Jitendra Kumar
-
Panchayat season 2: మంచి మనుషులకు గట్టి దెబ్బలు
కోట్లాది అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది. ‘ఫులేరా’ అనే పల్లెటూళ్లో పంచాయతీ ఆఫీసులో ఆ ఆఫీసు ఉద్యోగికి, ఊళ్లోని వారికి మధ్య స్నేహంతో మొదటి సీజన్ సాగితే ఇప్పుడు ముఖ్యపాత్రలకు గట్టి విరోధులు ఈ సీజన్లో కనిపిస్తారు. సహజత్వం, హాస్యం, అనుబంధంతో ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ అమేజాన్‌లో మళ్లీ ఒకసారి ప్రేక్షకులను బింజ్ వాచింగ్ చేయిస్తోంది. 8 ఎపిసోడ్ల సెకండ్ సీజన్ పరిచయం ఈ ఆదివారం. అదే ఊరు. అదే పంచాయతీ ఆఫీసు. వేరే గది తీసుకోకుండా ఆ పంచాయతీ ఆఫీసులోనే నివసించే ఉద్యోగి అభిషేక్. అతన్ని అభిమానంగా చూసుకునే పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆఫీసు అసిస్టెంట్ వికాస్... 2020లో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు పాత దూరదర్శన్ సీరియల్స్‌లా అనిపించి దేశమంతా చూసింది. పంచాయత్ వెబ్ సిరీస్‌కు విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. సెకండ్ సీజన్ కోసం విన్నపాలు, ఒత్తిళ్లు తెచ్చారు. లాక్డౌన్ వల్ల ఆ పనులన్నీ ఆగిపోయి ఇప్పుడు పూర్తయ్యి ‘పంచాయత్ సీజన్ 2’ స్ట్రీమ్ అవుతోంది. మళ్లీ అభిమానులను అలరిస్తోంది. ఫులేరాలో ప్రత్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని ‘ఫులేరా’ అనే కల్పిత ఊరిలో జరిగినట్టుగా చెప్పే ఈ కథలో అందరూ మంచివాళ్లే. అమాయకులే. ఒకరికొకరు సాయం చేసుకునేవారే. కాని ఆ ఊరికి గ్రామ సచివాలయ ఉద్యోగిగా వచ్చిన అభిషేక్‌కు ఎం.బి.ఏ చదివి వేరే ఉద్యోగం చేయాలని ఎంట్రన్స్ టెస్ట్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఈ లోపల అతనికి ఆ ఊరి సర్పంచ్‌తో, ఉప సర్పంచ్‌తో, అసిస్టెంట్‌తో మంచి స్నేహం ఏర్పడుతుంది. నిజానికి ఆ ఊరి సర్పంచ్ స్త్రీ (నీనా గుప్తా) అయినా సర్పంచ్ భర్త (రఘువీర్ యాదవ్) వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. అభిషేక్ (జితేంద్ర కుమార్) వారి ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. మొదటి సిరీస్‌లో సర్పంచ్ కూతురు ఉంటుంది కాని ఎక్కడా కనిపించదు. కాని ఈ సిరీస్‌లో ఆ కూతురు కనిపిస్తుంది. అభిషేక్‌తో స్నేహం చేస్తుంది. అయితే ఊరన్నాక ఒకరో ఇద్దరో ప్రత్యర్థులు ఉండకపోరు. ఈ ఊళ్లో కూడా ఒక ప్రత్యర్థి తయారవుతాడు. అతడే ఆ ఊరి టెంట్ హౌస్ ఓనర్. రాబోయే ఎన్నికలలో తన భార్యను నిలబెట్టి సర్పంచ్ భర్తగా చలాయించాలనుకుంటున్న ఆ టెంట్ హౌస్ ఓనర్ సర్పంచ్‌ను, సచివాలయ ఉద్యోగులను పరేషాన్ చేస్తుంటాడు. మరోవైపు ఆ నియోజక వర్గ ఎం.ఎల్.ఏ కూడా సర్పంచ్‌ని అవమానిస్తుంటాడు. సర్పంచ్ తన కుమార్తె కోసం సంబంధం చూస్తే ఆ పెళ్లికొడుకు సైకోలాగా మారి ఆ అమ్మాయికి తెగ ఫోన్లు చేస్తుంటాడు. వీళ్లందరూ ప్రత్యర్థులే అయినా అభిషేక్, సర్పంచ్, ఉప సర్పంచ్, అసిస్టెంట్ నలుగురూ కలిసి ఆ సమస్యలను ఎలా దాటారు అనేవే ఈ ఎపిసోడ్స్. నవ్వొచ్చే ఎపిసోడ్స్ గత సిరీస్లోలానే ఈ సిరీస్‌లో కూడా నవ్వొచ్చే ఉదంతాలు ఎన్నో ఉంటాయి. ఊరికి మరుగుదొడ్లు అలాట్ అయినా కొందరు ఉదయాన్నే బయటకు వెళుతుంటారు. అలా కనిపిస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ విజిట్‌కు వస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ముందు ఊరి సర్పంచ్‌ను ఎలాగైనా బద్నామ్ చేయాలని టెంట్ హౌస్ ఓనర్ ఒకతణ్ణి నువ్వు ఎలాగైనా చెంబు పట్టుకుని పొద్దున్నే కలెక్టరుకు కనిపించు అంటాడు. కలెక్టరు విజిట్‌కు వస్తే కనిపించాలని అతను, అతణ్ణి ఎలాగైనా ఆపాలని మిత్రబృందం చేసే ప్రహసనాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. గుడిలో టెంట్ హౌస్ ఓనర్ భార్య చెప్పులను పొరపాటున సర్పంచ్ భార్య తొడుక్కుని ఇంటికి వస్తుంది. తన చెప్పులు కనిపించని టెంట్ హౌస్ ఓనర్ భార్య సిసి టీవీలో చూసి సర్పంచ్ భార్యే దొంగ అని తెలుసుకుని పోలీస్ కేస్ పెడతానంటుంది. ఆ చెప్పులు ఆమె ఇంట్లో పడేయడానికి హీరో నానా విన్యాసాలు చేస్తాడు. అదీ నవ్వే. ఊరి రోడ్డు కోసం నిధులకు ఎంఎల్ఏ దగ్గరకు వెళితే ఆ ఎంఎల్ఏ ముందు ఎక్స్‌ప్రెస్ రైలును ఆపడానికి ధర్నా చేయమని పంపిస్తాడు. అక్కడ సర్పంచ్‌ను, ఉపసర్పంచ్‌ను పోలీసులు పట్టుకెళతారు. అదంతా చాలా సరదాగా ఉంటుంది. హీరోయిన్ను పెళ్లికొడుకు వేధిస్తూ ఉంటే ఆమె హీరో సాయం కోరుతుంది. అలాగే హీరోయిన్, హీరో పరిచయం పెంచుకునే సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. గంభీరమైన ముగింపు సాధారణంగా పంచాయత్ ఎపిసోడ్స్ అన్నీ సరదాగా ఉంటాయి. కాని ఈ సిరీస్‌లో చివరి ఎపిసోడ్‌ను ఒక ఉదాత్త సన్నివేశంతో గంభీరం చేశాడు దర్శకుడు. ఆ సన్నివేశంతో ప్రేక్షకులందరూ కన్నీరు కారుస్తారు. మనసులు బరువెక్కుతాయి. సంతోషంతోపాటు దుఃఖమూ మనుషుల జీవితాల్లో ఉంటుందని చెప్పడానికి కాబోలు. ఇంకా పాత్రలు, వాటి గమ్యం పూర్తిగా తేలకుండానే ఈ సిరీస్ కూడా ముగుస్తుంది. అంటే సీజన్ 3కు కథ మిగిలించుకున్నారన్న మాట. ‘పంచాయత్’ బలం అంతా దాని సహజత్వం. సున్నితత్వం. హాస్యం. మానవ నిజ ప్రవర్తనలు. వీటిని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా, రచయిత చందన్ కుమార్ గట్టిగా పట్టుకోవడంతో సిరీస్ నిలబడింది. కథ ఉత్తరప్రదేశ్‌లో జరిగినా లొకేషన్ అంతా భొపాల్కు దగ్గరగా తీశారు. ఆ ఊరి వాతావరణమే సగం ఆకట్టుకుంటుంది. థియేటర్ చేసిన నటులు కావడం వల్ల అందరూ పాత్రలను అద్భుతంగా పండిస్తారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం. ఇలాంటి జీవితాలు, పాత్రలు తెలుగు పల్లెల్లో ఎన్నెన్నో ఉంటాయి. గతంలో తెలుగులో కూడా మంచి సీరియల్స్ వచ్చేవి. ఇలాంటి కథలతో తెలుగులో కూడా వెబ్ సిరీస్ వస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. పంచాయత్ చూడని వాళ్లు మొదటి సిరీస్, రెండో సిరీస్ హాయిగా చూడొచ్చు. హిందీలో మాత్రమే లభ్యం. -
సీజే జస్టిస్ జేకే మహేశ్వరికి హైకోర్టు ఘన వీడ్కోలు
సాక్షి, అమరావతి: సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరికి హైకోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. వీడ్కోలు కార్యక్రమం నిమిత్తం సీజేతో సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, రిజిస్ట్రార్లు అందరూ జడ్జీల లాంజ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో తన సహచర న్యాయమూర్తుల సహకారం వల్లే కోర్టు కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించానని తెలిపారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన తాను, కష్టపడే మనస్తత్వం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని చెప్పారు. కొత్త రాష్ట్రం, కొత్త హైకోర్టు కావడంతో పలు సవాళ్లు ఎదురయ్యాయని, వాటన్నింటినీ తన సహచర న్యాయమూర్తుల సహకారంతో విజయవంతంగా అధిగమించానని సీజే అన్నారు. నిష్క్రమణ అనేది చాలా బాధాకరమైనదని, ఈ ప్రాంతం నుంచి తాను వెళ్లిపోతున్నానంటూ సీజే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పలువురు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి సేవలను కొనియాడారు. కాగా జస్టిస్ మహేశ్వరిని న్యాయమూర్తులు, రిజిస్ట్రీ అధికారులు శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. రిజిస్ట్రార్ (విజిలెన్స్) గంధం సునీత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసారి సీన్ రివర్స్: జస్టిస్ రాకేశ్ కుమార్‌కు వీడ్కోలు పలికిన రీతిలోనే జస్టిస్ మహేశ్వరికి వీడ్కోలు పలికేందుకు అమరావతి రైతులు హైకోర్టు వద్దకు చేరుకున్నారు. జస్టిస్ రాకేశ్‌కుమార్ లాగే కారు ఆపి, తమ నుంచి జ్ఞాపికలు, శాలువాలు తీసుకుంటారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. సీజే కారు ఆపకుండా, కారులో నుంచే వారికి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. నేరుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. -
పిల్లల భద్రత చట్టం అమలుపై వర్క్‌షాపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జువనైల్ జస్టిస్ చట్టం అమలుపై డీజీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి వర్క్ షాపులో జూమ్ యాప్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు విజయలక్ష్మి, గంగారావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెబినార్ ద్వారా పాల్గొని పిల్లల భద్రత చట్టం అమలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్థేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి కారణాలు, వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనే అంశాలపై చర్చించేందుకే ఈ వర్క్ షాపు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒంటరి, సంరక్షణ లేని బాలురు, బాలికలు తారసపడితే ముందుగా పోలీసులకు తెలపాలని డీజీపీ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒంటరి బాలురు, బాలికల వివరాలను పోలీసులకు తెలియపరచాలని సూచించారు. ఇందుకోసం www.trackthemissingchild.gov.in వెబ్సైట్ ద్వారా వారి వివరాలు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ వెబ్సైట్ ద్వారా వచ్చిన వివరాలు తప్పి పోయినప్పటికి.. వారి వివరాలతో సరిపోలితే సదరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని చెప్పారు. ఒంటరి బాలురు, బాలికలను కొట్టడం దుర్బాషలాడటం చేయకూడదని.. పిల్లలు నేరం చేస్తే వారిని స్టేషన్లోనే నేరస్థులతో కూర్చోబెట్టకుండా మృదువుగా వ్యవహరించాలని డీజీపీ పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి మాట్లాడుతూ.. పిల్లలు