23 ఏళ్లలో... 45 బదిలీలు | IAS Officer Ashok Khemka After 45th Transfer | Sakshi
Sakshi News home page

23 ఏళ్లలో... 45 బదిలీలు

Published Thu, Apr 2 2015 1:43 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

23 ఏళ్లలో...  45 బదిలీలు

23 ఏళ్లలో... 45 బదిలీలు

చండీగఢ్ :  రాబర్ట్ వాద్రా- డీఎల్ఎఫ్ డీల్ ను రద్దు చేసి సంచలనం సృష్టించిన సీనియర్  ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కాను  హర్యానా ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్న ఆయనను ఆర్కియాలజీ, మ్యూజియం శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 49 ఏళ్ల అశోక్ తన 23 సంవత్సరాల సర్వీసులో బదిలీల పరంపర 45కు చేరింది.  హర్యానా రాష్ట్ర రవాణా మంత్రి  రాం బిలాస్ శర్మతో రగిలిన విభేదాలే ఖేమ్కా బదిలీకి కారణమని తెలుస్తోంది.  మైనింగ్ లాబీ హస్తం ఉన్నట్టు సమాచారం. అయితే రాంబిలాస్ మాత్రం ఖేమ్కా బదిలీని సమర్థిస్తున్నారు.

మరోవైపు రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి  అనిల్ విజ్ ...ఖేమ్కాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో  మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. అయితే  రొటీన్  బదిలీల్లో భాగంగానే ఇది జరిగిందని,  మరో ఎనిమిది ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసినట్టు  ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

అక్రమ భూ పందేరాల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చండశాసనుడిగా పేరున్న  అశోక్ ఖేమ్కా గతంలో హర్యానా విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా, హర్యానా ఆర్చీవ్స్‌కు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.  ఖేమ్కా , ప్రస్తుతం  ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పని చేస్తున్నారు. రవాణా శాఖలోని అవినీతిని,  అక్రమాలను ఆయన బయటపెడుతున్న క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకొంది.  కాగా  ప్రస్తుత బదిలీతో  తాను చాలా బాధపడుతున్నానంటూ ఖేమ్కా ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక కమిటీ వాద్రా-డీఎల్ఎఫ్ భూ బదలాయింపు ఒప్పందంలో అవకతవకలు  జరగలేదని ప్రభుత్వానికి  ఎలాంటి నష్టం వాటిల్లలేదని క్లీన్ చిట్ వచ్చిన నేపథ్యంలో ఆయనపై పరువునష్టం కేసు  కూడా  కొనసాగుతోంది.

గతంలో ఖేమ్కా భూ రిజిస్ట్రేషన్లు, భూ గణాంకాల శాఖ డైరక్టర్ జనరల్‌గా పని చేస్తున్న సమయంలో  సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు డీఎల్ఎఫ్ సంస్థకు నడుమ జరిగిన భూ ఒప్పందాల్లో అక్రమాలను గుర్తించి వాటిని రద్దు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఖేమ్కా పేరు మారుమోగిపోయింది. వీటితో  పాటు ఖేమ్కా బెదిరింపు కాల్స్, చంపివేస్తామని హెచ్చరికలు సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో బీజేపీ ఖేమ్కాను సమర్థించిన విషయం తెలిసిందే. అయితే ఎన్డీయే హయాంలో కూడా  ఈ సిన్సియర్ అధికారిపై బదిలీల పరంపర కొనసాగడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement