జైపూర్: రాజస్తాన్‌లోని దౌసాలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దళిత బాలికపై దారుణానికి తెగించిన సబ్ ఇన్‌స్పెక్టర్‌పై జనం దాడి చేసి, కొట్టారు. ఎన్నికల వేళ జరిగిన ఘటనపై అధికార కాంగ్రెస్‌పై బీజేపీ దుమ్మెత్తి పోసింది. లాల్‌సోత్ ఏరియాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
దారుణానికి పాల్పడిన సబ్ ఇన్‌స్పెకర్ భూపేంద్ర సింగ్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాయమాటలతో బాలికను తన గదికి తీసుకువచ్చి, దారుణానికి పాల్పడినట్లు ఏఎస్‌పీ రామచంద్ర సింగ్ నెహ్రా పీటీఐకి చెప్పారు. ఘటన విషయం తెలిసి కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహువాస్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు.
ఎస్‌ఐ భూపేంద్ర సింగ్‌ను రోడ్డుపైకి లాగి బట్టలు చిరిగేలా రాళ్లు, కర్రలతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రజలు అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భూపేంద్ర సింగ్‌పై పోక్సో చట్టం, ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం కింద కేసులు పెట్టామని ఎస్‌పీ వందితా రాణా చెప్పారు. అతడిని అరెస్ట్ చేసి, ఘటనపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షలకు పంపామన్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు.
ఇది కూడా కాంగ్రెస్ గ్యారంటీయే: బీజేపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాలికలను కాపాడాలి (బేటీ బచావో) అని నినదిస్తుండగా రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ సర్కారు మాత్రం రేపిస్టులను కాపాడాలి(రేపిస్టు బచావో) అని అంటోందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఈ ఘటన రాజస్తాన్‌కు మాత్రమే కాదు, మొత్తం దేశానికే అవమానకరమని విమర్శించారు. పోలీసులు, ఇతర అధికారులు మహిళలు, బాలికలపై పాల్పడిన అఘాయిత్యాలకు సంబంధించిన అనేక ఘటనలను పూనావాలా ఉదహరించారు. ఎన్నికల వేళ కూడా రేపిస్టులు ఎంతో ధీమాతో ఉన్నట్లు దీనితో అర్థమవుతోందని ఆరోపించారు.
తాజా ఘటన కూడా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీయేనని వ్యాఖ్యానించారు. దళితులు, మహిళలపై జరుగుతున్న దారుణాల్లో రాజస్తాన్ మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. దారుణాన్ని గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఉమేశ్ మిశ్రాను ఆయన ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం చేతకానితనంతో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాధిత బాలిక కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment