సాక్షి, జగదేవ్‌పూర్(గజ్వేల్): జగదేవ్‌పూర్ మండలంలోని కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల సర్పంచ్‌లతో సీఎం కేసీఆర్ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో దశాబ్దాల నుంచి ఉన్న భూ సమస్యలను పలుమార్లు రైతులు సంబంధిత అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిష్కారం కాలేదు. దీంతో శుక్రవారం స్వయంగా సీఎం కేసీఆర్ రెండు గ్రామాల సర్పంచ్‌లకు ఫోన్ చేసి మాట్లాడారు. భూ సమస్యను పరిష్కరించి రెండు మూడు రోజుల్లో రైతులకు రైతు బంధు చెక్కులు అందిస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో కుదరకపోతే పది రోజుల్లో వచ్చి పట్టా పాస్ పుస్తకాలను స్వయంగా పంపిణీ చేస్తానని చెప్పినట్లు సర్పంచ్‌లు తెలిపారు.
సీఎం: హలో కొత్తపేట సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, నేను సీఎంను మాట్లాడుతున్నా.
సర్పంచ్: సార్.. సార్ నమస్కారం.
సీఎం: మీ ఊరిలో భూ సమస్యలు పరిష్కరించడానికి అధికారులను పంపిస్తున్నాను.
సర్పంచ్: ఓకే సార్.. పంపించండి.
సీఎం: డీఏఓ శ్రావణ్‌కుమార్ వస్తున్నారు. దగ్గరుండి రైతులందరినీ జమ చేసి సమస్యను వివరించండి.
సర్పంచ్: ఓకే సార్.
సీఎం: భూ సమస్య పరిష్కారంతో రైతుబంధు చెక్కులు కూడా వస్తాయి.
సర్పంచ్: సార్ మీరు మా ఊరికి తప్పకుండా రావాలి
సీఎం: నేను శనివారం లేదా ఆదివారమైనా, సోమవారమైనా వస్తాను. శనివారం కలెక్టర్‌ను పంపిస్తాను అంటూ సీఎం కేసీఆర్ ఫోన్ పెట్టేశారు.
అంతకు ముందే డీఏఓ శ్రావణ్‌కుమార్ కొత్తపేటకు చేరుకున్నారు. ఆయన కూడా కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. డీఏఓ మాట్లాడుతూ భూ సమస్య పరిష్కరించి రైతుబంధు చెక్కులు తనే అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. అలాగే ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్‌తో మాట్లాడుతూ దగ్గరుండి పని పూర్తి చేయించుకోవాలని సీఎం ఆయనకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment