22 ఏళ్లలో.. 46 బదిలీలు
చండీగఢ్: 22 ఏళ్ల వృత్తి జీవితంలో 46 సార్లు బదిలీ అయ్యారు. చేస్తున్నది ఆషామాషీ ఉద్యోగం కాదు. అత్యున్నత ఐఏఎస్ అధికారి. నిబంధనల ప్రకారం వ్యవహరించినందుకు బదిలీలే కాదు కేసులు కూడా పెట్టారు. అయినా ఎవరికీ భయపడకుండా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. హరియాణా ప్రిన్సిపల్ సెక్రటరీగా పదోన్నతి పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్క నేపథ్యమిది. సెక్రటరీ హోదాలో ఉన్న అశోక్కు నూతన సంవత్సర కానుకగా ప్రమోషన్ వచ్చింది. కోల్కతాకు చెందిన 50 ఏళ్ల ఖేమ్క.. ఖరగ్పూర్ ఐఐటీ కాలేజీలో 1988లో టాపర్గా నిలిచారు.
2012లో అశోక్ ఖేమ్క పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించినదిగా ఆరోపణలు వచ్చిన భూఒప్పందాన్ని అశోక్ రద్దు చేశారు. అయితే అప్పటి హరియాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. అశోక్ నిబంధనలకు విరుద్ధంగా భూఒప్పందాన్ని రద్దు చేశారంటూ ఆయనపై ఛార్జీషీటు నమోదు చేసింది. హరియాణాలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రెణ్నెళ్ల క్రితం అశోక్పై ఛార్జిషీటును తొలగించారు.