
ఇసుక అరకొర!
మారిన కొత్త ఇసుక విధానం జిల్లా వాసులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా కన్పిస్తోంది.
జిల్లాలో ఇసుక రీచ్‌లకు వేలం లేనట్టే
రీచ్‌లన్నీ థర్డ్ ఆర్డర్ పరిధిలోనివే
నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే
{పభుత్వావసరాలకు సీనరేజ్ చెల్లిస్తే చాలు..
గ్రామ పరిధిలో వ్యక్తిగత అవసరాలకు ఉచితం
తోపుడు బండ్ల ద్వారానే రవాణాకు అనుమతి
ఆరు రీచ్‌ల్లోనే అందుబాటులో.. ఇసుక కష్టాలు రెట్టింపు
విశాఖపట్నం : మారిన కొత్త ఇసుక విధానం జిల్లా వాసులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా కన్పిస్తోంది. ముఖ్యంగా నగరవాసులకు ఈ కష్టాలు మరింత రెట్టింపయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటివరకు డ్వాక్రా సంఘాల నిర్వహణలో ఉన్న రీచ్‌ల్లోని ఇసుకను విశాఖ, అనకాపల్లి, ఆనందపురం డిపోలకు తీసుకొచ్చి నగర పరిధిలోని అవసరాలను కొంతలో కొంత తీర్చేవి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఇసుక పాలసీ ప్రకారం ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఆర్డర్ పరిధిలో ఉండే జీవనదుల పరివాహక ప్రాంతాలలోని 20 వేల క్యూ.మీ. ఇసుక ఉన్న రీచ్‌లకు వేలం వేయాలని సర్కార్ ఆదేశించింది. థర్డ్ ఆర్డర్ పరిధిలో ఉండే చిన్న చిన్న నదులు.. వాగులు.. వంకల్లో ఉండే ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించింది. గతేడాది జిల్లాలో డీ నోటిఫై చేసిన 25 రీచ్‌ల్లో 19 రీచ్‌ల్లో తవ్వకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆరు రీచ్‌ల్లో మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. అందులో ఏజెన్సీ పరిధిలో మంగమంద రీచ్‌లో మినహా మిగిలిన ఏ రీచ్‌లోనూ పట్టుమని నాలుగైదువేల క్యూ.మీ. ఇసుక కూడా లేదు. ప్రస్తుతం ప్రవాహం ఎక్కువగా ఉండడం. ఏజెన్సీ ఇసుక నిర్మాణానికి అంతగా అనువగా లేకపోవడంతో మంగబంద రీచ్‌కు వేలం వేసే పరిస్థితి లేదు. ఇక మిగిలిన గవరవరం, జుర్తాడ, సాగరం, గొట్టివాడ, కాశీపట్నం రీచ్ ల్లో మొత్తం 10 వేల క్యూ.మీ.కు మించి ఇసుక లేదు.
ఇసుక లభ్యత అంతంతమాత్రమే: ఇటీవల మైన్స్ అండ్ జువాలజీ డిపార్టుమెంట్ సర్వే చేసి గుర్తించిన 39 రీచ్‌ల్లో కూడా ఎక్కడా పట్టుమని పదివేల క్యూ.మీ. ఇసుక లేని పరిస్థితి. పైగా రీచ్‌ల చుట్టూ స్ట్రక్చర్స్ ఉండంతో వాల్టా చట్టం ప్రకారం తవ్వకాలు జరిపే అవకాశం కూడా లేదని మైనింగ్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరో రెండు మూడు నెలల పాటు డీనోటిఫై చేసిన రీచ్‌ల్లో ఇసుక నిల్వలను గుర్తించే అవకాశం లేదు. డ్రాప్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం జిల్లాలో ఏ ఒక్క రీచ్‌కు వేలం వేసే చాన్స్ లేదు. థర్డ్ ఆర్డర్ పరిధిలో ఉండే రీచ్‌ల నిర్వహణ బాధ్యతను పూర్తిగా స్థానికంగా ఉండే పంచాయతీలకే అప్పగించింది. ఆ మండల పరిధిలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సీనరేజ్ ఫీజు క్యూ.మీ.కు రూ.40 చొప్పున చెల్లించి ఎండ్లబండ్లపై మాత్రమే ఇసుకను తీసుకెళ్లాలి. గ్రామ పరిధిలో వ్యక్తిగత అవసరాలకైతే పంచాయతీ కార్యదర్శి అనుమతితో ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న రీచ్‌ల్లోనే కాదు.. మిగిలిన రీచ్‌ల్లో ఇసుకను కూడా గ్రామం లేదా మండలం దాటి తీసుకెళ్లే అవకాశం లేదు. ఈ లెక్కన గ్రామీణ జిల్లాతో పాటు విశాఖ సిటీ పరిధిలో నిర్మాణ రంగానికికావాల్సిన ఇసుక కోసం పొరుగు జిల్లాలను ఆశ్రయించాల్సిందే. ఇప్పటివరకు రీచ్‌ల్లో తవ్విన, పొరుగు జిల్లాల నుంచి తీసుకొచ్చిన ఇసుకను జిల్లాలోని డిపోల ద్వారా విక్రయించే వారు. ప్రస్తుతం ఇసుక అమ్మకాలతో మైన్స్ అండ్ జువాలజీ, డీఆర్‌డీఎలకే కాదు.. జిల్లా కలెక్టర్‌కు కూడా సంబంధం లేదు. ఎవరైనా తమ అవసరాలకు ఇసుక కావాలంటే రాష్ర్టంలో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసుకునే వెసులుబాటు క ల్పించారు. పొరుగు జిల్లాల నుంచి ఇసుక కొనుగోలు విషయంలో బిల్డర్లు, బడా బాబులకు ఇబ్బంది లేకున్నా సామాన్యులకు మాత్రం ఇసుక కష్టాలు మరింత రెట్టింపయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆరు రీచ్‌ల్లో అందుబాటులో ఉన్న ఇసుకను ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఈ నెలాఖరులోగా విక్రయించుకునే అవకాశాన్ని రీచ్‌లను నిర్వహిస్తున్న డ్వాక్రాసంఘాలకు ప్రభుత్వం కల్పించింది. ఫిబ్రవరి 1 నుంచి వీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు.