సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూర్ మండలం జైత్రామ్ తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ స్మశానవాటిక స్థల పరిశీలన విషయంలో సర్పంచ్, మాజీ సర్పంచ్ వర్గాల మధ్య మొదలైన వివాదం చిలిచిలికి గాలివానలా మారింది. గ్రామ సర్పంచ్ రేణుక భర్త రాథోడ్ పరశురామ్ వర్గం, మాజీ సర్పంచ్ రాథోడ్ గజానంద్ వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. ఈ క్రమంలో మాజీ సర్పంచ్ రాథోడ్ గజానంద్ గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో ఇరువర్గాల్లోని కొందరు వ్యక్తులు నాలుగు ఇళ్లకు నిప్పంటించారు.
ఓ కారు, మూడు బైకులను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వరరావు గ్రామంలో అదనపు బలగాలు, సాయుధ పోలీసులను మోహరించారు. జైత్రాం తాండ గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని గొడవలతో భగ్నం చేసిన పరిస్థితులపై వేగంగా విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాలు ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ఇలాంటి గొడవలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డీఎస్పీలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment