అరవయ్యా.. ఇరవయ్యా..!  | Panchayat between TDP Janasena seats: Andhra pradesh | Sakshi
Sakshi News home page

అరవయ్యా.. ఇరవయ్యా..!

Published Sun, Feb 4 2024 4:20 AM | Last Updated on Sun, Feb 4 2024 1:33 PM

Panchayat between TDP Janasena seats: Andhra pradesh  - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రోజురోజుకీ సమీపిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సీట్ల పంపకాలను నానుస్తుండడంపై జనశ్రేణులు కత్తులు నూరుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడో ఖరారైనప్పటికీ ఇప్పటివరకు సీట్ల సంఖ్య తేల్చకపోవడంతో ఇదంతా అధినేతలిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాగానే వారు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి.. క్షేత్రస్థాయిలో జనసేన–టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కటిగా కలిసి పనిచేసే పరిస్థితి లేకున్నా ఉద్దేశపూర్వకంగానే వారిద్దరూ నెలల తరబడి సీట్ల విషయంలో సాగదీత వైఖరి అవలంబిస్తున్నారని వారంటున్నారు.

అలాగే, పొత్తులో భాగంగా జనసేన 60కి పైగా సీట్లను కోరుకుంటుండగా టీడీపీ అతితక్కువగా అంటే 20కి అటూఇటుగా సరిపుచ్చాలనే ధోరణితో ఉంది. ఈ విషయం పవన్‌కు స్పష్టంగా తెలుసునని.. అయినా ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చూస్తుంటే పవన్‌ చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారన్నది స్పష్టంగా అర్ధమవుతోందని జనసేన నేతలు చెబుతున్నారు. అసలు జనసేనకు కేటాయించే సీట్లు అరవయ్యా.. ఇరవయ్యా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబుకు పోటీగా పవన్‌ రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించడం కూడా పెద్ద నాటకమేనని.. అదేదో చంద్రబాబుకు కౌంటర్‌గా తాను ఆ ప్రకటన చేసినట్లుగా పవన్‌ బిల్డప్‌ ఇచ్చుకున్నారని.. ఇది పార్టీలో పెద్ద నవ్వులాటగా మారిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.   

పవన్‌ తీరుతో నిస్తేజంలో నేతలు
అలాగే, పొత్తుల డ్రామాలో తాము పూర్తిగా టీడీపీ ట్రాప్‌లో పడిపోయామని జనసేన శ్రేణులు అంటున్నారు. కీలక ఎన్నికల సమయంలో పార్టీలో ఎలాంటి హడావుడి లేకపోవడం ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్తోందో అందరికీ తెలిసిందేనని.. పవన్‌ తీరు­తో రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులందరూ పూర్తి నిస్తేజంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేయడానికి అవకాశం వస్తుందో తెలీక నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా ఉండే కొద్దిమంది అభిమానులు పూర్తి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు.

పవన్‌ ఉద్దేశపూర్వకంగానే సీట్ల కేటాయింపును తేల్చకుండా పార్టీలో నిస్తేజపూరిత వాతావరణం సృష్టిస్తున్నారని.. తద్వారా రాష్ట్రంలో జనసేన ప్రభావం పెద్దగాలేద­ని సాకులు చెప్పి కేవలం అరకొర సీట్లను తీసు­కోవాలన్నది పవన్‌ ఎత్తుగడ కావొచ్చని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. నిజానికి.. ప్రస్తుత పరిస్థితుల కంటే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఆరేడు నెలల ముందు జనసేన చాలా క్రియాశీలకంగా పని­చేసిందని, ఇప్పటికంటే అప్పుడే పవన్‌ ఎక్కువగా ప్రజల్లో ఉన్నారని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. 

జనసేన నేతల మండిపాటు 
ఇదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ పవన్‌ను తమ ఎన్నికల కార్యక్రమాలకు పూర్తిగా ఉపయోగించుకుంటోందని.. ఇందుకు తమ అధినేత కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా చంద్రబాబు చెప్పింది చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇందుకు వారు పలు సంఘటనలను సైతం ఉదహరిస్తున్నారు. మొన్న డిసెంబరులో లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పవన్‌ స్వయంగా పాల్గొన్నారని.. అలాగే, చంద్రబాబుతో కలిసి రాజధాని గ్రామం మందడంలో సంకాంత్రి వేడుకల్లో పాల్గొన్నారని.. అంతేకాక, జనవరి 9న ఇద్దరూ విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి భేటీ అయ్యారని వారు గుర్తుచేస్తున్నారు. ఇంకోవైపు.. టీడీపీ నిర్వహిస్తున్న ‘రా.. కదిలిరా’ సభల్లో పవన్‌ ఫొటోలను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ప్రచారం చేసుకుంటున్నా పవన్‌ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోవడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. 

పవన్‌ ప్రజల్లోకి వచ్చి 4 నెలలు
ఇక జనసేన పోటీచేసే సీట్లు ఇప్పటికీ తేలకపోవడంతో నియోజకవర్గాల్లో పార్టీ నేతలు సైతం సహకరించే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో పవన్‌కళ్యాణ్‌ జిల్లా పర్యటనలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వచ్చి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. గత ఏడాది అక్టోబరు రెండో వారంలో ఆఖరిసారిగా ఆయన ఉమ్మడి తూర్పు గోదా­వరి జిల్లా వారాహి యాత్రలో పాల్గొన్నారు.

అలాగే, డిసెంబరు చివర్లో పవన్‌ కాకినాడ ప్రాంతంలో పర్యటించి­నా, ఆ పర్యటన కేవలం పార్టీ నేతల సమావేశాలకే పరిమితమయ్యారు. మరోవైపు.. జనవరి నెలాఖరు నుంచి పవన్‌ ఎన్నికల ప్రచార సభలు ఉంటా­య­ని కూడా ఆ పార్టీ 20 రోజుల క్రితం ప్రకటించింది. అయితే, ఫిబ్రవరి మొదటివారం ముగుస్తున్నా పవన్‌ పర్యటనలపై పార్టీలోనే స్పష్టతలేదు. ఇదంతా దేనికి సంకేతమని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement