దేవనకొండ: అవగాహన లోపం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని దూరం చేసింది. గ్రామంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి ఘర్షణల తో రెండు రోజులుగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. కొందరు విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక ఇళ్లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సంఘటన మండల పరిధిలోని అలారుదిన్నె ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది.
గ్రామంలో గత కొన్నేళ్లుగా వెంకటేశ్వర ఏజెన్సీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఆ ఏజెన్సీని రద్దుచేసి ఇతరులకు అప్పగించాలంటూ గతంలో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భోజనాన్ని తామే నిర్వహిస్తామని గ్రామసర్పంచ్ మహేశ్వరమ్మ ముందుకొచ్చారు. దీంతో సర్పంచ్, వెంకటేశ్వర ఏజెన్సీ గ్రూపు మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఫలితంగా గత రెండు రోజులుగా దాదాపు 160 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న తహశీల్దార్ జయప్రభ, ఎంపీడీఓ కృష్ణమోహన్‌శర్మ, ఎంఈఓ యోగానందం, ఐకేపీ ఏపీఎం వీరన్న గురువారం గ్రామంలో విచారణ చేపట్టారు. నాణ్యమైన భోజనాన్ని అందించే ఏజెన్సీలకే బాధ్యతలు అప్పజెబుతామని వారు పేర్కొన్నారు.
అలారుదిన్నెలో.. మధ్యాహ్న భోజనం బంద్
Published Fri, Jul 18 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM
Advertisement