10 మందికి గాయాలు.. అదుపులో ముగ్గురు అనుమానితులు
షాజాపూర్(ఎంపీ): మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో జబ్డి స్టేషన్ సమీపంలో మంగళవారం భోపాల్–ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో ఐఈడీ పేలడంతో 10మంది గాయపడ్డారు. సాధారణ బోగీలో ఉదయం ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని ఇండోర్ రైల్వే పీఆర్‌వో జితేంద్రకుమార్ తెలిపారు. పేలుడు ఉగ్రవాదుల చర్యని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, కుట్రని పూర్తిగా ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ చెప్పారు.
హోసంగాబాద్ జిల్లాలోని పాపారియా పట్టణంలో పోలీసులు ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ఒక్కసారిగా బోగీని పొగ కమ్మేయడంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో రైలును కొద్దిసేపు నిలిపివేశారు. ఈ ప్రమాదంలో రైలులోని రెండు బోగీలు ధ్వంసమయ్యాయని, వాటిని వేరుచేసిన తరువాత రైలు బయల్దేరిందని పీఆర్‌వో వెల్లడించారు. ప్రమాదం జరిగిన చోటు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 81 కి.మీ. దూరంలో ఉంది. విషయం తెలిసిన వెంటనే బాంబు నిర్వీర్య బృందం అక్కడికి చేరుకుని పేలుడు స్వభావం, కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున∙పరిహారం ప్రకటించింది.