devanakonda
-
మృత్యువులోనూ వీడని స్నేహం
ఆలూరు: వారిద్దరూ స్నేహితులు. కలిసిమెలిసి తిరిగేవారు. వ్యక్తిగత పని నిమిత్తం దేవనకొండకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన శనివారం రాత్రి దేవనకొండ మండలం కరిడికొండ సమీపంలో చోటుచేసుకుంది. కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన బోయ సుధాకర్ (36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈయనతో అదే గ్రామానికి చెందిన తెలుగు వెంకటేష్ (38) స్నేహం చేసేవాడు. ఇద్దరూ కలసి శనివారం సాయంత్రం వ్యక్తిగత పనినిమిత్తం మోటారు సైకిల్‌పై దేవనకొండకు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా రాత్రి 8:30 గంటల సమయంలో కరిడికొండ గ్రామ సమీపాన కర్నూలు వైపు నుంచి ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం బలంగా మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకుని ఎస్ఐ శ్రీనివాసులుకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయ సుధాకర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె, తెలుగు వెంకటేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్నేహితులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కప్పట్రాళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
హృదయ విదారకం: కొడుకు మరణవార్త విని తల్లి..
దేవనకొండ: కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి మృతిచెందింది. ఈ విషాదకర ఘటన ఆదివారం గుండ్లకొండ గ్రామంలో చోటు చేసుకుంది. సంపత్‌కుమారి కుమారుడు సందీప్(25)కు మతిస్థిమితం లేదు. బీపీ, షుగర్ ఎక్కువ కావడంతో వైద్యం కోసం శనివారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం రాత్రి సందీప్ మృతి చెందాడు. కుమారుడి మరణ వార్తను జీర్ణించుకోలేక కొన్ని గంటల వ్యవధిలోనే తల్లి సంపత్‌కుమారి(48) కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కాగా మృతురాలి భర్త మూడేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ప్రస్తుతం తల్లీ, కుమారుడు తనువు చాలించడంతో కుటుంబీకులు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సంపత్‌కుమారి వైఎస్సార్సీపీ తరఫున గుండ్లకొండ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. తల్లీ, కుమారుల మృతి బాధాకరమని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గఫూర్, మండలనాయకులు ప్రేమనాథ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. -
ఒంటరిగా ఉందని మహిళపై దాడి
సాక్షి, దేవనకొండ : పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళపై గుర్తుతెలియని దుండగుడు దాడి చేసి, నగలతో ఉడాయించిన ఘటన మండల పరిధిలోని అలారుదిన్నె గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. అలారుదిన్నె గ్రామానికి చెందిన మహాలక్ష్మి బళ్లారి–కర్నూలు రహదారిలో ఉన్న పొలానికి ఉదయమే వెళ్లింది. ఒంటరిగా పనులు చేసుకుంటూ ఉండటాన్ని గమనించిన ఓ దుండగుడు ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై నిలిపి, మహిళ దగ్గరకు చేరుకున్నాడు. ఏదో సమాచారం అడుగుతున్నట్లు నటించి, మెడలోని పుస్తెల తాడు లాక్కునేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తలను పక్కనే ఉన్న బండకేసి కొట్టి తాలిబొట్లు తెంచుకొని పరారయ్యాడు. మహిళ కేకలు విన్న సమీపం పొలంలో ఉన్న కుమారుడు పరుగెత్తుకొచ్చేలోపు దుండగుడు ద్విచక్రవాహనంపై వెళ్లిపోయాడు. దీంతో మహిళ లబోదిబోమంటూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. -
వేలం పాటల్లో పోటాపోటీ
- 109 మంది పోటీ - పంచాయతీకి పెరిగిన ఆదాయం - గత ఏడాదితో పోల్చితే 30 రెట్లు అధికం దేవనకొండ : పాటదారుల ఆధిపత్య పోరు కారణంగా ఈ ఏడాది పంచాయతీకి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. పంచాయతీ వేలం పాటలకు 109 మంది పోటాపోటీగా తలపడ్డారు. సోమవారం ఉదయం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదోని డీఎల్పీఓ ఎలీషా, ఎంపీడీఓ భాస్కర్‌నాయుడు, ఈఓపీఆర్డీ అగస్టీన్, మేజర్ పంచాయతీ సర్పంచు లక్ష్మిదేవమ్మ ఆధ్వర్యంలో పంచాయతీకి చెందిన 17 షాపుల(సముదాయ భవనాలు)కు వేలంపాటలు నిర్వహించారు. మొత్తం 109 మంది పాటదారులు పాల్గొన్నారు. రెండుగ్రూపులకు చెందిన పాటదారులు వేలంపాటలను పెంచుతూ పోయారు. దీంతో పంచాయతీకి ఆదాయం బాగా పెరిగింది. గతేడాదితో పోల్చితే 30 రెట్లు అధికంగా పంచాయతీకి అదాయం సమకూరింది. గతేడాది 17 షాపులకు నెలసరి అద్దె వేలం పాటలు రూ.40 వేలు మాత్రమే పలకగా ఈ ఏడాది అదే షాపులకు రూ.2.23 లక్షలకు పాట పాడారు. దీంతో మొత్తం సంవత్సరానికి రూ.26.77 లక్షల ఆదాయం పంచాయతీకి సమకూరింది. 5వ దుకాణానికి సంబంధించి గతంలో నెలకు రూ.2 వేలు మాత్రమే ధర నిర్ణయించగా, ఈ ఏడాది అదే దుకాణాన్ని నెలకు రూ.60 వేల ప్రకారం పాట పాడారు. ఈ షాపుపై రెండువర్గాలు వేలంపాటల్లో ఆధిపత్యం సాగింది. ఈ ఆధిపత్యం నడుమ దేవనకొండకు చెందిన వెంకటేశ్వర్లు ఆ షాపును దక్కించుకున్నారు. 2వ షాపు నెలకు రూ.20 వేలు చొప్పున పలికింది. ఈ షాపును జయచంద్ర అనే వ్యక్తి దక్కించుకున్నాడు. వేలాలు దక్కించుకున్న పాటదారులు వచ్చేనెల 26వ తేదీలోగా ఆరు నెలల అడ్వాన్స్ చెల్లించాలని ఈఓపీఆర్డీ అగస్టీన్ సూచించారు. -
నీటికుంటలో పడి ఇద్దరు బాలికల మృతి
దేవనకొండ (కర్నూలు) : మంచి నీళ్లు తాగేందుకు కుంట దగ్గరకు వెళ్లిన ఇద్దరు బాలికలు కుంటలో పడి మృతిచెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేశ్వరి(7), సుఖి(6) అనే ఇద్దరు చిన్నారులు పొలంలో బావి వద్ద పని చేసుకుంటున్న తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడ సమీపంలో ఉన్న కుంటలో మంచినీళ్లు తాగడానికి లోపలికి దిగారు. ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇది గుర్తించిన వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
అలారుదిన్నెలో.. మధ్యాహ్న భోజనం బంద్
దేవనకొండ: అవగాహన లోపం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని దూరం చేసింది. గ్రామంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి ఘర్షణల తో రెండు రోజులుగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. కొందరు విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక ఇళ్లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సంఘటన మండల పరిధిలోని అలారుదిన్నె ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. గ్రామంలో గత కొన్నేళ్లుగా వెంకటేశ్వర ఏజెన్సీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఆ ఏజెన్సీని రద్దుచేసి ఇతరులకు అప్పగించాలంటూ గతంలో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భోజనాన్ని తామే నిర్వహిస్తామని గ్రామసర్పంచ్ మహేశ్వరమ్మ ముందుకొచ్చారు. దీంతో సర్పంచ్, వెంకటేశ్వర ఏజెన్సీ గ్రూపు మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా గత రెండు రోజులుగా దాదాపు 160 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న తహశీల్దార్ జయప్రభ, ఎంపీడీఓ కృష్ణమోహన్‌శర్మ, ఎంఈఓ యోగానందం, ఐకేపీ ఏపీఎం వీరన్న గురువారం గ్రామంలో విచారణ చేపట్టారు. నాణ్యమైన భోజనాన్ని అందించే ఏజెన్సీలకే బాధ్యతలు అప్పజెబుతామని వారు పేర్కొన్నారు.