దేశ భవిష్యత్తుకు ముఖ్యమైన మూలధనం అన్నారు. వారి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఏపీజె అబ్దుల్ కలామ్ కూడా అనాధ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడారని గుర్తు చేశారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ అనాథ పిల్లల భవితవ్యంపై దృష్టి సారించాలని, జువనైల్ జస్టిస్ ప్రకారం నేరం ఆరోపించబడిన పిల్లలు, పట్టించుకొనే వారు లేని పిల్లలుగా వర్గీకరించారని తెలిపారు. అందరూ కూడా పిల్లల భవిష్యత్తు విషయంలో ఒక బాధ్యత కలిగి ఉండాలని, నేరం ఆరోపించబడిన పిల్లలు నేరస్ధులు కాదని ఆయన అన్నారు. వాళ్లు బాధితులని, నేరం ఆరోపించబడిన పిల్లలతో మృదువుగా ప్రవర్తించాలని చెప్పారు. అనాథ పిల్లల మానసిక స్ధితిగతులను అర్ధం చేసుకుని వారితో మెలగాలని, వారి దత్తత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనాథ పిల్లలకు పునరావాస కల్పన చాలా జాగ్రత్తగా చేయాలని, ప్రభుత్వాలు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేసి పిల్లలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. వారికి కుటుంబ వాతావరణం కల్పించాలని, ఓల్డేజ్ హోమ్‌ల దగ్గరలో జువనైల్ హోంలు కూడా ఉండాలని చెప్పారు. లీగల్ క్లియరెన్స్ విషయంలో సీడబ్ల్యూసీల విధానాలలో ఇంకా మార్పులు రావాలని, సీడబ్ల్యూసీ, ఆరాలలో ఉన్న ఇబ్బందులతో దత్తత చేయడం ఆలస్యం అవుతోందన్నారు. బాధ్యులందరూ కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. -
తొలిసారి హైకోర్టులో ఈ–లోక్ అదాలత్
సాక్షి, అమరావతి: హైకోర్టులో శనివారం నిర్వహించిన ఈ–లోక్ అదాలత్‌లో 187 కేసులు పరిష్కారం అయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మోటారు వాహన ప్రమాద అప్పీళ్లను ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ–లోక్ అదాలత్‌కు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ నైనాల జయసూర్య నేతృత్వం వహించారు. 192 కేసులు విచారణకు రాగా, అందులో ఇద్దరు న్యాయమూర్తులు 187 కేసులు పరిష్కరించారు. బాధితులకు రూ.76.91 లక్షలు పరిహారంగా నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో హైకోర్టులో తొలిసారి ఈ–లోక్ అదాలత్ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో బీమా కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ–లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించినవారందరికీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఏవీ రమణకుమారి శనివారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
ఆయుష్మాన్ ఖురానా సినిమాకు తాప్సీ బ్రేక్
ఆయుష్మాన్ ఖురానా, జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శుభ్ మంగళ్ జ్యాద సావధాన్’. ఇద్దరబ్బాయిల మధ్య ప్రేమ.. అంటూ కొత్త కాన్సెప్ట్‌తో తరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలైంది. దీని ట్రైలర్ విషయానికొస్తే.. హీరోలిద్దరూ ఓ పార్టీలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే, అందులో తప్పేముంది అన్నట్లుగా వాళ్లు ప్రవర్తించే తీరు మాత్రం ప్రేక్షకులకు తప్పకుండా నవ్వు తెప్పిస్తుంది. ఇక ట్రైలర్లోనే నవ్వులు పూయించిన దర్శకుడు హితేశ్ కేవాల్యా సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించడంలో సఫలీకృతమయ్యాడు. (రాహు మూవీ రివ్యూ చదివేయండి) ఈ సినిమాలో నీనా గుప్తా, గజరాజ్ రావు, సునీతా రాజ్వార్, మను రిషి చద్దా, మాన్వీ గగ్రూ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలైన తొలినాడే రూ.9.55 కోట్ల కలెక్షన్లతో గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది. థియేటర్లలో దూకుడు ప్రదర్శించిన ఈ సినిమా ఆదివారం మూడున్నర కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లతో కలుపుకుని పదిరోజుల్లోనే రూ.50 కోట్ల మైలురాయిని అవలీలగా దాటేసింది. కాగా దీని వసూళ్ల పర్వానికి ఫిబ్రవరి 28న విడుదలైన తాప్సీ ‘థప్పడ్’ చిత్రం అడ్డుకట్ట వేసింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రశంసలు కురిపిస్తుంటే మరో వర్గం మాత్రం విమర్శలు గుప్పిస్తోంది.(థప్పడ్ మూవీ రివ్యూ) ఆయుష్మాన్ ఖురానా సినిమాపై ట్రంప్ ట్వీట్ -
‘నలుగురు అబ్బాయిలను ముద్దు పెట్టుకున్నా’
కొత్త కథలతో ముందుకు వచ్చే బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా నటించిన చిత్రం ‘శుభ్ మంగళ్ జ్యాద సావధాన్’. ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ అన్నకాన్సెప్ట్తో ఈ సినిమా సాగుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పెళ్లి మండపంలో హీరో సహనటుడు జితేంద్ర కుమార్‌ను అందరి ముందే ముద్దాడటం వంటి సీన్లు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఆన్ స్క్రీన్‌పై మాత్రమే కాకుండా నిజజీవితంలోనూ ఇలాంటి అనుభవం ఎదురైందంటూ వారి గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు ఖురానా, జితేంద్ర.(‘గే’ పాత్రలో కనిపించనున్న స్టార్ హీరో!) ఆయుష్మాన్ మాట్లాడుతూ.. ట్రూత్ అండ్ డేర్ ఆట ఆడుతున్న సమయంలో అబ్బాయిని కిస్ చేయాలని టాస్క్ ఇచ్చారన్నాడు. దీంతో ధైర్యంగా ముందుకు వచ్చి తోటివాడిని ముద్దుపెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక సహనటుడు జితేంద్ర మాట్లాడుతూ.. కాలేజీలో ర్యాగింగ్ ద్వారా తనకు చేదు అనుభవం జరిగిందన్నాడు. ‘ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఓరోజు నన్ను పిలిచి నలుగురు అబ్బాయిలకు ముద్దు పెట్టాలని ఒత్తిడి చేశారు. ఇప్పుడంటే ర్యాగింగ్‌పై నిషేధం ఉంది కానీ ఆ సమయంలో ర్యాగింగ్ రక్కసి రాజ్యమేలుతోందని, దీంతో వాళ్లు చెప్పింది చేయక తప్పలేద’ని వాపోయాడు. కాగా కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఔను.. వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు) -
సత్వరం న్యాయం అందించడం దైవ కార్యం
సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థపై ప్రజలు ఎంతో నమ్మకం ఉంచారని, శీఘ్రగతిన వారికి న్యాయాన్ని అందించినప్పుడే ఆ నమ్మకానికి సార్థకత చేకూరుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి అన్నారు. ప్రజలకు న్యాయం అందించడమన్నది దైవ కార్యమని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల తొలి సదస్సు ఆదివారం గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రాంగణంలో జరిగింది. ఈ సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు 13 జిల్లాలకు చెందిన దాదాపు 530 మంది న్యాయాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయాధికారులను ఉద్దేశించి సీజే జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముకానివ్వకుండా చూసి న్యాయవ్యవస్థ ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత న్యాయాధికారులపై ఉందన్నారు. ప్రజలు మనదేశంలో న్యాయమూర్తులను దేవుళ్లలా భావిస్తారని, అందుకే న్యాయస్థానాలు ‘న్యాయ ఆలయాలు’ అయ్యాయన్నారు. దేశంలో ఎన్నో దేవాలయాలున్నా, తిరుమల, కాశీ ఇలా కొన్ని దేవస్థానాలకే అత్యంత పవిత్రత ఉందని, అలాగే అనేక రంగాలు ప్రజల కోసం పనిచేస్తున్నా, న్యాయవ్యవస్థకున్న ప్రత్యేకత వేరని తెలిపారు. న్యాయం అందించే బాధ్యత మన చేతుల్లోకి వచ్చిందంటే అది దైవకృప వల్ల మాత్రమే సాధ్యమైందని, అందువల్ల ప్రజలకు సత్వర న్యాయం అందించడాన్ని దైవ కార్యంగా భావించాలని ఆయన న్యాయాధికారులను కోరారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ఏం చేయాలి.. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు.. వాటిని ఎలా అధిగమించాలి.. తదితర అంశాలపై సూచనలు, సలహాలు అందుకునేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. హాజరైన న్యాయాధికారులు హైకోర్టు జడ్జిపై 12 వేల కేసుల భారం... అధికార గణాంకాల ప్రకారం హైకోర్టులో 1,90,431 కేసులు పెండింగ్‌లో ఉంటే, ప్రస్తుతం ఉన్నది 15 మంది న్యాయమూర్తులేనని సీజే తెలిపారు. ఆ ప్రకారం ఒక్కో న్యాయమూర్తిపై 12,695 కేసులను విచారించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. అలాగే కింది కోర్టుల్లో 5,67,630 పెండింగ్ కేసులు ఉంటే, ప్రస్తుతం ఉన్నది 529 మంది న్యాయాధికారులేనని చెప్పారు. పాత కేసుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో సరిపెట్టకుండా, కొత్త కేసులు పాత కేసులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు పెద్ద సంఖ్యలో కక్షిదారులుగా మారుతున్నాయని, ఇదే సమయంలో ప్రజల్లో వారి హక్కుల పట్ల అవగాహన పెరుగుతోందన్నారు. ఈ–ఫిర్యాదుల పరంపర చాలా వేగంగా పెరిగిందని, ఈ పరిస్థితుల్లో న్యాయాధికారులపై ఎంతో గురుతర బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. నైతికత విషయంలో రాజీపడొద్దు.. న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య సత్సంబంధాలు ఉండటం వల్ల సమర్థవంతంగా న్యాయ పాలన అందించడం సాధ్యమవుతుందని జస్టిస్ మహేశ్వరి చెప్పారు. న్యాయపాలనలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమని, వారు కూడా న్యాయమూర్తులతో సమానమని తెలిపారు. నైతికత విషయంలో న్యాయమూర్తులు ఎన్నడూ కూడా రాజీపడాల్సిన అవసరం లేదని చెప్పారు. యువ న్యాయవాదులను ప్రోత్సహించాలన్నారు. సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సీతారామమూర్తి, ఏపీ లా సెక్రటరీ మోహన్‌రెడ్డి, పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు పాల్గొన్నారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్‌కుమార్ ప్రమాణం
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్‌కుమార్ శుక్రవారం ప్రమాణం చేశారు. ఆయనతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్‌మహేశ్వరి ప్రమాణం చేయించారు. అంతకుముందు జస్టిస్ రాకేష్‌కుమార్ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను రిజిస్ట్రార్ జనరల్ (ఇన్చార్జి) రాజశేఖర్ చదివి వినిపించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, జస్టిస్ రాకేష్‌కుమార్ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ రాకేష్‌కుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జస్టిస్ మహేశ్వరితో కలిసి కేసులను విచారించారు. జస్టిస్ రాకేష్‌కుమార్ రాకతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 15కు చేరింది. -
ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ జితేంద్రకుమార్
-
హైకోర్టు సీజేగా జీకే మహేశ్వరి ప్రమాణస్వీకారం
-
ఏపీ హైకోర్టు తొలి సీజేగా జీకే మహేశ్వరి ప్రమాణం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకారానికి జీకే మహేశ్వరి కుటుంబసభ్యులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, హైకోర్టు అడ్మిన్ రిజిస్ట్రార్ పురుషోత్తం, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. అనంతరం తుమ్మల పల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో సీజే జేకే మహేశ్వరి,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. జస్టిస్ మహేశ్వరి నేపథ్యం.. జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు సీజేగా 2023 జూన్ 28న పదవీ విరమణ చేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మనసున్న మేడమ్
అందరమూ మనుషులమే, మామూలు మనుషులమే. బస్‌లో ప్రయాణిస్తూ కారులో వెళ్లే వాళ్లను చూస్తాం, చిన్న కారులో వెళ్తూంటే పెద్ద కార్ల వంక చూస్తాం. అద్దె ఇంట్లో ఉంటే సొంత ఇంటి గురించి ఆలోచిస్తాం. సొంత ఫ్లాట్‌లో ఉంటే ఇండిపెండెంట్ హౌస్ గురించి ఆలోచిస్తాం. వందమందిలో ఎనభై మంది ఇలా ఆలోచిస్తే... ఓ ఇరవై మంది ఇందుకు భిన్నంగా ఆలోచించే వాళ్లుంటారు. సీమ కూడా అలా భిన్నంగా ఆలోచించే మనిషే. సీమ ఇంటి నుంచి కాలు బయటపెడితే ప్రభుత్వ వాహనం సిద్ధంగా ఉంటుంది. కలెక్టర్‌కు అందినంత గౌరవం కలెక్టర్ భార్యగా ఆమెకూ అందుతుంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువగా కూడా. అయితే ఆమె దృష్టి గౌరవ వందనాలను దాటి సమాజపు లోతులను తాకింది. ఒకరోజు రోడ్డు మీద కారులో వెళ్తున్న సీమ రోడ్డు పక్కన బొమ్మలు అమ్ముకునే పిల్లలను, కారు అద్దాలు తుడిచి చెయ్యి చాచే పిల్లలను, డొక్కలు ఎండిపోయి, చింపిరి జుత్తుతో బిక్క ముఖాలు వేసుకుని ఉండే పిల్లలను చూసింది. చేతిలో పడ్డ పైసలతో రోడ్డు పక్కనే దొరికినది కొనుక్కుని ఆ దుమ్ములోనే తింటున్న పిల్లలను చూసి ‘ఎవరి బాల్యమూ ఇలా ఉండకూడదు. పువ్వులాంటి బాల్యం వికసించకుండానే వాడి రాలిపోకూడదు. