త్రీ (నీనా గుప్తా) అయినా సర్పంచ్ భర్త (రఘువీర్ యాదవ్) వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. అభిషేక్ (జితేంద్ర కుమార్) వారి ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. మొదటి సిరీస్‌లో సర్పంచ్ కూతురు ఉంటుంది కాని ఎక్కడా కనిపించదు. కాని ఈ సిరీస్‌లో ఆ కూతురు కనిపిస్తుంది.
అభిషేక్‌తో స్నేహం చేస్తుంది. అయితే ఊరన్నాక ఒకరో ఇద్దరో ప్రత్యర్థులు ఉండకపోరు. ఈ ఊళ్లో కూడా ఒక ప్రత్యర్థి తయారవుతాడు. అతడే ఆ ఊరి టెంట్ హౌస్ ఓనర్. రాబోయే ఎన్నికలలో తన భార్యను నిలబెట్టి సర్పంచ్ భర్తగా చలాయించాలనుకుంటున్న ఆ టెంట్ హౌస్ ఓనర్ సర్పంచ్‌ను, సచివాలయ ఉద్యోగులను పరేషాన్ చేస్తుంటాడు. మరోవైపు ఆ నియోజక వర్గ ఎం.ఎల్.ఏ కూడా సర్పంచ్‌ని అవమానిస్తుంటాడు. సర్పంచ్ తన కుమార్తె కోసం సంబంధం చూస్తే ఆ పెళ్లికొడుకు సైకోలాగా మారి ఆ అమ్మాయికి తెగ ఫోన్లు చేస్తుంటాడు. వీళ్లందరూ ప్రత్యర్థులే అయినా అభిషేక్, సర్పంచ్, ఉప సర్పంచ్, అసిస్టెంట్ నలుగురూ కలిసి ఆ సమస్యలను ఎలా దాటారు అనేవే ఈ ఎపిసోడ్స్.
నవ్వొచ్చే ఎపిసోడ్స్
గత సిరీస్‌లోలానే ఈ సిరీస్‌లో కూడా నవ్వొచ్చే ఉదంతాలు ఎన్నో ఉంటాయి. ఊరికి మరుగుదొడ్లు అలాట్ అయినా కొందరు ఉదయాన్నే బయటకు వెళుతుంటారు. అలా కనిపిస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ విజిట్‌కు వస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ముందు ఊరి సర్పంచ్‌ను ఎలాగైనా బద్నామ్ చేయాలని టెంట్ హౌస్ ఓనర్ ఒకతణ్ణి నువ్వు ఎలాగైనా చెంబు పట్టుకుని పొద్దున్నే కలెక్టరుకు కనిపించు అంటాడు. కలెక్టరు విజిట్‌కు వస్తే కనిపించాలని అతను, అతణ్ణి ఎలాగైనా ఆపాలని మిత్రబృందం చేసే ప్రహసనాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. గుడిలో టెంట్ హౌస్ ఓనర్ భార్య చెప్పులను పొరపాటున సర్పంచ్ భార్య తొడుక్కుని ఇంటికి వస్తుంది.
తన చెప్పులు కనిపించని టెంట్ హౌస్ ఓనర్ భార్య సిసి టీవీలో చూసి సర్పంచ్ భార్యే దొంగ అని తెలుసుకుని పోలీస్ కేస్ పెడతానంటుంది. ఆ చెప్పులు ఆమె ఇంట్లో పడేయడానికి హీరో నానా విన్యాసాలు చేస్తాడు. అదీ నవ్వే. ఊరి రోడ్డు కోసం నిధులకు ఎంఎల్‌ఏ దగ్గరకు వెళితే ఆ ఎంఎల్‌ఏ ముందు ఎక్స్‌ప్రెస్ రైలును ఆపడానికి ధర్నా చేయమని పంపిస్తాడు. అక్కడ సర్పంచ్‌ను, ఉపసర్పంచ్‌ను పోలీసులు పట్టుకెళతారు. అదంతా చాలా సరదాగా ఉంటుంది. హీరోయిన్‌ను పెళ్లికొడుకు వేధిస్తూ ఉంటే ఆమె హీరో సాయం కోరుతుంది. అలాగే హీరోయిన్, హీరో పరిచయం పెంచుకునే సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి.
గంభీరమైన ముగింపు
సాధారణంగా పంచాయత్ ఎపిసోడ్స్ అన్నీ సరదాగా ఉంటాయి. కాని ఈ సిరీస్‌లో చివరి ఎపిసోడ్‌ను ఒక ఉదాత్త సన్నివేశంతో గంభీరం చేశాడు దర్శకుడు. ఆ సన్నివేశంతో ప్రేక్షకులందరూ కన్నీరు కారుస్తారు. మనసులు బరువెక్కుతాయి. సంతోషంతోపాటు దుఃఖమూ మనుషుల జీవితాల్లో ఉంటుందని చెప్పడానికి కాబోలు. ఇంకా పాత్రలు, వాటి గమ్యం పూర్తిగా తేలకుండానే ఈ సిరీస్ కూడా ముగుస్తుంది. అంటే సీజన్ 3కు కథ మిగిలించుకున్నారన్న మాట. ‘పంచాయత్’ బలం అంతా దాని సహజత్వం. సున్నితత్వం. హాస్యం.
మానవ నిజ ప్రవర్తనలు. వీటిని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా, రచయిత చందన్ కుమార్ గట్టిగా పట్టుకోవడంతో సిరీస్ నిలబడింది. కథ ఉత్తరప్రదేశ్‌లో జరిగినా లొకేషన్ అంతా భొపాల్‌కు దగ్గరగా తీశారు. ఆ ఊరి వాతావరణమే సగం ఆకట్టుకుంటుంది. థియేటర్ చేసిన నటులు కావడం వల్ల అందరూ పాత్రలను అద్భుతంగా పండిస్తారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం. ఇలాంటి జీవితాలు, పాత్రలు తెలుగు పల్లెల్లో ఎన్నెన్నో ఉంటాయి. గతంలో తెలుగులో కూడా మంచి సీరియల్స్ వచ్చేవి. ఇలాంటి కథలతో తెలుగులో కూడా వెబ్ సిరీస్ వస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. పంచాయత్ చూడని వాళ్లు మొదటి సిరీస్, రెండో సిరీస్ హాయిగా చూడొచ్చు. హిందీలో మాత్రమే లభ్యం.
Comments
Please login to add a commentAdd a comment