వేలం పాటల్లో పోటాపోటీ
వేలం పాటల్లో పోటాపోటీ
Published Mon, Mar 27 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
- 109 మంది పోటీ
- పంచాయతీకి పెరిగిన ఆదాయం
- గత ఏడాదితో పోల్చితే 30 రెట్లు అధికం
దేవనకొండ : పాటదారుల ఆధిపత్య పోరు కారణంగా ఈ ఏడాది పంచాయతీకి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. పంచాయతీ వేలం పాటలకు 109 మంది పోటాపోటీగా తలపడ్డారు. సోమవారం ఉదయం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదోని డీఎల్‌పీఓ ఎలీషా, ఎంపీడీఓ భాస్కర్‌నాయుడు, ఈఓపీఆర్‌డీ అగస్టీన్, మేజర్ పంచాయతీ సర్పంచు లక్ష్మిదేవమ్మ ఆధ్వర్యంలో పంచాయతీకి చెందిన 17 షాపుల(సముదాయ భవనాలు)కు వేలంపాటలు నిర్వహించారు. మొత్తం 109 మంది పాటదారులు పాల్గొన్నారు. రెండుగ్రూపులకు చెందిన పాటదారులు వేలంపాటలను పెంచుతూ పోయారు. దీంతో పంచాయతీకి ఆదాయం బాగా పెరిగింది. గతేడాదితో పోల్చితే 30 రెట్లు అధికంగా పంచాయతీకి అదాయం సమకూరింది.
గతేడాది 17 షాపులకు నెలసరి అద్దె వేలం పాటలు రూ.40 వేలు మాత్రమే పలకగా ఈ ఏడాది అదే షాపులకు రూ.2.23 లక్షలకు పాట పాడారు. దీంతో మొత్తం సంవత్సరానికి రూ.26.77 లక్షల ఆదాయం పంచాయతీకి సమకూరింది. 5వ దుకాణానికి సంబంధించి గతంలో నెలకు రూ.2 వేలు మాత్రమే ధర నిర్ణయించగా, ఈ ఏడాది అదే దుకాణాన్ని నెలకు రూ.60 వేల ప్రకారం పాట పాడారు. ఈ షాపుపై రెండువర్గాలు వేలంపాటల్లో ఆధిపత్యం సాగింది. ఈ ఆధిపత్యం నడుమ దేవనకొండకు చెందిన వెంకటేశ్వర్లు ఆ షాపును దక్కించుకున్నారు. 2వ షాపు నెలకు రూ.20 వేలు చొప్పున పలికింది. ఈ షాపును జయచంద్ర అనే వ్యక్తి దక్కించుకున్నాడు. వేలాలు దక్కించుకున్న పాటదారులు వచ్చేనెల 26వ తేదీలోగా ఆరు నెలల అడ్వాన్స్ చెల్లించాలని ఈఓపీఆర్‌డీ అగస్టీన్ సూచించారు.
Advertisement