Ashok khemka
-
వేతనాల్లో ఇంత తేడానా? పదేళ్లలో పెరిగిన సీఈఓ, ఫ్రెషర్స్ శాలరీ రిపోర్ట్
భారతదేశం ఇతర దేశాలతో పోటీపడాలన్నా, ప్రగతి సాధించాలన్నా.. యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాటలతో కొందరు ఏకీభవించగా, మరికొందరు వ్యతిరేకించారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఐఏఎస్ 'అశోక్ ఖేమ్కా' (Ashok Khemka) తాజాగా ఒక ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అశోక్ ఖేమ్కా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన పోస్ట్‌లో ఐటీ కంపెనీలలో పనిచేసే ఫ్రెషర్స్, సీఈఓల శాలరీలలో వ్యత్యాసం చూడవచ్చు. దీని ప్రకారం.. 2012లో రూ. 2.75 లక్షల వేతనం పొందే ఇన్ఫోసిస్ ఫ్రెషర్ శాలరీ 2022 నాటికి రూ. 3.6 లక్షలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే 10 సంవత్సరాల్లో ఒక ఫ్రెషర్ జీతం కేవలం రూ. 85,000 మాత్రమే పెరిగింది. అయితే 2012లో రూ. 80 లక్షల వేతనం తీసుకునే సీఈఓ శాలరీ 2022 నాటికి రూ. 79.75 కోట్లకు చేరింది. దశాబ్ద కాలంలో పెరిగిన ఫ్రెషర్ వేతనం, సీఈఓ వేతనాల వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, L & K ఇన్ఫోటెక్, హెచ్‌సీఎల్, మీడియన్ (Median) సంస్థల్లో కూడా ఇదే విధానం కొనసాగుతోంది. సీఈఓల జీతాలు భారీగా పెరుగుతున్నాయి, ఫ్రెషర్ల వేతనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇదీ చదవండి: రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం.. అశోక్ ఖేమ్కా ఈ పోస్ట్ షేర్ చేస్తూ.. ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఫ్రెషర్ వేతనానికి 2,200 రెట్లు ఎక్కువ. సీఈఓ, ఫ్రెషర్ వరుసగా వారానికి ఎన్ని గంటలు పని చేస్తారు? వారానికి 168 గంటలు మాత్రమే ఉంటాయని అని వెల్లడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Infosys CEO's pay 2,200 times a fresher's pay. How many hours of work a week does the CEO and a fresher put in respectively? There are only 168 hours in a week. pic.twitter.com/DP1C4ODkAt — Ashok Khemka (@AshokKhemka_IAS) October 29, 2023 -
అశోక్ ఖేమ్కా మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యారు...
న్యూఢిల్లీ: హరియాణా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి అశోక్ ఖేమ్కా మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యారు. అదేంటి ట్రాన్స్ఫర్ అయితే అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆయన ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయింది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ తన 28 ఏళ్ల సర్వీసు కాలంలో ఏకంగా 53 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. హరియాణా ప్రభుత్వం తాజాగా ఆయన్ను ఆర్కైవ్స్ విభాగానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆఖరి సారిగా క్రీడలు, యువజన వ్యవహారాల విభాగంలో 15 నెలలపాటు పనిచేశాక ఆయన మార్చిలో ట్రాన్స్ఫర్ అయ్యారు. ‘మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యాను. రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్న మరుసటి రోజే సుప్రీంకోర్టు ఆదేశాలు, నియమాలు మరోసారి ఉల్లంఘనకు గురయ్యాయి. సర్వీసులో ఆఖరు దశకు చేరుకున్నాను. నిజాయితీకి దక్కిన గౌరవం ఇది’అని బుధవారం అశోక్ ట్వీట్‌చేశారు. -
52వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి
చండీగఢ్ : హర్యానా ప్రభుత్వం తొమ్మిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. అందులో 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి అశోక్ ఖేమ్కా ఒకరు. 2012లో కాంగ్రెస్ నాయకురాలు సోనియ గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు, డీఎల్ఎఫ్కు మధ్య కుదిరిన భూ ఒప్పందాన్ని ఆయన రద్దు చేశారు. దీంతో అప్పట్లో అశోక్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హరియణా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పాలనలో చోటుచేసుకున్న అనేక కుంభకోణాలను బయటపెట్టారు. నిజాయితీ, కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సాహసం చేసినందుకు పలువురు ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులకు దిగిన కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన నిజాయితీ ముందు ఇవేమి నిలవలేకపోయాయి. అంకిత భావంతో ఆయన చేసిన సర్వీస్‌కు ట్రాన్స్ఫర్లు బహుమానాలుగా నిలిచాయి. అయితే తాజాగా అశోక్ ఆరావళీ పర్వత శ్రేణుల్లో భూ ఏకీకరణ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఓ జాతీయ పత్రికలో ప్రచురితమైన కొన్ని గంటల్లోనే ఈ బదిలీ జరిగింది. అయితే బదిలీ అనేది అశోక్‌కు పరిపాటిగా మారిందనే చెప్పవచ్చు.. తన 27 ఏళ్ల సర్వీస్‌లో ఆయన 50 సార్లకు పైగా బదిలీ అయ్యారు. నీతిగా, నిజాయితీగా పనిచేసే అధికారులపై ఇలాంటి బదిలీలు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. 15 నెలలుగా హర్యానా క్రీడా, యువజన విభాగంలో సేవలు అందించిన అశోక్‌ను ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎస్ దేశీ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయనతో పాటు బదిలీ అయినవారిలో సిద్ధినాథ్ రాయ్, రాజీవ్ అరోరా, అపూర్వ కుమార్ సింగ్, అమిత్ కుమార్ అగర్వాల్, వాజీర్ సింగ్ గోయత్, చందర్ శేఖర్ విజయ్‌కుమార్ సిద్దప్పలు ఉన్నారు. -
24 ఏళ్ల సర్వీసు.. 51 పోస్టులు.. మెగా దంగల్
చండీగఢ్: హరియణా కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా.. 52 ఏళ్లకే.. 51 పోస్టింగ్‌లు.. 24 ఏళ్ల సర్వీసులో తరచుగా బదిలీలు... అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తినందుకు ఆయనకు లభించిన బహుమానాలు. నిజాయితీ, కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సాహసం చేసినందుకు ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులు.. కానీ ఆయన నిజాయితీ ముందు ఇవేమి నిలవలేకపోయాయి. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు గుర్గావ్లో భూమార్పిడిని నిలిపివేసి ఒక్కసారిగా అశోక్ వార్తల్లోకెక్కారు. అంతేకాదు హరియణా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పాలనలో చోటుచేసుకున్న అనేక కుంభకోణాలను బయటపెట్టారు. ఆ కారణంగానే తరచుగా ట్రాన్స్ఫర్లు.. ప్రస్తుతం ఆయన ‘మెగా దంగల్’కు సిద్ధం అవుతున్నారు. ఎన్నో బదిలీల తర్వాత అశోక్ ఖేమ్కా హరియణా రాష్ట్ర యువజన, క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన క్రీడాకారులతో నిండి ఉన్న హరియణా వంటి రాష్ట్రంలో ఇంత పెద్ద ఈవెంట్‌కు నిర్ణయకర్తగా వ్యవహరించడం గర్వంగా ఉందన్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో కూడా అత్యధిక పతకాలు సాధించింది హరియణా క్రీడాకారులేనన్నారు. పోటీతత్వానికి మారుపేరుగా నిలిచే క్రీడాకారులకు జీవనోపాధి కల్పించడం కనీస బాధ్యత అని, అందుకోసం వారికి ఉద్యోగాలు కల్పించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో కూడిన క్రీడా అకాడమీలు పెంచడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. మార్చి21 నుంచి 23 వరకు జరిగే మల్లయుద్ధ పోటీల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నానని అశోక్ ఖేమ్కా చెప్పారు. ఉద్యోగం ఉంటేనే భద్రత.. ‘ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత ప్రతిభకు గుర్తింపుగా ఎంతో కొంత పారితోషకం లభిస్తుంది. కానీ జీవితం సాఫీగా సాగాలంటే ఉద్యోగం అవసరం. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకోసం ప్రతిభకు పదునుపెట్టాలి. ఒలింపిక్స్‌లో భారత్‌కు 5 నుంచి 10 పతకాలు హర్యానా క్రీడాకారులు అందిస్తారని’ అశోఖ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మెగా దంగల్ ఎందుకంటే.. స్వాతంత్ర్య సమర యోధులు.. భగత్ సింగ్, శివరాం హరి రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్లను ఉరి తీసిన రోజును హరియణాలో సహేదీ దివస్‌గా జరుపుతారు. ఈ రోజును పురస్కరించుకుని హర్యానా ప్రభుత్వం మల్ల యుద్ధ పోటీలు నిర్వహిస్తోంది. రూ.1.8 కోట్ల భారీ ప్రైజ్ మనీ అందిస్తోంది. ‘ఈ పోటీలను విజయవంతం చేసేందుకు ఇండోర్ స్టేడియంను సిద్ధం చేశామని, ప్రేక్షకుల కోసం ఈసారి ఏసీలు కూడా ఏర్పాటు చేశామని’ క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అశోఖ్ తెలిపారు. -
అశోక్ ఖేమ్కాపై మరో చార్జిషీట్
చండీగఢ్: ఖజానాకు నష్టం చేకూర్చారన్న అభియోగంతో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాపై బీజేపీ పాలిత హరియాణా ప్రభుత్వం చార్జిషీట్ దాఖలు చేసింది. 2012-13 మధ్య రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు ఎండీగా ఉన్న ఖేమ్కా.. గోధుమ గింజలను పూర్తిగా అమ్మకపోవడంతో రూ. 3.41 కోట్ల నష్టం వచ్చిందంటూ ఈ నెల 1న చార్జిషీట్ నమోదు చేసిన ప్రభుత్వం 8న ఆయనకు పంపింది. ఖేమ్కా నిర్లక్ష్యంతో 87 వేల క్వింటాళ్ల గోధుమ విత్తనాలు వృధాగా పోయాయని ఆరోపణలు వచ్చాయి. యూపీఏ ప్రభుత్వ హయాం(2012 అక్టోబర్)లో కాంగ్రెస్ చీఫ్ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా కంపెనీకి, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ల మధ్య జరిగిన భూఒప్పందాన్ని ఖేమ్కా రద్దు చేశారు. పరిధులు దాటి ప్రవర్తించారంటూ ఆయన్ను బదిలీ చేశారు. -
22 ఏళ్లలో.. 46 బదిలీలు
చండీగఢ్: 22 ఏళ్ల వృత్తి జీవితంలో 46 సార్లు బదిలీ అయ్యారు. చేస్తున్నది ఆషామాషీ ఉద్యోగం కాదు. అత్యున్నత ఐఏఎస్ అధికారి. నిబంధనల ప్రకారం వ్యవహరించినందుకు బదిలీలే కాదు కేసులు కూడా పెట్టారు. అయినా ఎవరికీ భయపడకుండా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. హరియాణా ప్రిన్సిపల్ సెక్రటరీగా పదోన్నతి పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్క నేపథ్యమిది. సెక్రటరీ హోదాలో ఉన్న అశోక్‌కు నూతన సంవత్సర కానుకగా ప్రమోషన్ వచ్చింది. కోల్‌కతాకు చెందిన 50 ఏళ్ల ఖేమ్క.. ఖరగ్‌పూర్ ఐఐటీ కాలేజీలో 1988లో టాపర్‌గా నిలిచారు. 2012లో అశోక్ ఖేమ్క పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించినదిగా ఆరోపణలు వచ్చిన భూఒప్పందాన్ని అశోక్ రద్దు చేశారు. అయితే అప్పటి హరియాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. అశోక్ నిబంధనలకు విరుద్ధంగా భూఒప్పందాన్ని రద్దు చేశారంటూ ఆయనపై ఛార్జీషీటు నమోదు చేసింది. హరియాణాలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రెణ్నెళ్ల క్రితం అశోక్‌పై ఛార్జిషీటును తొలగించారు. -
23 ఏళ్లలో... 45 బదిలీలు
-
23 ఏళ్లలో... 45 బదిలీలు
చండీగఢ్ : రాబర్ట్ వాద్రా- డీఎల్ఎఫ్ డీల్ ను రద్దు చేసి సంచలనం సృష్టించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కాను హర్యానా ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయనను ఆర్కియాలజీ, మ్యూజియం శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 49 ఏళ్ల అశోక్ తన 23 సంవత్సరాల సర్వీసులో బదిలీల పరంపర 45కు చేరింది. హర్యానా రాష్ట్ర రవాణా మంత్రి రాం బిలాస్ శర్మతో రగిలిన విభేదాలే ఖేమ్కా బదిలీకి కారణమని తెలుస్తోంది. మైనింగ్ లాబీ హస్తం ఉన్నట్టు సమాచారం. అయితే రాంబిలాస్ మాత్రం ఖేమ్కా బదిలీని సమర్థిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి అనిల్ విజ్ ...ఖేమ్కాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. అయితే రొటీన్ బదిలీల్లో భాగంగానే ఇది జరిగిందని, మరో ఎనిమిది ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అక్రమ భూ పందేరాల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చండశాసనుడిగా పేరున్న అశోక్ ఖేమ్కా గతంలో హర్యానా విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా, హర్యానా ఆర్చీవ్స్‌కు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఖేమ్కా , ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. రవాణా శాఖలోని అవినీతిని, అక్రమాలను ఆయన బయటపెడుతున్న క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకొంది. కాగా ప్రస్తుత బదిలీతో తాను చాలా బాధపడుతున్నానంటూ ఖేమ్కా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక కమిటీ వాద్రా-డీఎల్ఎఫ్ భూ బదలాయింపు ఒప్పందంలో అవకతవకలు జరగలేదని ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని క్లీన్ చిట్ వచ్చిన నేపథ్యంలో ఆయనపై పరువునష్టం కేసు కూడా కొనసాగుతోంది. గతంలో ఖేమ్కా భూ రిజిస్ట్రేషన్లు, భూ గణాంకాల శాఖ డైరక్టర్ జనరల్‌గా పని చేస్తున్న సమయంలో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు డీఎల్ఎఫ్ సంస్థకు నడుమ జరిగిన భూ ఒప్పందాల్లో అక్రమాలను గుర్తించి వాటిని రద్దు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఖేమ్కా పేరు మారుమోగిపోయింది. వీటితో పాటు ఖేమ్కా బెదిరింపు కాల్స్, చంపివేస్తామని హెచ్చరికలు సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో బీజేపీ ఖేమ్కాను సమర్థించిన విషయం తెలిసిందే. అయితే ఎన్డీయే హయాంలో కూడా ఈ సిన్సియర్ అధికారిపై బదిలీల పరంపర కొనసాగడం కొసమెరుపు. -
సుపరిపాలనకు మార్గం!
సంపాదకీయం: సుపరిపాలనకు వెన్నెముకగా, సమర్ధతకు మారుపేరుగా ఉండాల్సిన సివిల్ సర్వీసు వ్యవస్థ అధికారంలో ఉన్నవారికి పరిచారికగా...తలాడించడం తప్ప మరేమీ తెలియని అవ్యవస్థగా మిగిలిపోతున్న తీరు నానాటికీ కళ్లకు కడుతోంది. ఆమధ్య సుప్రీంకోర్టు సీబీఐని ‘పంజరంలో చిలుక’గా వ్యాఖ్యానించింది గానీ...ఆ వ్యాఖ్యలు సివిల్ సర్వీస్ వ్యవస్థ మొత్తానికి వర్తిస్తాయని వర్తమాన పరిస్థితులను గమనించే ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. ఎక్కడో ఒక అశోక్ ఖేమ్కా, ఒక దుర్గాశక్తి నాగ్‌పాల్ కారుచీకట్లో కాంతి పుంజాల్లా మెరుస్తుంటారు. కొడిగడుతున్న ఆశలకు ఊపిరి పోస్తారు. కానీ, చాలామంది సర్దుకుపోదామనుకుంటారు. అందుకు కారణం స్పష్టమే... బదిలీలు! ఎన్నేళ్లయినా తీరు మార్చుకోని కార్యనిర్వాహక వ్యవస్థపై కొరడా ఝళిపిస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం ఎన్నదగిన తీర్పునిచ్చింది. సివిల్ సర్వీస్ అధికారులను ఇష్టమొచ్చినట్టు బదిలీ చేయడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుచేసింది. అలాగే, పాలకులిచ్చే మౌఖిక ఆదేశాలను ఇటుమీదట ఔదాల్చాల్సిన అవసరం లేదని, లిఖితపూర్వకంగా ఉంటేతప్ప దేన్నీ పరిశీలించవద్దని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ జయంతి రోజునే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు... పాలనా వ్యవస్థలో నానాటికీ దిగజారుతున్న విలువలను నిలబెట్టేందుకు దోహదపడుతుంది. ప్రామాణికమైన పాలనకు తోవకల్పిస్తుంది. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, మరో 82మంది రిటైర్డ్ అధికారులు దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు ఈ తీర్పునిచ్చింది. పార్టీలతోనూ, పాలకులతోనూ నిమిత్తం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ సివిల్ సర్వీస్ వ్యవస్థను చిన్నచూపు చూసే వైఖరి కొనసాగుతోంది. నిబంధనలను బేఖాతరుచేసి తామనుకున్నదే చలామణి కావాలని చూసే రాజకీయ నాయకత్వానికి ముక్కు సూటిగా వ్యవహరించే అధికారులంటే ఒళ్లు మంట. ప్రతిదానికీ రూల్స్ మాట్లాడితే ఆగ్రహం. అలాంటివారిని పాలకులు ప్రాధాన్యత లేని పదవులకు సాగనంపి కక్ష తీర్చుకుంటారు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాధ్రాకూ, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కూ మధ్య సాగిన భూ లావాదేవీల ఆరా తీసిన అశోక్ ఖేమ్కాను హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్న దుర్గాశక్తిని యూపీలోని అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ ప్రభుత్వం బదిలీచేశాయి. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి సంజయ్ భట్‌పై కారాలు మిరియాలు నూరుతోంది. ప్రతి అధికారీ సగటున కేవలం 16 నెలలు మాత్రమే ఒక పదవిలో కొనసాగగలుగుతున్నారని హార్వర్డ్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గాల్సిన అవసరం లేదని... సత్యనిష్టతో, నిబద్ధతతో తమ విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలనీ మన అధినేతలు పిలుపునిస్తుంటారు. కానీ, ఆచరణలోకొచ్చేసరికి ఇలాంటి ‘ఉద్బోధ’లన్నీ ఆవిరైపోతాయి. మాటవినని అధికారులకు బదిలీలే బహుమతులవుతాయి. నాలుగేళ్లక్రితం వీరప్ప మొయిలీ నేతృత్వంలోని రెండో పాలనా సంస్కరణల సంఘం సివిల్ సర్వీస్ వ్యవస్థ ప్రక్షాళనకు ఎన్నెన్నో విలువైన సూచనలిచ్చింది. అధికారులకు ఆయా రంగాల్లో ఉన్న ప్రతిభ, అభినివేశాన్నిబట్టి పోస్టింగ్‌లు ఇవ్వాలని, అటు తర్వాత వారి పనితీరును సమీక్షించి దానికి అనుగుణంగా పదోన్నతులివ్వాలని సూచించింది. నిర్ణీత కాలవ్యవధిలో పదోన్నతులను పంచిపెట్టే ప్రస్తుత విధానానికి స్వస్తి చెప్పాలని తెలిపింది. పనితీరు సక్రమంగా లేనివారికి తగిన సలహాలిచ్చి మారడానికి అవకాశం ఇవ్వాలని పేర్కొంది. తీరుమార్చుకోని వారిని, అయోగ్యులుగా తేలినవారిని ఇంటికి సాగనంపాలని స్పష్టంచేసింది. ఈ సూచనలకు అనుగుణంగా వ్యవహరించివుంటే కార్యనిర్వాహక వ్యవస్థకు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎదురైన పరాభవం దాపురించేది కాదు. సుప్రీంకోర్టు తన తీర్పులో మూడునెలల్లోగా అధికారుల బదిలీకి నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలని నిర్దేశించింది. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ సివిల్ సర్వీస్ బోర్డు(సీఎస్బీ)లు ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఈ బోర్డులకు కేంద్రంలో కేబినెట్ కార్యదర్శి, రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నేతృత్వంవహించాలని తెలిపింది. ఇకపై ఏ అధికారి ఏ పదవిలో ఉండాలో, ఎవరిని ఎక్కడకు బదిలీచేయాలో, ఎవరిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలో ఈ బోర్డులు నిర్ణయిస్తాయని... వాటి సిఫార్సులను ఆమోదించాలో, తిరస్కరించాలో ప్రధాని లేదా ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటారని, అందుకు గల కారణాలను వారు లిఖితపూర్వకంగా ఇస్తారని తెలిపింది. సివిల్ సర్వీస్ అధికారుల నియామకాలు, పదోన్నతులు, బదిలీలు వగైరా అంశాలను పొందుపరుస్తూ సివిల్ సర్వీస్ చట్టాన్ని తీసుకురావాలని... ఈలోగా తమ ఆదేశాలనే అమలుచేయాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పు జవాబుదారీతనాన్ని రాజకీయ నాయకత్వంనుంచి అధికారవర్గానికి బదిలీచేసినట్టు కనిపిస్తోంది. ప్రజలద్వారా అధికారంలోకొచ్చే రాజకీయ నాయకత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు అది కీలకం. కానీ, ప్రతిచోటా పాలకులు ఆ జవాబుదారీతనం చాటున అధికారాన్ని దుర్వినియోగం చేశారు. రాజకీయ జోక్యంతో అధికారుల్లోని వృత్తి నైపుణ్యాన్ని, సమర్ధతను దెబ్బతీశారు. సుప్రీంకోర్టు తీర్పు దాన్ని సరిదిద్దబోతూ కొత్త సమస్యలకు తావిచ్చినట్టు కనిపిస్తోంది. రేపన్నరోజున సీఎస్‌బీలు తమ వైఖరే సరైనదని వాదించి, అధికారుల రక్షణకు పూనుకుంటే... ముఖ్యమంత్రులను బేఖాతరుచేస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇవాళ రాజకీయ నాయకత్వాలవల్ల తలెత్తే సమస్యలు రేపు బ్యూరోక్రసీతో తలెత్తబోవన్న గ్యారెంటీ ఏమీ లేదు. మొత్తానికి సివిల్ సర్వీస్ వ్యవస్థ ప్రక్షాళనకు ఒక ప్రయత్నమైతే మొదలైంది. ఆచరణలో రాగల సమస్యలను తీర్చి మరింత మెరుగుపరిస్తే ఈ వ్యవస్థ రూపకల్పనలోని లక్ష్యం నెరవేరుతుంది. -
వ్రాద్రా విషయంలో నేను చేసింది కరెక్టే: ఖేమ్కా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన వివాదాస్పద భూ ఒప్పందంలో తాను తీసుకున్న చర్యలను హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాగట్టిగా సమర్థించుకున్నారు. ‘చర్యలు తీసుకోవడమన్నది మొదలుపెడితే.. అది ఉన్నత స్థాయి నుంచి మొదలవ్వాలి. అదే నైతికత. అత్యున్నత స్థాయిలో మోసం జరిగితే.. అది మోసం అని చెప్పడానికి దమ్మూధైర్యం కావాలి’ అని చెప్పారు. సీఎన్ఎన్-ఐబీఎన్‌లో ప్రసారమయ్యే కరణ్ థాపర్ ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
వెంటాడుతున్న పాపం!
