'వాడిని బూట్లతో తన్ను'
లక్నో: లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులను బూట్లతో తన్నాలని ఉత్తరప్రదేశ్లోని ఓ పంచాయతీ పెద్దలు రేప్ బాధితురాలికి సూచిస్తూ తీర్పునిచ్చారు. అలాంటి వ్యక్తిని అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదని హెచ్చరించింది. రాష్ట్రంలోని తోడల్పూర్ అనే గ్రామంలో ఓ మహిళపై ఈ నెల 19న ఇద్దరు వ్యక్తులు లైంగికదాడి చేశారు. ఈ క్రమంలో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు లోనై ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది.
ఈ విషయం పంచాయతీ పెద్దలకు తెలియడంతో వారు విభిన్నంగా తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.ఐదు లక్షలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అయితే, లైంగిక దాడికి పాల్పడినవారిలో ఒకరు ఆ మొత్తం చెల్లించేందుకు అంగీకరించకపోవడంతో వారి ముఖంపై అందరూ చూస్తుండగానే ఇంకు చల్లేందుకు, బూట్లతో తన్నేందుకు ఆ పంచాయతీ బాధితురాలికి అనుమతిస్తూ తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పుపట్ల పలువురు సామాజిక వేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి ఘటనలు గాలికొదిలేయడం వల్లే పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకొని అడ్డగోలుగా వ్యవహారిస్తున్నారని చెప్పారు.