పంచాయతీలకు షాక్
పంచాయతీలకు షాక్
Published Wed, Oct 5 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
– విద్యుత్ బిల్లులు మీరే కట్టుకోండి
– 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సర్ధుబాటు చేసుకోండి
– పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు
– తగదంటున్న సర్పంచ్‌లు
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :
గ్రామ పంచాయతీల్లో వీధి లైట్లు, మంచినీటి సరఫరా తదితర అవసరాలకు వినియోగించే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను చెల్లించే విషయంలో సర్కారు చేతులెత్తేసింది. ఆ బిల్లు బకాయిలను 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సర్ధుబాటు చేసుకోవాలంటూ షాకిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి పంచాయతీలకు ఉత్తర్వులు అందాయి. పన్నుల రూపంలో వస్తున్న కొద్దిపాటి ఆదాయం పంచాయతీల నిర్వహణకే సరిపోక సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొద్దోగొప్పో అభివద్ధి పనులు చేసుకోవచ్చని సర్పంచ్‌లంతా ఆశించారు. అయితే, ఏడాదికి పైగా బకాయి ఉన్న విద్యుత్ బిల్లులను 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేషీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధుల్లో 12 శాతం వరకు సొమ్మును విద్యుత్ బిల్లులకు వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో షాక్ తినడం పంచాయతీ పాలకుల వంతయ్యింది.
పంచాయతీలపైనే భారం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేది. ఆ తరువాత పాలకులు ఆ భారాన్ని పంచాయతీలపై నెట్టేశాయి. ప్రస్తుత ప్రభుత్వమైనా కనికరిస్తుందని పంచాయతీ పాలకవర్గాలు ఆశించాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వినతులు సైతం పంపించాయి. అయినా.. ప్రభుత్వం కనికరించలేదు. ఆ భారాన్ని పంచాయతీలు మోయాల్సిందేనంటూ.. 12వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ శాఖకు చెల్లించాలని ఆదేశాలందాయి. రాకరాక వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 12 శాతాన్ని విద్యుత్ బకాయిలు తీర్చడానికి వెచ్చిస్తే గ్రామాల్లో అభివద్ధి కార్యక్రమాలకు ఏం ఖర్చు చేయగలమని పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
రూ.7.53 కోట్ల బకాయిలు
జిల్లాలోని అన్ని పంచాయతీలు విద్యుత్ శాఖకు రూ.7.53 కోట్ల బిల్లులను బకాయిపడ్డాయి. సెప్టెంబర్ నెల బిల్లులతో కలిపితే బకాయిల మొత్తం మరింత పెరుగుతుంది.
ఆర్థిక సంఘం నిధులు 57 కోట్లు
14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాలోని 909 పంచాయతీలకు రూ.57 కోట్లు›విడుదలయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు పంచాయతీలు తమకు వచ్చిన ఆర్థిక సంఘం నిధుల నుంచి 12 శాతం విద్యుత్ శాఖకు చెల్లిస్తే రూ.6.84 కోట్లు కరిగిపోతాయి. విద్యుత్ బిల్లుల బకాయి దాదాపు 95 శాతం వరకూ తీరుతుంది.
డీపీవోతో చర్చిస్తాం
పంచాయతీల బకాయిపడిన విద్యుత్ బిల్లుల వసూలుకు సంబంధించి మార్గదర్శకాలు అందాయి. దీనిపై జిల్లా పంచాయతీ అధికారితో చర్చించి పంచాయతీ పాలకవర్గాలు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరతాం. అనంతరం పంచాయతీలకు కొంత గడువు ఇస్తాం. అప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించని పంచాయతీలపై చర్యలు చేపడతాం.
– సీహెచ్.సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఈ, ఈపీడీసీఎల్
Advertisement
Advertisement