సంపాదకీయం: పాతిపెట్టాలనుకున్న పాపం మందుపాతరై పేలింది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకూ, డీఎల్‌ఎఫ్‌కూ మధ్య జరిగిన భూ లావాదేవీలపై ఏడాది క్రితం మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు, హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు వాటిని ఏదోరకంగా మరుగుపరచాలని చూశారు. ఆ కథనాల్లో కుట్ర ఉన్నదని ఆడిపోసు కున్నారు. వాద్రాను సమర్థిస్తూ మాట్లాడారు. ఆ లావాదేవీల్లో ఎలాంటి అక్రమమూ లేదని వెనకేసుకొచ్చారు. వాటి కూపీ లాగడానికి ప్రయత్నించిన హర్యానా రిజిస్ట్రేషన్ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ ఖేమ్కాను ముప్పుతిప్పలుపెట్టారు. వాద్రా- డీఎల్ఎఫ్ భూ లావాదేవీల్లోని వాస్తవాలేమిటో దర్యాప్తు చేయాలని గుర్గావ్, ఫరీదాబాద్, పాల్వాల్, మేవాత్ జిల్లాల రిజిస్ట్రార్లకు ఖేమ్కా ఆదేశించాక నాలుగు రోజుల్లోనే ఎన్నెన్నో అక్రమాలు వెలుగులోకొచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ జరిగిందని నిర్ధారిస్తూ వాద్రా-డీఎల్ఎఫ్ భూ లావాదేవీని రద్దుచేయాలని ఖేమ్కా ఆదేశాలిచ్చారు. ఆ సంగతి తెలిసిన కొన్ని గంటల్లోనే ఖేమ్కా బదిలీ అయ్యారు. వేరే కేసు విషయంలో పంజాబ్-హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఖేమ్కాను బదిలీ చేశామని నమ్మ బలికారు. అంతేకాదు... బదిలీ తర్వాతే ఖేమ్కా కావాలని భూ లావాదేవీల రద్దుకు ఆదేశాలిచ్చారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అక్కడితో ఊరుకుంటే ఏమయ్యేదో గానీ... హర్యానా ప్రభుత్వం ఇంకాస్త ముందుకెళ్లింది. ఖేమ్కా నిర్ణయాన్ని, అందులోని సహేతుకతను సమీక్షించాలంటూ ముగ్గురు అధికారుల కమిటీని ఏర్పాటుచేసింది. అందరూ అనుకున్నట్టే ఆ కమిటీ ఖేమ్కాను తప్పుబట్టింది. వాద్రా-డీఎల్ఎఫ్ ఒప్పందంపై విచారణకు ఆదేశించే అధికారం ఆయనకు లేదని తేల్చిచెప్పింది. ఒక తప్పును కప్పిపుచ్చుదామని, అధినాయకురాలి మెప్పుపొందుదామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కమిటీ నివేదికలో లేవనెత్తిన వివిధ అంశాలపై వివరణనిస్తూ ఖేమ్కా వంద పేజీల జవాబునిచ్చారు. అందులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలున్నాయి. ఆయన వాద్రా-డీఎల్ఎఫ్ ఒప్పందాన్ని స్పృశించడంతోనే వదిలిపెట్టలేదు. రాజకీయ నాయకులు-అధికారులు-వ్యాపార దిగ్గజాల మధ్య సాగుతున్న కుమ్మక్కు వ్యవహారాలను వెల్లడించారు. అత్యంత విలువైన, ఖరీదైన భూములు ఎలా చేతులు మారుతున్నాయో, ఖజానాకు ఎంతగా నష్టం జరుగుతున్నదో ఆయన కళ్లకుకట్టారు. ఎనిమిదేళ్ల కాలవ్యవధిలో ఈ కుమ్మక్కు లావాదేవీల పర్యవసానంగా మూడున్నర లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని ఆయన చెబుతున్నారు. రాబర్ట్ వాద్రా-డీఎల్ఎఫ్ ఒప్పందాన్నే చూస్తే... అందులో ఎన్ని లొసుగులున్నాయో, పలుకుబడిగల వ్యక్తులు ప్రజాధనాన్ని ఎలా తన్నుకుపోతున్నారో స్పష్టమవుతుంది. హర్యానా ప్రభుత్వానికి చెందిన పట్టణ, గ్రామీణ ప్రణాళికా విభాగం (డీటీసీపీ) నుంచి ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ అనే సంస్థకు కొంత భూమి బదలాయింపు జరగడం, అందులో 3.53 ఎకరాల భూమిని వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ లిమిటెడ్‌కు ఆ సంస్థ రూ.7.5 కోట్లకు అమ్మడం ఖేమ్కా ఇందులో ప్రస్తావించారు. ఇలా కొన్న భూమిలో 2.7 ఎకరాల ప్రాంతంలో కాలనీ ఏర్పాటుకు వాద్రాకు హర్యానా ప్రభుత్వం లెసైన్స్ మంజూరు చేసింది. కేవలం రెండునెలల వ్యవధిలో ఈ ప్రాంతాన్ని డీఎల్ఎఫ్కు వాద్రా రూ.58 కోట్లకు విక్రయించారు. ఇందులో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ సంస్థకూ, స్కై లైట్ హాస్పిటాలిటీకి మధ్య కుదిరిన ఒప్పందమే లొసుగులమయమని ఖేమ్కా అంటున్నారు. సేల్ డీడ్ సమయంలో ఓంకారేశ్వర్‌కు స్కైలైట్ సమర్పించిన రూ.7.5 కోట్ల చెక్కు నకిలీదై ఉండవచ్చని ఆయన అనుమానిస్తున్నారు. ఇలా నకిలీ చెల్లింపులతో చేతులు మారిన భూమిలో కాలనీ ఏర్పాటుకు లెసైన్స్ మంజూరు చేయడం, అలా లెసైన్స్ పొందిన స్వల్పకాలంలోనే ఆయన కళ్లు చెదిరే మొత్తానికి డీఎల్ఎఫ్కు విక్రయించడం చూస్తుంటే ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంతగా వేళ్లూనుకున్నదో అర్థమవుతుంది. అచ్చం వాద్రా-డీఎల్ఎఫ్ ఒప్పందం తరహాలోనే ఎన్నెన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయో, ఏ మొత్తంలో భూమి చేతులు మారుతున్నదో ఖేమ్కా ఇచ్చిన వివరణ గమనిస్తే అర్థమవుతుంది. 2005-12 మధ్యకాలంలో 21,366 ఎకరాల భూమికి డీటీసీపీ కాలనీ లెసైన్స్‌లు మంజూరు చేసింది. ఈ లెసైన్స్‌ల స్కాం విలువ దాదాపు రూ.3 లక్షల 50 వేల కోట్లు ఉండొచ్చని ఖేమ్కా అంచనా వేస్తున్నారు. లెసైన్సుల మంజూరును అధికారుల ఇష్టారాజ్యానికి వదిలేయడం కాకుండా వేలం ద్వారా నిర్ణయిస్తే నేరుగా ఖజానాకే వేల కోట్ల రూపాయలు చేరుతాయి. కానీ, పలుకుబడి కలిగిన వ్యక్తులు దళారులుగా తయారై ప్రభుత్వంనుంచి స్వల్పమొత్తానికే సులభంగా లెసైన్స్‌లు సంపాదించి రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు భారీ మొత్తంలో అమ్ముకుంటున్నారు. వాద్రా-డీఎల్ఎఫ్ వ్యవహారంపై నిరుడు ఖేమ్కా లేవనెత్తిన అభ్యంతరాలకు స్పష్టమైన జవాబు ఇచ్చి ఉన్నా లేదా చిత్తశుద్ధితో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించినా హర్యానా ప్రభుత్వ నిజాయితీ వెల్లడయ్యేది. కానీ, అందుకు భిన్నంగా ఆ ప్రభుత్వం వ్యవహరించింది. ఖేమ్కాపై కత్తిగట్టింది. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని మరికొందరు సీనియర్ అధికారులతో చెప్పించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఖేమ్కా ఇచ్చిన వివరణతో ప్రభుత్వం తన పరువును పోగొట్టుకోవడమే కాదు... ఆ ముగ్గురు అధికారుల సచ్ఛీలతపై కూడా అనుమానాలు రేకెత్తించింది. ఈ విషయంలో హర్యానా ప్రభుత్వాన్ని మాత్రమే తప్పుబట్టలేం. గత ఏడాది ఈ స్కాంపై అలహాబాద్ హైకోర్టులో కేసు దాఖలైనప్పుడు సాక్షాత్తూ ప్రధాని కార్యాలయమే వెనకా ముందూ చూడకుండా అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టి పారేసింది. అందువల్ల ఇప్పుడు హర్యానా ప్రభుత్వంతో పాటు. ప్రధాని కార్యాలయం కూడా దేశ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంది. ఖేమ్కా వివరణనిచ్చి మూడునెలలు దాటుతున్నా ఎందుకు మౌనంగా ఉండిపోయారో, తమ నిజాయితీ ఏపాటిదో చెప్పాల్సి ఉంది. -
టికెటిస్తాం.. హుడాపై పోటీ చేయండి
న్యూఢిల్లీ: రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బాసటగా నిలిచింది. ఆయన అద్భుతమైన తెగువ చూపారని ప్రశంసించింది. ‘‘ఇలాంటి పనికిమాలిన రాజకీయ నాయకులకు ఎంతకాలమని సేవ చేస్తారు? పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరండి. మా పార్టీ తరఫున హర్యానా సీఎం భూపీందర్ సింగ్ హుడాపై పోటీ చేయండి’’ అని ఖేమ్కాకు విజ్ఞప్తి చేసింది. -
దుర్గాశక్తి... బహువచనం!
సంపాదకీయం : చదువులో చురుగ్గా ఉన్నారని, నాయకత్వ లక్షణాలు దండిగా ఉన్నాయని, సమకాలీన సమస్యలపై అవగాహన ఉన్నదని, అవి అపరిష్కృతంగా మిగిలిపోతున్న వైనంపై ఆగ్రహం ఉన్నదని, అందుకోసం ఏదో చేయాలన్న తపన వారి అంతరాంతరాల్లో జ్వలిస్తున్నదని అనుకునే యువతీయువకులు సివిల్ సర్వీస్‌కు వెళ్లాలని చాలా మంది సలహాలిస్తుంటారు. సవాళ్లను స్వీకరించే తత్వమూ, సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను వెదకగల సామర్ధ్యమూ, అంకితభావంతో పనిచేసే సంసిద్ధతా ఉండేవారివల్ల ఈ సమాజం మెరుగుపడుతుందని అందరూ నమ్ముతారు. సివిల్ సర్వీస్ అధికారుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే జటిలమైన పరీక్షలకెళ్లేవారంతా ఈ లక్షణాలన్నీ తమకున్నాయని, ఇందులో కృతార్థులమై తమ సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతుంటారు. కానీ ఫ్యూడల్ భావజాలంతో, దాన్నుంచి వచ్చే దురహంకారంతో తమ మాటే శాసనంగా చలామణీ కావాలని ఆశించే పాలకులున్నప్పుడు ఇలాంటి యువతరం కలలన్నీ కల్లలుగా మిగిలిపోతాయి. వివిధ రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో కొందరు ఐఏఎస్ అధికారులపై అధికారంలో ఉన్నవారు సాగిస్తున్న ధాష్టీకం చూస్తే కలిగే అభిప్రాయం ఇదే. ఇలాంటివారి ఏలుబడిలో ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యేవారికి రెండే ప్రత్యామ్నాయాలుం టున్నాయి-అలాంటి పాలకుల అభీష్టానికి తలవంచడం లేదా వారి ఆగ్రహానికి గురై ఎలాంటి ప్రాధాన్యతా లేని పోస్టుల్లో వృధాగా పొద్దుపుచ్చడం. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా జిల్లా గౌతంబుద్ధ నగర్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగపాల్ని సస్పెండ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐఏఎస్‌ల పరిస్థితిని మరోసారి కళ్లకు కడుతోంది. యమునా నదిలో అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్న మాఫియా ముఠాలపై ఆమె ఉక్కుపాదం మోపారు. ఆ ప్రాంతం నుంచి నెలకు కనిష్టంగా చూస్తే రూ.200 కోట్ల విలువైన ఇసుక తరలి పోతోందని ఒక అంచనా. ఇసుక తవ్వకాలవల్ల యమునా నది కోతకు గురై పర్యావరణం ప్రమాదంలో పడుతున్నదని ఎందరో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పర్యవసానంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పరిచింది. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తీరా దుర్గాశక్తి చర్యకు ఉపక్రమించేసరికి ఆమెను సస్పెండ్ చేసింది. గౌతంబుద్ధ నగర్లో ఒక మసీదు కోసం నిర్మించిన గోడను కూల్చేయడంవల్లా, ఆ చర్య మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నందువల్లా ఆమెను సస్పెండ్ చేయాల్సివచ్చిందని అఖిలేష్ ఇస్తున్న సంజాయిషీ వాస్తవాలను ప్రతిబింబించదు. ఆ ఉదంతంతో సంబంధమున్న అధికారి పేరు జేవర్ అని తాజా సమాచారం వెల్లడిస్తున్నది. అఖిలేష్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో ఐఏఎస్‌లను 800 సార్లు బదిలీ చేశారు. అంటే, సగటున నెలకు 50 బదిలీలన్నమాట. యూపీలో ఇది అఖిలేష్ పాలనతోనే ప్రారంభమైన ధోరణికాదు. అంతక్రితం పాలించినవారూ ఈ తరహాలోనే ప్రవర్తించారు. నిజాయితీగా, నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే ఐఏఎస్, ఐపీఎస్‌లపై కొంచెం హెచ్చుతగ్గుల్లో దాదాపు అన్ని రాష్ట్రాల పాలకుల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాధ్రాకూ, రియల్ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కూ మధ్య సాగిన లావాదేవీలపై కూపీ లాగిన హర్యానా రిజిస్ట్రేషన్ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను ఆ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో బదిలీలతో ఎలా వేధించిందో ఈ దేశం చూసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై పాత కేసును తిరగదోడారన్న నెపంతో రాజస్థాన్ ప్రభుత్వం జైసల్మేర్ జిల్లా ఎస్పీని రెండురోజులక్రితం బదిలీచేసింది. ఆ బదిలీపై ఆ జిల్లా భగ్గుమంటోంది. జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి సోనాలీ కుమార్‌ది మరో కథ. ఢిల్లీలో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆమెను రెండు నెలలు తిరక్కుండానే ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఇందుకు కారణం చాలా చిన్నది. ప్రణాళికా సంఘంతో చర్చలకోసం ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆమె ఖరీదైన భోజనం పెట్టించలేదని, ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేయలేదని ఆరోపణలు. మన రాష్ట్రం విషయానికే వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పాలనాకాలంలో కీలకపదవుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులను ఇప్పుడు ఎలా వేధిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. తగిన ఆధారాలున్న అధికారులపై చర్య తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే దర్యాప్తు పేరిట సీబీఐ తమను అవినీతిపరులుగా, ప్రజాధనాన్ని అపహరించినవారిగా మీడియాకు లీకులు ఇస్తున్న తీరు సమంజసంగా లేదని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యవర్గం అభ్యంతరం వ్యక్తంచేసింది. అక్రమ నిర్ణయాలనుకున్న ప్రాజెక్టులను కొనసాగిస్తూ, అందులో భాగస్వాములమైన తమను మాత్రం అక్రమాలకు పాల్పడ్డవారిగా చిత్రించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది. తమ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు, తమ భాగస్వామ్యపక్షాల ప్రభుత్వాలు ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇంతగా వేధిస్తుంటే ఏనాడూ నోరెత్తని సోనియాగాంధీ దుర్గాశక్తి విషయంలో ఎక్కడలేని ఆసక్తినీ ప్రదర్శించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధానిని కోరడం మన నేతల ద్వంద్వ నీతికి నిదర్శనం. ఖేమ్కా విషయంలోనూ ఆమె ఇలాగే స్పందించివుంటే అందరూ హర్షించేవారు. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ ఈ సర్వీసులకు ఎంపికైన అధికారులు స్వతంత్రంగా, నిర్భయంగా వ్యవహరించ గలిగితేనే పటిష్టమైన దేశం నిర్మాణమవుతుందని అభిలషించారు. కానీ, అలాంటి అధికారులను పాలకులు వేధించే సంస్కృతి రాను రాను పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట పడకపోతే, నిజాయితీగా వ్యవహరించే అధికారులను ఆదరించకపోతే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుందని మన నేతలు గ్రహించడం అవసరం.