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, ఆ పేదరికాన్ని వాళ్ల నుంచి దూరం చేయాలని ఎవరూ అనుకోకపోవడమే తప్పు’ అనుకుంది. కారు దిగి వాళ్ల దగ్గరకు వెళ్లింది. ఆమె కంటపడిన వారినందరినీ బంగ్లాకు తీసుకెళ్లింది. వాళ్లకు మంచి భోజనం పెట్టి, దుస్తులు తెప్పించి ఇచ్చింది. ఒక గదిని ఈ పిల్లల కోసమే కేటాయించి వాళ్లకు చదువు చెప్పడం మొదలు పెట్టింది. అలా పాతిక మంది పిల్లలు అయ్యారు. సీమ లక్నోలో ఐఏఎస్ ఆఫీసర్ జితేంద్ర కుమార్ భార్య. అన్నం పెట్టి చదువు చెబుతుంది ఆమె చేస్తున్న సర్వీస్ చూసిన ఆమె భర్త జితేందర్ కుమార్ సీమ కోసం ఒక కారును, డ్రైవర్‌ను ఇచ్చాడు. ఆ డ్రైవర్ రోజూ ఆ పిల్లలు నివసించే వాడలకు వెళ్లి వాళ్లను కారులో ఎక్కించుకుని కలెక్టర్ బంగ్లాకు తీసుకువస్తాడు. ఆ పిల్లలందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు కలెక్టర్ బంగ్లాలోనే. పగలంతా చదువుకుంటారు, గార్డెన్లో ఆడుకుంటారు. సాయంత్రం డ్రైవర్ తిరిగి వాళ్లను ఇళ్ల దగ్గర దించుతాడు. పిల్లలు కూడా సంతోషంగా వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కలెక్టర్ గారి భార్య కావడంతో ధైర్యంగా పంపిస్తున్నారు. ఇతర ఎన్జీవోలు ఇలాంటి పని చేయడానికి ముందుకు వచ్చినా కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొనడం పెద్ద సమస్య అయ్యేది. మేడమ్ మాత్రమే కాదు.. అమ్మ కూడా సీమ ఆలోచన ఇప్పుడు ఒక్కటే. ఆ పిల్లలందరినీ స్కూళ్లలో చేర్చాలి. అందరికీ కలిపి ఆమె ప్రాథమికంగా చదువు చెప్పగలుగుతోంది. కానీ పెద్ద క్లాసులకు సబ్జెక్టుల వారీగా అన్నీ చెప్పడం ఒకరితో అయ్యే పని కాదు. వాళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ప్రధాన స్రవంతిలో చదువుకోవాలనేది ఆమె కోరిక. వాళ్లంతా ప్రయోజకులైతే రేపటి తరంలో సమాజంలో పాతిక కుటుంబాల జీవన స్థితిగతులు మెరుగవుతాయంటారామె. సీమ మేడమ్ మాకు టీచరే కాదు, అమ్మతో సమానం అంటున్నాడు ఆమె పెంపకంలో ఉన్న ఆదిత్య. – మంజీర -
భోపాల్ రైలులో పేలుడు
10 మందికి గాయాలు.. అదుపులో ముగ్గురు అనుమానితులు షాజాపూర్(ఎంపీ): మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో జబ్డి స్టేషన్ సమీపంలో మంగళవారం భోపాల్–ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో ఐఈడీ పేలడంతో 10మంది గాయపడ్డారు. సాధారణ బోగీలో ఉదయం ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని ఇండోర్ రైల్వే పీఆర్వో జితేంద్రకుమార్ తెలిపారు. పేలుడు ఉగ్రవాదుల చర్యని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, కుట్రని పూర్తిగా ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ చెప్పారు. హోసంగాబాద్ జిల్లాలోని పాపారియా పట్టణంలో పోలీసులు ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ఒక్కసారిగా బోగీని పొగ కమ్మేయడంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో రైలును కొద్దిసేపు నిలిపివేశారు. ఈ ప్రమాదంలో రైలులోని రెండు బోగీలు ధ్వంసమయ్యాయని, వాటిని వేరుచేసిన తరువాత రైలు బయల్దేరిందని పీఆర్వో వెల్లడించారు. ప్రమాదం జరిగిన చోటు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 81 కి.మీ. దూరంలో ఉంది. విషయం తెలిసిన వెంటనే బాంబు నిర్వీర్య బృందం అక్కడికి చేరుకుని పేలుడు స్వభావం, కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున∙పరిహారం ప్రకటించింది.