పంచాయతీలు : 21
ఓటర్లు : 30,824
పోలింగ్ కేంద్రాలు : 43
ప్రిసైడింగ్ అధికారులు: 43
విధుల్లో పాల్గొనే సిబ్బంది: 172
ఈవీఎంలు : 43
నవాబుపేట జెడ్పీటీసీ స్థానం ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
మరో ఎంపీటీసీ, రెండు సర్పంచ్ స్థానాలకూ ఎన్నికలు
నవాబుపేట: జిల్లాల్లోని ఓ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, రెండు సర్పంచ్ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవాబుపేట జెడ్పీటీసీ స్థానంతోపాటు, శంషాబాద్ ఎంపీటీసీ-2 స్థానానికి, కందుకూరు మండలం చిప్పలపల్లి, వికారాబాద్ మండలం నారాయణపూర్ సర్పంచ్ స్థానాలకు సైతం శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు.
నవాబుపేట జెడ్పీటీసీ స్థానం నుంచి గెలిచాక ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డి ఆ తర్వాత జెడ్పీటీసీకి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉండగా.. ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ నుంచి పోలీసు రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి చిట్టెకు మల్లారెడ్డి, టీడీపీ నుంచి జీ. వెంకటేష్‌యాదవ్ , స్వతంత్ర అభ్యర్థిగా ఎం.ఆనంద్‌లు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది.
నవాబుపేట మండలంలోని 21 పంచాయతీలు, 16 అనుబంధ గ్రామాల్లో కలిపి 30,824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకు మండలంలో 43 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 43 మంది ప్రిసైడింగ్ అధికారులు, 141 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 43 పోలింగ్ కేంద్రాలకు 43 ఈవీఎంలు ఏర్పాటు చేయగా, ఎక్కడైనా అనివార్య కారణాలతో ఈవీఎంలు మొరాయిస్తే తక్షణమే ఏర్పాటు చేయడానికి అదనంగా మరో పది ఈవీఎంలు, ఇంజినీరింగ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, ఇప్పటికే పోల్ స్లిప్పులను ఓటర్లు పంపిణీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ రాధ శనివారం స్థానిక విలేకరులకు వివరించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లతో కలిపి 172 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల సిబ్బంది సామగ్రితో గ్రామాలకు తరలినట్టు చెప్పారు. ఓటర్ల స్లిప్పులు అందని వారు స్థానిక వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శుల వద్ద తీసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను ఎంపీడీఓ కార్యాలయంలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తామన్నారు. కౌంటింగ్‌కు 8వ తేదీన ఎంపీడీఓ కార్యాలయంలోనే ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా గ్రామాల్లోని బూత్‌లను చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దార్ యాదయ్యలు పరిశీలించారు.
నేడే ‘ఉప’ సమరం
Published Fri, Dec 4 2015 11:34 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement