Bhupendra Singh
-
రాజస్తాన్‌లో అమానుషం
జైపూర్: రాజస్తాన్‌లోని దౌసాలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దళిత బాలికపై దారుణానికి తెగించిన సబ్ ఇన్స్పెక్టర్పై జనం దాడి చేసి, కొట్టారు. ఎన్నికల వేళ జరిగిన ఘటనపై అధికార కాంగ్రెస్‌పై బీజేపీ దుమ్మెత్తి పోసింది. లాల్సోత్ ఏరియాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దారుణానికి పాల్పడిన సబ్ ఇన్స్పెకర్ భూపేంద్ర సింగ్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాయమాటలతో బాలికను తన గదికి తీసుకువచ్చి, దారుణానికి పాల్పడినట్లు ఏఎస్పీ రామచంద్ర సింగ్ నెహ్రా పీటీఐకి చెప్పారు. ఘటన విషయం తెలిసి కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహువాస్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఎస్ఐ భూపేంద్ర సింగ్‌ను రోడ్డుపైకి లాగి బట్టలు చిరిగేలా రాళ్లు, కర్రలతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రజలు అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భూపేంద్ర సింగ్‌పై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టామని ఎస్పీ వందితా రాణా చెప్పారు. అతడిని అరెస్ట్ చేసి, ఘటనపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షలకు పంపామన్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు. ఇది కూడా కాంగ్రెస్ గ్యారంటీయే: బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాలికలను కాపాడాలి (బేటీ బచావో) అని నినదిస్తుండగా రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ సర్కారు మాత్రం రేపిస్టులను కాపాడాలి(రేపిస్టు బచావో) అని అంటోందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఈ ఘటన రాజస్తాన్‌కు మాత్రమే కాదు, మొత్తం దేశానికే అవమానకరమని విమర్శించారు. పోలీసులు, ఇతర అధికారులు మహిళలు, బాలికలపై పాల్పడిన అఘాయిత్యాలకు సంబంధించిన అనేక ఘటనలను పూనావాలా ఉదహరించారు. ఎన్నికల వేళ కూడా రేపిస్టులు ఎంతో ధీమాతో ఉన్నట్లు దీనితో అర్థమవుతోందని ఆరోపించారు. తాజా ఘటన కూడా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీయేనని వ్యాఖ్యానించారు. దళితులు, మహిళలపై జరుగుతున్న దారుణాల్లో రాజస్తాన్ మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. దారుణాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఉమేశ్ మిశ్రాను ఆయన ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం చేతకానితనంతో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాధిత బాలిక కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
వరదలకు గుజరాత్ అతలాకుతలం
అహ్మదాబాద్: గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లతున్నాయి. వరదలతో అతలాకుతల మవుతున్న పలు గ్రామాలతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. వల్సాద్ ప్రాంతలోని దర్మపూర్లో గత 24 గంటల్లో ఏకంగా 23.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో జామ్‌నగర్‌లో వరద పరిస్థితి భయంకరంగా ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే గత రెండు రోజుల్లో 11 మంది మరణించారు. సురేంద్ర నగర్ జిల్లాలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ధ్వంసం కావడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. తాజా వరద పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట ముఖ్యమంత్రి భూపేంద్రతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆపదలో ఉన్న ప్రజలకి సాధ్యమైనంతవరకు సాయం అందిస్తోందని షా ట్వీట్‌చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు స్థానియ యంత్రాంగం కూడా వరద ప్రాంతాల్లో సహాయ చర్యల్లో ముగినిపోయిందని అమిత్ తెలిపారు. -
25 శాతం స్కూలు ఫీజు రద్దు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని సెల్ఫ్ ఫైనాన్స్డ్ పాఠశాలలు 2020–21 విద్యా సంవత్సరానికి గానూ 25 శాతం ట్యూషన్ ఫీజును తగ్గించుకోవడానికి అంగీకరించాయని గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ చూడసమ తెలిపారు. రాష్ట్రంలోని సీబీఎస్ఈ పాఠశాలలు సహా అన్ని పాఠశాలలు దీన్ని అనుసరించాల్సిందేనని ఆయన అన్నారు. పాఠశాలలు రవాణా ఫీజులు సహా ఎలాంటి అదనపు ఫీజులను వసూలు చేయబోవని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒకవేళ తల్లిదండ్రులు ఇప్పటికే ఫీజు చెల్లించి ఉంటే, వాటిని రాబోననే నెలలకు అడ్జస్ట్ చేయాలని చెప్పారు. గుజరాత్ లో గత 180 రోజులకు పైగా మూసే ఉన్నాయి. ఆన్లైన్ క్లాసులకు కేవలం 40శాతం విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు చెప్పారు. -
హరియాణాలో రాజకీయ వేడి
హరియాణాలో రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అగ్రనాయకులంతా హరియాణాలో మకాం వేస్తున్నారు. దీంతో హోరాహోరీ నెలకొంది. రాష్ట్రంలో 2009 వరకు కాంగ్రెస్ హవా కొనసాగినా 2014 తొలిసారి బీజేపీ పాగా వేసింది. గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పదికి పది స్థానాల్లోనూ విజయఢంకా మోగించిన కమలం ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనని ధీమాతో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో అంతర్గ కుమ్ములాటలు కూడా బీజేపీకి మరింత బలాన్నిస్తున్నాయి. అయితే కుమారి సెల్జా నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఎలాగైనా పగ్గాలు చేజిక్కించుకోవాలని కసరత్తు చేస్తోంది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుంది. ‘కశ్మీర్’ పనిచేస్తుందా? బీజేపీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ ప్రజాప్రదర్శనలాంటి పలు కార్యక్రమాలు చేపట్టింది. అస్సాంలో మాదిరిగా హరియాణాలో అక్రమ వలసల నివారణకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కోనున్న ప్రధాన సవాల్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) నుంచే. అయితే మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలైన కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, ముస్లిం మైనారిటీ మహిళల హక్కులను కాపాడే త్రిపుల్ తలాక్ రద్దు చట్టం ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలన్నది నిపుణుల అంచనా. హరియాణాలో 18 ఏళ్ళ తరువాత జాట్‌యేతరుడైన ఖట్టర్ సీఎం అయ్యారు. అయినా జాట్ల ఉద్యమాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్న వేళ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి. మోదీతో సహా బీజేపీ అగ్రనేతలంతా ప్రచారానికి దిగుతున్నారు. దీంతో అంతర్గత కుమ్ములాటలు చల్లారే అవకాశం ఉంది. భూపేందర్ స్థానమెక్కడ? హరియాణాలో 27 శాతం జాట్ సామాజికవర్గాలే ఉన్నాయి. గతంలో ఐదుగురు ముఖ్యమంత్రులు ఇదే సామాజికవర్గం నుంచి ఉన్నారు. స్వయంగా భూపేందర్ సింగ్ హుడా, అతని కుమారుడు దీపేందర్ సింగ్ హుడా సోనాపేట్, రోహతక్‌ల నుంచి 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. జాట్ సామాజిక వర్గం ఆధిపత్యంలోని ఈ ప్రాంతం ఒకప్పుడు భూపేందర్‌కి బలమైన ప్రాంతం. ఈసారి సైతం కష్టతరమేనని నిపుణులు అభిప్రాయం. కాంగ్రెస్‌లో లుకలుకలు రాష్ట్రంలో పునర్వైభవాన్ని తీసుకొచ్చే మాట అటుంచి, అసలు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అంతేలేదు. స్వయంగా రాహుల్ గాంధీయే ఏరికోరి పీసీసీ అధ్యక్షుడిని చేసిన దళిత నేత అశోక్ తన్వర్‌ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ పై ఈ వర్గాలు తాడోపేడో అన్నట్టున్నాయి. అంతేకాదు. ఏకంగా ఢిల్లీలో సోనియా నివాసం ముందు ధర్నాకి కూడా దిగారు. దీంతో విసిగిపోయిన శ్రేణులు బీజేపీలో చేరిపోయారు. రేపటి నుంచి రాహుల్ ప్రచారం ప్రారంభమౌతున్నా కాంగ్రెస్‌ని నిరాశాభావం వెంటాడుతోంది. -
హూడా, వోరాలపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: భూ కేటాయింపు కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హూడా, కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరాలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పంచకులలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కేటాయించిన స్థలం విషయంలో అవకతవకలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. పంచకులలోని స్థలం మోతీలాల్ వోరా చైర్మన్‌గా ఉన్న ఏజేఎల్‌కు కేటాయించిన విషయంలో ఖజానాకు రూ.67 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రత్యేక కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఏజేఎల్ గాంధీ కుటుంబ సభ్యులు, ఇతర కాంగ్రెస్ పెద్దల అధీనంలో నడుపబడుతున్న సంస్థ. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏజేఎల్ ఆధ్వర్యంలో వెలువడుతున్న విషయం విదితమే. -
24 ఏళ్ల సర్వీసు.. 51 పోస్టులు.. మెగా దంగల్
చండీగఢ్: హరియణా కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా.. 52 ఏళ్లకే.. 51 పోస్టింగ్‌లు.. 24 ఏళ్ల సర్వీసులో తరచుగా బదిలీలు... అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తినందుకు ఆయనకు లభించిన బహుమానాలు. నిజాయితీ, కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సాహసం చేసినందుకు ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులు.. కానీ ఆయన నిజాయితీ ముందు ఇవేమి నిలవలేకపోయాయి. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు గుర్గావ్లో భూమార్పిడిని నిలిపివేసి ఒక్కసారిగా అశోక్ వార్తల్లోకెక్కారు. అంతేకాదు హరియణా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పాలనలో చోటుచేసుకున్న అనేక కుంభకోణాలను బయటపెట్టారు. ఆ కారణంగానే తరచుగా ట్రాన్స్ఫర్లు.. ప్రస్తుతం ఆయన ‘మెగా దంగల్’కు సిద్ధం అవుతున్నారు. ఎన్నో బదిలీల తర్వాత అశోక్ ఖేమ్కా హరియణా రాష్ట్ర యువజన, క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన క్రీడాకారులతో నిండి ఉన్న హరియణా వంటి రాష్ట్రంలో ఇంత పెద్ద ఈవెంట్‌కు నిర్ణయకర్తగా వ్యవహరించడం గర్వంగా ఉందన్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో కూడా అత్యధిక పతకాలు సాధించింది హరియణా క్రీడాకారులేనన్నారు. పోటీతత్వానికి మారుపేరుగా నిలిచే క్రీడాకారులకు జీవనోపాధి కల్పించడం కనీస బాధ్యత అని, అందుకోసం వారికి ఉద్యోగాలు కల్పించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో కూడిన క్రీడా అకాడమీలు పెంచడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. మార్చి21 నుంచి 23 వరకు జరిగే మల్లయుద్ధ పోటీల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నానని అశోక్ ఖేమ్కా చెప్పారు. ఉద్యోగం ఉంటేనే భద్రత.. ‘ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత ప్రతిభకు గుర్తింపుగా ఎంతో కొంత పారితోషకం లభిస్తుంది. కానీ జీవితం సాఫీగా సాగాలంటే ఉద్యోగం అవసరం. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకోసం ప్రతిభకు పదునుపెట్టాలి. ఒలింపిక్స్‌లో భారత్‌కు 5 నుంచి 10 పతకాలు హర్యానా క్రీడాకారులు అందిస్తారని’ అశోఖ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మెగా దంగల్ ఎందుకంటే.. స్వాతంత్ర్య సమర యోధులు.. భగత్ సింగ్, శివరాం హరి రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్లను ఉరి తీసిన రోజును హరియణాలో సహేదీ దివస్‌గా జరుపుతారు. ఈ రోజును పురస్కరించుకుని హర్యానా ప్రభుత్వం మల్ల యుద్ధ పోటీలు నిర్వహిస్తోంది. రూ.1.8 కోట్ల భారీ ప్రైజ్ మనీ అందిస్తోంది. ‘ఈ పోటీలను విజయవంతం చేసేందుకు ఇండోర్ స్టేడియంను సిద్ధం చేశామని, ప్రేక్షకుల కోసం ఈసారి ఏసీలు కూడా ఏర్పాటు చేశామని’ క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అశోఖ్ తెలిపారు. -
రాహుల్‌పై హోంమంత్రి ఘాటు విమర్శలు
మాంద్సౌర్: ‘ఒక హెల్మెట్ కూడా ధరించకుండా కాలేజీ విద్యార్థిలాగా రాహుల్‌గాంధీ బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక జాతీయ పార్టీ నేత వెళ్లడం తగదు’ అని మధ్యప్రదేశ్ హోమంత్రి భూపేంద్ర సింగ్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని మాంద్సౌర్లో పోలీసుల కాల్పుల్లో చనిపోయి, గాయాలపాలయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మద్దతుదారులతో కలిసి వచ్చారు. అయితే, మాంద్‌సౌర్‌కు కిలోమీటర్ దూరం ఉండగానే ఆయనను అడ్డుకునేందుకు పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేశారు. తొలుత కారులో వచ్చిన ఆయన బారీకేడ్స్‌ను దాటేసి ముందుకెళ్లే యత్నం చేశారు. అడ్డుకోవడంతో వెంటనే ఒక బైక్ తీసుకున్నారు. అక్కడ ఆపేయడంతో దిగి వెంటనే మరో బైక్ తీసుకున్న ఆయన మరింత వేగంగా ముందుకు కదిలారు. మళ్లీ అడ్డుకోవడంతో చివరకు కాలినడకన చేరేందుకు ప్రయత్నం చేయగా చివరకు పోలీసులు అదుపులోకి తీసుకొని తొలుత గెస్ట్‌హౌస్‌కి అటు నుంచి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో బైక్ తీసుకుని వెళ్లే సమయంలో రాహుల్ హెల్మెట్ కూడా లేకుండా కాలేజీ కుర్రాడిలా వెళ్లారని, జాతీయ నేతకు అది సరికాదంటూ రాష్ట్ర హోంమంత్రి విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ తాము రైతులకు సానుభూతిగా వెళ్లామని, అందరూ శాంతియుతంగా ఉండాలని, సామరస్యం పూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేందుకు వెళ్లామని, పోలీసులు మాత్రం చాలా అతి చేశారని మండిపడ్డారు. బాధిత కుటుంబాల వాళ్లు తమను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నా వారు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భోపాల్ రైలులో పేలుడు
10 మందికి గాయాలు.. అదుపులో ముగ్గురు అనుమానితులు షాజాపూర్(ఎంపీ): మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో జబ్డి స్టేషన్ సమీపంలో మంగళవారం భోపాల్–ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో ఐఈడీ పేలడంతో 10మంది గాయపడ్డారు. సాధారణ బోగీలో ఉదయం ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని ఇండోర్ రైల్వే పీఆర్వో జితేంద్రకుమార్ తెలిపారు. పేలుడు ఉగ్రవాదుల చర్యని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, కుట్రని పూర్తిగా ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ చెప్పారు. హోసంగాబాద్ జిల్లాలోని పాపారియా పట్టణంలో పోలీసులు ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ఒక్కసారిగా బోగీని పొగ కమ్మేయడంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో రైలును కొద్దిసేపు నిలిపివేశారు. ఈ ప్రమాదంలో రైలులోని రెండు బోగీలు ధ్వంసమయ్యాయని, వాటిని వేరుచేసిన తరువాత రైలు బయల్దేరిందని పీఆర్వో వెల్లడించారు. ప్రమాదం జరిగిన చోటు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 81 కి.మీ. దూరంలో ఉంది. విషయం తెలిసిన వెంటనే బాంబు నిర్వీర్య బృందం అక్కడికి చేరుకుని పేలుడు స్వభావం, కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున∙పరిహారం ప్రకటించింది.