తీర్మానం ఒక్కటే... అనుమతులు 65
తీర్మానం ఒక్కటే... అనుమనుతులు 65
Published Mon, Feb 13 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
- లెక్కా పత్రం లేదు
– కాతేరు అడ్డగోలుగా దోచేశారు
– ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణ అనుమతులు
– 65 దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియని వైనం
– నిధుల జమా ఖర్చులు ఇప్పటికీ అప్పగించని సెక్రటరీ సత్యప్రసాద్
– చోద్యం చూస్తున్న పంచాయతీ ఉన్నతాధికారులు
తీర్మానం ఒక్కటే...అనుమతులు మాత్రం 65. రాజమహేంద్రవరానికి కూతవేటు దూరంలో ఉన్న కాతేరు పంచాయతీలో లీలలివీ. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.30 కోట్లు నిధులు పక్కదారి పట్టాయని ఇటీవల చేసిన దర్యాప్తులో బట్టబయలయింది. నిధుల్లోనే కాదు ఆదాయం వచ్చే వివిధ మార్గాల్లో దారి కాచి మరీ నిధులు మింగేసిన ఘటనలు బయటపడుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు వచ్చిన దరఖాస్తులకు అనుమతులిచ్చామని ... ఇవన్నీ ఒకే తీర్మానంతో చేశామని సంబంధితాధికారులు చెబుతుండడంతో విన్నవారు విస్తుపోతున్నారు. ఇక వసూళ్లు చేసిన పన్నులు కూడా స్వాహా చేసి చేతులు దులుపుకున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు పంచాయతీని అధికారులు, స్థానిక నేతలతో కలిసి అడ్డగోలుగా దోచేసిన వ్యవహారంలో ఇప్పటి వరకూ నిధుల జమా ఖర్చులు చెప్పలేదు. ప్రతి పనినీ నిబంధనలకు విరుద్ధంగా చేసి కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారు. భవన నిర్మాణ అనుమతులు ఎన్ని ఇచ్చారో లెక్కా పత్రం లేదు. ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారంటే పాలన ఏ విధంగా సాగుతుందో స్పష్టమవుతోంది. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కొరుకొండ మండలాల్లో 21 గ్రామాలను రాజమహేద్రవరం నగరపాలక సంస్థలో కలిపే ప్రతిపాదనలు గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. నగరానికి కూత వేటు దూరంలోనే కాతేరు పంచాయతీ కూడా ఉంది. ఇక్కడ తాజాగా చేసిన ప్రజా సాధికారత సర్వే ప్రకారం 8,900 గృహాలున్నాయి. జనాభా సంఖ్య 30 వేలకు పైగా ఉంది. విలీన ప్రతిపాదన నేపథ్యం, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో పంచాయతీ పాలక వర్గ ఎన్నికలు నిర్వహించ లేదు. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పాలనా వ్యవహారాలు సాగుతున్నాయి. ఇంత పెద్ద పంచాయతీలో ఐదేళ్ల నుంచి పాలక మండలి లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను అడ్డగోలుగా వాడేసి లెక్కలు కూడా రాయలేదు. ఇంటి, కుళాయి పన్నులు ఇష్టానుసారం వసూలు చేసి సొంతానికి వాడుకున్నారు. కొత్త కుళాయి కనెక‌్షన్ కోసం రూ.4500 నుంచి రూ.6000 వసూలు చేశారు. ఆ నిధులన్నింటినీ పంచాయతీ జనరల్ ఖాతాకు జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకున్నారు. గతంలో కాతేరు పంచాయతీగా పని చేసి ప్రస్తుతం రూరల్ మండలంలోనే ఓ పెద్ద పంచాయతీలో పని చేస్తున్న కార్యదర్శి కుళాయి కనెక‌్షన్ కోసం ఇంటి యజమానుల వద్ద రూ.2,500 వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి మందలించడంతో 70 మందికి రూ.2500 లెక్కన తిరిగి ఇచ్చేశారు.
ఇప్పటికీ లెక్కలు చెప్పని సస్పెండైన కార్యదర్శి, ప్రత్యేక అధికారి...
పంచాయతీలో కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు రూ.1.30 కోట్లు గోల్‌మాల్ అయ్యాయన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. ఇందులో అధికంగా తప్పతోవ పట్టినట్టుగా తెలుస్తోంది. ట్రాక్టర్ కొనుగోలు చేసినా ఇప్పటి వరకూ అందుకు సంబంధించిన బిల్లులు పెట్టలేదంటున్నారు. ఈ వ్యవహారం దాదాపు నాలుగు నెలల నుంచి జరుగుతున్నా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదిర్శి నుంచి జమా లెక్కలు స్వాధీనం చేసుకోలేదు. చర్యలు చేపట్టామని చెప్పేందుకు తూతూ మంత్రంగా కార్యదర్శి సత్యప్రసాద్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుని చోద్యం చూస్తున్నారు. ఇన్‌చార్జి కార్యదిర్శిగా తొర్రేడు కార్యదర్శిని నియమించి నెలరోజులకుపైగా అవుతున్నా పంచాయతీకి సంబంధించిన రికార్డులు అప్పగించలేదు. సోమవారం రూరల్ మండలంలోని పంచాయతీల పాలనపై కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కాతేరు నిధుల వ్యవహారం చర్చకు వచ్చింది. ఇప్పటి వరకు నిధుల ఖర్చుకు సంబంధించిన రికార్డులు అప్పటి కార్యదర్శి సత్యప్రసాద్ నుంచి ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి డీఎల్‌పీవో వరప్రసాద్‌ను ప్రశ్నించారు. కార్యదర్శిని సస్పెండ్ చేశామని డీఎల్‌పీవో బదులివ్వగా అతన్ను పిలిచి రికార్డులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని, నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు. ఇంటి ప్లాన్ అనుమతులు, ఆదాయం ఎంత? అన్న వివరాలు కూడా లేకపోవతే ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దరఖాస్తులు మాయం...
కాతేరు పంచాయతీలో అధికారులు ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారనడానికి ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే ఓ ఉదాహరణని అన్నారు. ఇలా ఇచ్చిన 65 భవన నిర్మాణాలకు సంబంధించిన యజమానుల దరఖాస్తులు మాత్రం మాయమయ్యాయి. ఆ 65 భవనాలు ఎక్కడివో తేల్చే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ అనుమతులు ఇచ్చారా? ఇస్తే ఆ భవనాలు ఎవరివో విచారణలో తేలనుంది.
మెమో జారీ చేస్తున్నాం...
సస్పెండైన కార్యదర్శి రికార్డులు అప్పగించాల్సి ఉంది. ఈ విషయం ప్రస్తుత ఇన్‌చార్జ్ కార్యదర్శి మా దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన రికార్డులు కూడా అప్పగించాల్సిందిగా కార్యదిర్శి సత్యప్రసాద్, ప్రత్యేక అధికారిగా ఉన్న ఈవోపీ ఆర్ అండ్ ఆర్డీలకు మెమో జారీ చేస్తున్నాం. 65 భవన నిర్మాణాలకు సంబంధించిన తీర్మానం పంచాయతీ కార్యాలయంలో ఉంది. కానీ 65 మంది భవన నిర్మాణదారులు దరఖాస్తులు ఉన్నాయో లేదో తెలియదు. ఈ వ్యవహారం ప్రత్యేక అధికారిగా ఉన్న నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టిలో ఉంది.
– వరప్రసాద్, డీఎల్‌పీవో, రాజమహేంద్రవరం.
Advertisement
Advertisement