సర్పంచ్‌ భర్త రౌడీయిజం, తెగిపడ్డ చేయి | Man Attacked On Second Wife Husband In Warangal District | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ భర్త రౌడీయిజం, తెగిపడ్డ చేయి

Published Sat, Sep 12 2020 12:31 PM | Last Updated on Sat, Sep 12 2020 12:45 PM

Man Attacked On Second Wife Husband In Warangal District - Sakshi

సాక్షి, కమలాపూర్‌: పాత కక్షలను మనసులో పెట్టుకున్న మర్రిపల్లిగూడెం సర్పంచ్‌ భర్త విజయ్‌ కుమార్‌ తన అనుచరులతో తిరుపతి(30) అనే యువకుడిపై కత్తులతో దాడి చేయించాడు. దీంతో యువకుడి ఎడమ చేయి మణికట్టు నుంచి తెగిపడటంతోపాటు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం మర్రిపల్లిగూడెంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ డి. రవిరాజు కథనం ప్రకారం.. మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన ఇనుగాల విజయ్‌కుమార్‌ రెండో భార్య జ్యోత్స్న మున్సిపాలిటీ ఉద్యోగి. సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో విజయ్‌కుమార్‌ ఆమెకు విడాకులు ఇచ్చాడు.

ఆ తర్వాత జ్యోత్స్న అదే గ్రామానికి చెందిన ఇనుగాల తిరుపతిని ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరి పెళ్లి ఫొటోలు వాట్సాప్‌లో చూసిన మొదటి భర్త జ్యోత్స్నను తిరుపతి అపహరించుకెళ్లాడని హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో తిరుపతి అరెస్ట్‌ అయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే, ఏడాది క్రితం తిరుపతి తమ్ముడు మధు అవసరం నిమిత్తం విజయ్‌ కుమార్‌ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. కాగా, తిరుపతి తన రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడని మనసులో పెట్టుకున్న విజయ్‌కుమార్‌ అప్పుగా తీసుకున్న డబ్బు ఇవ్వాలని మధును బూతులు తిడుతూ చెప్పుతో కొట్టాడు. మధు ఫిర్యాదుతో కమలాపూర్‌ పీఎస్‌లో విజయ్‌కుమార్‌పై కేసు నమోదైంది. ఈ కోపంతో తిరుపతిని ఎలాగైనా చంపాలని విజయ్‌ కక్ష పెంచుకున్నాడు. 

అదను చూసి..
కాగా, బతుకుదెరువు కోసం కేరళ, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లిన తిరుపతి మూడు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన విజయ్‌కుమార్‌ తన అనుచరులతో పన్నాగం పన్నాడు. గురువారం రాత్రి తిరుపతి గ్రామంలోని జెండా గద్దె వద్ద కూర్చొని ఉండగా ఇనుగాల కుమార్, ఇనుగాల మొగిలి, ఇనుగాల సాంబయ్య, ఇనుగాల రాజు, ఇనుగాల రవి కర్రలతో దాడి చేస్తూ గ్రామ శివారులోని పెద్దిరెడ్డి చెరువు కట్ట వైపు తీసుకెళ్లారు. అక్కడ డొక్కలో, ఛాతి, భుజంపై పదునైన కత్తులతో పొడవడంతో ఎడమ చేయి మణికట్టు నుంచి తెగిపడటంతోపాటు తీవ్రగాయాలు అయ్యాయి. తిరుపతి చనిపోయాడని భావించిన ఐదుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న తిరుపతి తమ్ముడు మధు రక్తపు మడుగులో పడిఉన్న తన అన్నను 108 వాహనంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు.

సమాచారం అందుకున్న కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్, ఇన్‌స్పెక్టర్‌ రవిరాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలిని శుక్రవారం పరిశీలించారు. తన సోదరుడు తిరుపతిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మధు ఫిర్యాదు చేయగా ఇనుగాల విజయ్‌కుమార్, ఇనుగాల కుమార్, ఇనుగాల మొగిలి, ఇనుగాల సాంబయ్య, ఇనుగాల రాజు, ఇనుగాల రవి, ఇనుగాల జోత్స్నపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. వీరిలో విజయ్, జ్యోత్స్న, రాజు, మొగిలిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు. దీంతోపాటు నిందితుల నుంచి కారు, ద్విచక్ర వాహనం, నాలుగు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement