జస్టిస్ జేకే మహేశ్వరికి అభివాదం చేస్తూ వీడ్కోలు పలుకుతున్న న్యాయమూర్తులు
సాక్షి, అమరావతి: సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరికి హైకోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. వీడ్కోలు కార్యక్రమం నిమిత్తం సీజేతో సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, రిజిస్ట్రార్లు అందరూ జడ్జీల లాంజ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో తన సహచర న్యాయమూర్తుల సహకారం వల్లే కోర్టు కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించానని తెలిపారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతంలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన తాను, కష్టపడే మనస్తత్వం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని చెప్పారు. కొత్త రాష్ట్రం, కొత్త హైకోర్టు కావడంతో పలు సవాళ్లు ఎదురయ్యాయని, వాటన్నింటినీ తన సహచర న్యాయమూర్తుల సహకారంతో విజయవంతంగా అధిగమించానని సీజే అన్నారు. నిష్క్రమణ అనేది చాలా బాధాకరమైనదని, ఈ ప్రాంతం నుంచి తాను వెళ్లిపోతున్నానంటూ సీజే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పలువురు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి సేవలను కొనియాడారు. కాగా జస్టిస్ మహేశ్వరిని న్యాయమూర్తులు, రిజిస్ట్రీ అధికారులు శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. రిజిస్ట్రార్ (విజిలెన్స్) గంధం సునీత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈసారి సీన్ రివర్స్: జస్టిస్ రాకేశ్ కుమార్‌కు వీడ్కోలు పలికిన రీతిలోనే జస్టిస్ మహేశ్వరికి వీడ్కోలు పలికేందుకు అమరావతి రైతులు హైకోర్టు వద్దకు చేరుకున్నారు. జస్టిస్ రాకేశ్‌కుమార్ లాగే కారు ఆపి, తమ నుంచి జ్ఞాపికలు, శాలువాలు తీసుకుంటారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. సీజే కారు ఆపకుండా, కారులో నుంచే వారికి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. నేరుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment