surpunch
-
మిత్తి కట్టిన హరీశ్‌రావు, ఎందుకో తెలుసా?
చిన్నశంకరంపేట (మెదక్): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ నర్సమ్మ తన బాధను మంత్రి హరీశ్‌రావుతో పంచుకున్నారు. ఏడాది క్రితం గ్రామంలో రూ.5 లక్షల సీసీ రోడ్డు, జీపీ నిధుల ద్వారా మరో రూ.3.5 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు నిర్వహించి ఏడాది అయినప్పటికీ బిల్లులు మంజూరు కాకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు మిత్తి కడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికి రూ.95 వేల వరకు మిత్తి చెల్లించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ అయిన కొద్దిరోజులకే భర్త కిషన్ చనిపోయినప్పటికీ చెడ్డపేరు రావొద్దని అప్పు చేసి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. స్పందించిన మంత్రి బిల్లుల ఆలస్యానికి కారణమేంటని పంచాయతీ రాజ్ ఈఈ రామచంద్రారెడ్డి, ఏఈ విజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. బిల్లు మంజూరైనప్పటికీ బ్యాంకు ఐఎఫ్‌సీ కోడ్ నంబర్‌ను తప్పుగా కొట్టడంతో ఆలస్యమైందని సమాధానమిచ్చారు. దీంతో మంత్రి హరీశ్ రూ.లక్ష నగదును సర్పంచ్‌కు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ‘కేంద్ర పాలిత’ యోచన లేదు -
సర్పంచ్ భర్త రౌడీయిజం, తెగిపడ్డ చేయి
సాక్షి, కమలాపూర్: పాత కక్షలను మనసులో పెట్టుకున్న మర్రిపల్లిగూడెం సర్పంచ్ భర్త విజయ్ కుమార్ తన అనుచరులతో తిరుపతి(30) అనే యువకుడిపై కత్తులతో దాడి చేయించాడు. దీంతో యువకుడి ఎడమ చేయి మణికట్టు నుంచి తెగిపడటంతోపాటు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ డి. రవిరాజు కథనం ప్రకారం.. మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన ఇనుగాల విజయ్‌కుమార్ రెండో భార్య జ్యోత్స్న మున్సిపాలిటీ ఉద్యోగి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో విజయ్‌కుమార్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత జ్యోత్స్న అదే గ్రామానికి చెందిన ఇనుగాల తిరుపతిని ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరి పెళ్లి ఫొటోలు వాట్సాప్‌లో చూసిన మొదటి భర్త జ్యోత్స్నను తిరుపతి అపహరించుకెళ్లాడని హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో తిరుపతి అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే, ఏడాది క్రితం తిరుపతి తమ్ముడు మధు అవసరం నిమిత్తం విజయ్ కుమార్ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. కాగా, తిరుపతి తన రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడని మనసులో పెట్టుకున్న విజయ్‌కుమార్ అప్పుగా తీసుకున్న డబ్బు ఇవ్వాలని మధును బూతులు తిడుతూ చెప్పుతో కొట్టాడు. మధు ఫిర్యాదుతో కమలాపూర్ పీఎస్‌లో విజయ్‌కుమార్‌పై కేసు నమోదైంది. ఈ కోపంతో తిరుపతిని ఎలాగైనా చంపాలని విజయ్ కక్ష పెంచుకున్నాడు. అదను చూసి.. కాగా, బతుకుదెరువు కోసం కేరళ, ఛత్తీస్‌గఢ్ వెళ్లిన తిరుపతి మూడు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన విజయ్‌కుమార్ తన అనుచరులతో పన్నాగం పన్నాడు. గురువారం రాత్రి తిరుపతి గ్రామంలోని జెండా గద్దె వద్ద కూర్చొని ఉండగా ఇనుగాల కుమార్, ఇనుగాల మొగిలి, ఇనుగాల సాంబయ్య, ఇనుగాల రాజు, ఇనుగాల రవి కర్రలతో దాడి చేస్తూ గ్రామ శివారులోని పెద్దిరెడ్డి చెరువు కట్ట వైపు తీసుకెళ్లారు. అక్కడ డొక్కలో, ఛాతి, భుజంపై పదునైన కత్తులతో పొడవడంతో ఎడమ చేయి మణికట్టు నుంచి తెగిపడటంతోపాటు తీవ్రగాయాలు అయ్యాయి. తిరుపతి చనిపోయాడని భావించిన ఐదుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న తిరుపతి తమ్ముడు మధు రక్తపు మడుగులో పడిఉన్న తన అన్నను 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. సమాచారం అందుకున్న కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్, ఇన్స్పెక్టర్ రవిరాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలిని శుక్రవారం పరిశీలించారు. తన సోదరుడు తిరుపతిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మధు ఫిర్యాదు చేయగా ఇనుగాల విజయ్‌కుమార్, ఇనుగాల కుమార్, ఇనుగాల మొగిలి, ఇనుగాల సాంబయ్య, ఇనుగాల రాజు, ఇనుగాల రవి, ఇనుగాల జోత్స్నపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. వీరిలో విజయ్, జ్యోత్స్న, రాజు, మొగిలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు. దీంతోపాటు నిందితుల నుంచి కారు, ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. -
సర్పంచ్‌తో గొడవ.. మాజీ సర్పంచ్ మృతి
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూర్ మండలం జైత్రామ్ తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ స్మశానవాటిక స్థల పరిశీలన విషయంలో సర్పంచ్, మాజీ సర్పంచ్ వర్గాల మధ్య మొదలైన వివాదం చిలిచిలికి గాలివానలా మారింది. గ్రామ సర్పంచ్ రేణుక భర్త రాథోడ్ పరశురామ్ వర్గం, మాజీ సర్పంచ్ రాథోడ్ గజానంద్ వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. ఈ క్రమంలో మాజీ సర్పంచ్ రాథోడ్ గజానంద్ గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో ఇరువర్గాల్లోని కొందరు వ్యక్తులు నాలుగు ఇళ్లకు నిప్పంటించారు. ఓ కారు, మూడు బైకులను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వరరావు గ్రామంలో అదనపు బలగాలు, సాయుధ పోలీసులను మోహరించారు. జైత్రాం తాండ గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని గొడవలతో భగ్నం చేసిన పరిస్థితులపై వేగంగా విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాలు ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ఇలాంటి గొడవలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డీఎస్పీలకు సూచించారు. -
నేను సీఎంను మాట్లాడుతున్నా..
సాక్షి, జగదేవ్‌పూర్(గజ్వేల్): జగదేవ్‌పూర్ మండలంలోని కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల సర్పంచ్‌లతో సీఎం కేసీఆర్ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో దశాబ్దాల నుంచి ఉన్న భూ సమస్యలను పలుమార్లు రైతులు సంబంధిత అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిష్కారం కాలేదు. దీంతో శుక్రవారం స్వయంగా సీఎం కేసీఆర్ రెండు గ్రామాల సర్పంచ్‌లకు ఫోన్ చేసి మాట్లాడారు. భూ సమస్యను పరిష్కరించి రెండు మూడు రోజుల్లో రైతులకు రైతు బంధు చెక్కులు అందిస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో కుదరకపోతే పది రోజుల్లో వచ్చి పట్టా పాస్ పుస్తకాలను స్వయంగా పంపిణీ చేస్తానని చెప్పినట్లు సర్పంచ్‌లు తెలిపారు. సీఎం: హలో కొత్తపేట సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, నేను సీఎంను మాట్లాడుతున్నా. సర్పంచ్: సార్.. సార్ నమస్కారం. సీఎం: మీ ఊరిలో భూ సమస్యలు పరిష్కరించడానికి అధికారులను పంపిస్తున్నాను. సర్పంచ్: ఓకే సార్.. పంపించండి. సీఎం: డీఏఓ శ్రావణ్‌కుమార్ వస్తున్నారు. దగ్గరుండి రైతులందరినీ జమ చేసి సమస్యను వివరించండి. సర్పంచ్: ఓకే సార్. సీఎం: భూ సమస్య పరిష్కారంతో రైతుబంధు చెక్కులు కూడా వస్తాయి. సర్పంచ్: సార్ మీరు మా ఊరికి తప్పకుండా రావాలి సీఎం: నేను శనివారం లేదా ఆదివారమైనా, సోమవారమైనా వస్తాను. శనివారం కలెక్టర్‌ను పంపిస్తాను అంటూ సీఎం కేసీఆర్ ఫోన్ పెట్టేశారు. అంతకు ముందే డీఏఓ శ్రావణ్‌కుమార్ కొత్తపేటకు చేరుకున్నారు. ఆయన కూడా కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. డీఏఓ మాట్లాడుతూ భూ సమస్య పరిష్కరించి రైతుబంధు చెక్కులు తనే అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. అలాగే ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్‌తో మాట్లాడుతూ దగ్గరుండి పని పూర్తి చేయించుకోవాలని సీఎం ఆయనకు సూచించారు. -
సర్పంచ్ అయినా.. కుల వృత్తి వీడలే..
సాక్షి, కోటపల్లి(చెన్నూర్): ఏదైనా పదవి రాగానే కులవృత్తిని పక్కనబెట్టివారిని చూస్తున్నాం.. పదవి పోగానే అయిష్టంగానైనా.. మళ్లీ తమ వృత్తిని కొనసాగించేవారిని చూశాం. కానీ.. ఈయన మాత్రం ఓ గ్రామానికి సర్పంచ్ అయినా కులవృత్తిపై మాత్రం మమకారం వీడలేదు. ఉదయాన్నే లేవగానే ఎప్పటిలాగే ప్రజలకు క్షౌ వరం.. షేవింగ్ చేస్తున్నాడు. ఎలాంటి మొహమాటం లేకుండా తన పనిని సాఫీగా చేసుకుంటూపోతున్నాడు కోటపల్లి మండలం లింగన్నపేట పంచాయతీ సర్పంచ్ దాగామ రాజు. రాజు ఇటీవల ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు ఎల తన కులవృత్తి చేసుకున్నారో.. ఇప్పుడూ అలాగే తన కులవృత్తిని వదలకుండా గ్రామంలోని చిన్నాపెద్దా తేడా లేకుండా క్షౌవరాలు చేస్తున్నాడు. రాజును చూసి ప్రజలు ‘ఆదర్శంగా నిలుస్తున్నారు..’ అంటూ కితాబునిస్తున్నారు. -
సర్పంచ్ దారుణ హత్య
రాజన్న సిరిసిల్ల: వేములవాడ మండలంలోని హనుమక్కపల్లిలో దారుణం చోటుచేసుకుంది. చందుర్తి మండలం మూడపల్లికి చెందిన సర్పంచ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం వేటకొడవళ్లతో దాడిచేసి హత్య చేశారు. హత్యకి గురైన వ్యక్తిని కాంగ్రెస్ నేత శంకర్‌గా గుర్తించారు. పాతకక్షల కారణంగానే హత్యచేశారని సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు కారును వెంబడించి సర్పంచ్‌ను దారుణంగా హత్యచేశారు. -
బందోబస్తు మధ్య అంత్యక్రియలు
ముత్తారం(మంథని): మంథని– పెద్దపల్లి ప్రధాన రహదారిపై లద్నాపూర్ ఎస్సీకాలనీ వద్ద ఆదివారం సాయంత్రం ఇసుకలారీ ఢీకొని మృతిచెందిన ఆదివారంపేట ఉపసర్పంచ్ ఎలువాక రాజయ్య అంత్యక్రియలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. రాజయ్య మృతితో ఆగ్రహించిన స్థానికుల సుమారు 200 పైగా లారీలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. రాజయ్య అంత్యక్రియల సమయంలో మరేదైనా ఘటన జరుగకుండా లద్నాపూర్, రాజాపూర్ గ్రామాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్, రామగుండం ఏసీపీ రక్షిత కె.మూర్తి నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు. అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు. అంత్యక్రియల్లో జెడ్పీటీసీ చొప్పరి సదానందం, ఎంపీపీ అత్తె చంద్రమౌళి, సర్పంచ్ మైదం కుమార్, ఎంపీటీసీలు వనం రాంచెందర్‌రావు, కన్నూరి విజయనర్సింగరావు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
సర్పంచ్ ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం తుంబూరు సర్పంచ్ కర్లపూడి అనసూర్య(52) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సత్తుపల్లి ఎస్సై నరేష్‌బాబు తెలిపిన వివరాలు.. తుంబూరు గ్రామానికి చెందిన కర్లపూడి రామారావు, అనసూర్య ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్ధిక ఇబ్బందులు తోడర్యాయి. వీటిని తట్టుకోలేకపోయిన అనసూర్య, శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోసుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. పురుగు మందు తాగి విద్యార్థి... ఖమ్మంరూరల్: మండలంలోని ముత్తగూడెం శివారు గొల్లగూడెం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి పులకాని సాయి మహేష్‌రెడ్డి(17), పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సాయి మహేష్‌రెడ్డి, ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 13న ఇంటర్ ఫలితాలు వచ్చాయి. ఇతడు నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే, ఈ నెల 15న పురుగు మందు తాగాడు. ఆ తరువాత, తనకు తెలిసిన ఓ వ్యక్తికి ఫోన్ చేసి, తాను పురుగు మందు తాగినట్టు, పొన్నెకల్ ఊరి బయట ఉన్నట్టు చెప్పాడు. ఆ వ్యక్తి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వారు వెళ్లి ఖమ్మం హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడే శుక్రవారం మృతిచెందాడు. తండ్రి ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదుతో ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. -
ఫోర్జరీ కేసులో సర్పంచ్ అరెస్ట్
వలిగొండ(యాదాద్రి): ఫోర్జరీ సంతకాల సాయంతో కెనరా బ్యాంకులో రూ. 49 లక్షలు లోన్ తీసుకున్న కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం దుప్పెల్లి గ్రామ సర్పంచ్ బందెల స్వామి అర్రూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో ఫోర్జరీ సంతకాల సాయంతో రూ. 49 లక్షల లోన్ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు(యం) పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి బందెలస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
పంచాయతీలకు షాక్
– విద్యుత్ బిల్లులు మీరే కట్టుకోండి – 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సర్ధుబాటు చేసుకోండి – పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు – తగదంటున్న సర్పంచ్‌లు ఏలూరు (ఆర్ఆర్ పేట) : గ్రామ పంచాయతీల్లో వీధి లైట్లు, మంచినీటి సరఫరా తదితర అవసరాలకు వినియోగించే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను చెల్లించే విషయంలో సర్కారు చేతులెత్తేసింది. ఆ బిల్లు బకాయిలను 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సర్ధుబాటు చేసుకోవాలంటూ షాకిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి పంచాయతీలకు ఉత్తర్వులు అందాయి. పన్నుల రూపంలో వస్తున్న కొద్దిపాటి ఆదాయం పంచాయతీల నిర్వహణకే సరిపోక సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొద్దోగొప్పో అభివద్ధి పనులు చేసుకోవచ్చని సర్పంచ్‌లంతా ఆశించారు. అయితే, ఏడాదికి పైగా బకాయి ఉన్న విద్యుత్ బిల్లులను 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేషీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధుల్లో 12 శాతం వరకు సొమ్మును విద్యుత్ బిల్లులకు వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో షాక్ తినడం పంచాయతీ పాలకుల వంతయ్యింది. పంచాయతీలపైనే భారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేది. ఆ తరువాత పాలకులు ఆ భారాన్ని పంచాయతీలపై నెట్టేశాయి. ప్రస్తుత ప్రభుత్వమైనా కనికరిస్తుందని పంచాయతీ పాలకవర్గాలు ఆశించాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వినతులు సైతం పంపించాయి. అయినా.. ప్రభుత్వం కనికరించలేదు. ఆ భారాన్ని పంచాయతీలు మోయాల్సిందేనంటూ.. 12వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ శాఖకు చెల్లించాలని ఆదేశాలందాయి. రాకరాక వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 12 శాతాన్ని విద్యుత్ బకాయిలు తీర్చడానికి వెచ్చిస్తే గ్రామాల్లో అభివద్ధి కార్యక్రమాలకు ఏం ఖర్చు చేయగలమని పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రూ.7.53 కోట్ల బకాయిలు జిల్లాలోని అన్ని పంచాయతీలు విద్యుత్ శాఖకు రూ.7.53 కోట్ల బిల్లులను బకాయిపడ్డాయి. సెప్టెంబర్ నెల బిల్లులతో కలిపితే బకాయిల మొత్తం మరింత పెరుగుతుంది. ఆర్థిక సంఘం నిధులు 57 కోట్లు 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాలోని 909 పంచాయతీలకు రూ.57 కోట్లు›విడుదలయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు పంచాయతీలు తమకు వచ్చిన ఆర్థిక సంఘం నిధుల నుంచి 12 శాతం విద్యుత్ శాఖకు చెల్లిస్తే రూ.6.84 కోట్లు కరిగిపోతాయి. విద్యుత్ బిల్లుల బకాయి దాదాపు 95 శాతం వరకూ తీరుతుంది. డీపీవోతో చర్చిస్తాం పంచాయతీల బకాయిపడిన విద్యుత్ బిల్లుల వసూలుకు సంబంధించి మార్గదర్శకాలు అందాయి. దీనిపై జిల్లా పంచాయతీ అధికారితో చర్చించి పంచాయతీ పాలకవర్గాలు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరతాం. అనంతరం పంచాయతీలకు కొంత గడువు ఇస్తాం. అప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించని పంచాయతీలపై చర్యలు చేపడతాం. – సీహెచ్.సత్యనారాయణరెడ్డి, ఎస్ఈ, ఈపీడీసీఎల్ -
నేడే ‘ఉప’ సమరం
పంచాయతీలు : 21 ఓటర్లు : 30,824 పోలింగ్ కేంద్రాలు : 43 ప్రిసైడింగ్ అధికారులు: 43 విధుల్లో పాల్గొనే సిబ్బంది: 172 ఈవీఎంలు : 43 నవాబుపేట జెడ్పీటీసీ స్థానం ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి మరో ఎంపీటీసీ, రెండు సర్పంచ్ స్థానాలకూ ఎన్నికలు నవాబుపేట: జిల్లాల్లోని ఓ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, రెండు సర్పంచ్ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవాబుపేట జెడ్పీటీసీ స్థానంతోపాటు, శంషాబాద్ ఎంపీటీసీ-2 స్థానానికి, కందుకూరు మండలం చిప్పలపల్లి, వికారాబాద్ మండలం నారాయణపూర్ సర్పంచ్ స్థానాలకు సైతం శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. నవాబుపేట జెడ్పీటీసీ స్థానం నుంచి గెలిచాక ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డి ఆ తర్వాత జెడ్పీటీసీకి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉండగా.. ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి పోలీసు రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి చిట్టెకు మల్లారెడ్డి, టీడీపీ నుంచి జీ. వెంకటేష్‌యాదవ్ , స్వతంత్ర అభ్యర్థిగా ఎం.ఆనంద్‌లు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. నవాబుపేట మండలంలోని 21 పంచాయతీలు, 16 అనుబంధ గ్రామాల్లో కలిపి 30,824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకు మండలంలో 43 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 43 మంది ప్రిసైడింగ్ అధికారులు, 141 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 43 పోలింగ్ కేంద్రాలకు 43 ఈవీఎంలు ఏర్పాటు చేయగా, ఎక్కడైనా అనివార్య కారణాలతో ఈవీఎంలు మొరాయిస్తే తక్షణమే ఏర్పాటు చేయడానికి అదనంగా మరో పది ఈవీఎంలు, ఇంజినీరింగ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, ఇప్పటికే పోల్ స్లిప్పులను ఓటర్లు పంపిణీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ రాధ శనివారం స్థానిక విలేకరులకు వివరించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లతో కలిపి 172 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది సామగ్రితో గ్రామాలకు తరలినట్టు చెప్పారు. ఓటర్ల స్లిప్పులు అందని వారు స్థానిక వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శుల వద్ద తీసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను ఎంపీడీఓ కార్యాలయంలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తామన్నారు. కౌంటింగ్‌కు 8వ తేదీన ఎంపీడీఓ కార్యాలయంలోనే ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా గ్రామాల్లోని బూత్‌లను చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దార్ యాదయ్యలు పరిశీలించారు.