24 ఏళ్ల సర్వీసు.. 51 పోస్టులు.. మెగా దంగల్‌ | Ashok Khemkas New Dangal | Sakshi
Sakshi News home page

ఓ ఐఏఎస్‌ ట్రాక్‌ రికార్డ్‌..

Published Wed, Mar 21 2018 10:54 AM | Last Updated on Wed, Mar 21 2018 1:01 PM

Ashok Khemkas New Dangal - Sakshi

అశోక్‌ కేమ్‌కా

చండీగఢ్‌: హరియణా కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్‌కా.. 52 ఏళ్లకే.. 51 పోస్టింగ్‌లు.. 24 ఏళ్ల సర్వీసులో తరచుగా బదిలీలు... అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తినందుకు ఆయనకు లభించిన బహుమానాలు. నిజాయితీ, కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సాహసం చేసినందుకు ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులు.. కానీ ఆయన నిజాయితీ ముందు ఇవేమి నిలవలేకపోయాయి.

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు గుర్గావ్‌లో భూమార్పిడిని నిలిపివేసి ఒక్కసారిగా అశోక్‌ వార్తల్లోకెక్కారు. అంతేకాదు హరియణా మాజీ సీఎం భూపేందర్‌ సింగ్‌ హుడా పాలనలో చోటుచేసుకున్న అనేక కుంభకోణాలను బయటపెట్టారు. ఆ కారణంగానే తరచుగా ట్రాన్స్‌ఫర్లు.. ప్రస్తుతం ఆయన ‘మెగా దంగల్‌’కు సిద్ధం అవుతున్నారు. ఎన్నో బదిలీల తర్వాత అశోక్‌ ఖేమ్‌కా హరియణా రాష్ట్ర యువజన, క్రీడా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన క్రీడాకారులతో నిండి ఉన్న హరియణా వంటి రాష్ట్రంలో ఇంత పెద్ద ఈవెంట్‌కు నిర్ణయకర్తగా వ్యవహరించడం గర్వంగా ఉందన్నారు. 2010 కామన్వెల్త్‌ క్రీడల్లో కూడా అత్యధిక పతకాలు సాధించింది హరియణా క్రీడాకారులేనన్నారు. పోటీతత్వానికి మారుపేరుగా నిలిచే క్రీడాకారులకు జీవనోపాధి కల్పించడం కనీస బాధ్యత అని, అందుకోసం వారికి ఉద్యోగాలు కల్పించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ప్రైవేటు​, పబ్లిక్‌ భాగస్వామ్యంతో కూడిన క్రీడా అకాడమీలు పెంచడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. మార్చి21 నుంచి 23 వరకు జరిగే మల్లయుద్ధ పోటీల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నానని అశోక్‌ ఖేమ్‌కా చెప్పారు.

ఉద్యోగం ఉంటేనే భద్రత..
‘ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత ప్రతిభకు గుర్తింపుగా ఎంతో కొంత పారితోషకం లభిస్తుంది. కానీ జీవితం సాఫీగా సాగాలంటే ఉద్యోగం అవసరం. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకోసం ప్రతిభకు పదునుపెట్టాలి. ఒలింపిక్స్‌లో భారత్‌కు 5 నుంచి 10 పతకాలు హర్యానా క్రీడాకారులు అందిస్తారని’ అశోఖ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

మెగా దంగల్‌ ఎందుకంటే..
స్వాతంత్ర్య సమర యోధులు.. భగత్‌ సింగ్‌, శివరాం హరి రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ థాపర్‌లను ఉరి తీసిన రోజును హరియణాలో సహేదీ దివస్‌గా జరుపుతారు. ఈ రోజును పురస్కరించుకుని హర్యానా ప్రభుత్వం మల్ల యుద్ధ పోటీలు నిర్వహిస్తోంది. రూ.1.8 కోట్ల భారీ ప్రైజ్‌ మనీ అందిస్తోంది. ‘ఈ పోటీలను విజయవంతం చేసేందుకు ఇండోర్‌ స్టేడియంను సిద్ధం చేశామని, ప్రేక్షకుల కోసం ఈసారి ఏసీలు కూడా ఏర్పాటు చేశామని’ క్రీడా శాఖ ప్రిన్సిపల్‌ సె​క్రటరీ అశోఖ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement