ఊరిలో ఏముంటాయి? పలకరించే చేలు ఉంటాయి. వసారాల పై కాసిన సొరకాయలుంటాయి. చిన్న సమస్యలకు పెద్ద బెంగలుంటాయి. పెద్ద చిక్కులకు పెక్కు నవ్వులుంటాయి. ఊరిలో ఏముంటాయి. జీవించమని చెప్పే హృదయాలుంటాయి. కసురుతూ అక్కునజేర్చుకునే గుండెలుంటాయి. అమేజాన్ ప్రైమ్‌లో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ అలాంటివన్నీ వెలికి తీసింది. చూసిన ప్రేక్షకులను కట్టి పడేసింది.
ఢిల్లీలో బి.టెక్ చేసి బయటికొచ్చిన అభిషేక్ త్రిపాఠికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. పెద్ద తెలివి తేటలు లేవు. చదువులో గొప్పగా సాధించింది లేదు. కాని కంప్యూటర్ ఉద్యోగం చేయాలంటే ప్రస్తుతానికి కుదిరేలా లేదు. ఈలోపు ఏదో ఒకటి చేయాలి కనుక పంచాయితీ ఆఫీసు ఉద్యోగి పోస్టుకు అప్లై చేస్తే వచ్చింది. ఎక్కడ? ఉత్తర ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఫులేరా అనే చిన్న పల్లెలో. వెళ్లాలా వద్దా... వెళ్లాలా వద్దా... ఇదే మీమాంస. వెళ్లక తప్పని పరిస్థితి. మెయిన్‌రోడ్డు మీద బస్సు వదిలేసిపోతే మట్టి దారిలో బైక్ మీద సరంజామాతో చాలాసేపు ప్రయాణిస్తే తప్ప రాని ఆ పల్లెకు వెళ్లిన అభిషేక్ ఎలాంటి మనుషులను చూశాడు... ఏయే అనుభవాలను మూటగట్టుకున్నాడు అనేదే ‘పంచాయత్’ వెబ్ సిరీస్.
తాళం లేదు
తొలి ఉద్యోగానికి వచ్చిన కుర్రాడు అభిషేక్ ఒక ఖాళీ మైదానంలో గోపీరంగు గోడలతో ఉన్న చిన్న పంచాయతీ ఆఫీసును చూసి నీరసపడతాడు. దానికి తాళం వేసి ఉంటుంది. అతనికి స్వాగతం చెప్పడానికి వచ్చిన ఉప సర్పంచ్, ఆఫీస్ బాయ్ స్వాగతానికి తెచ్చిన నాలుగు మిఠాయిల్లో రెండు తినేసి కూచుని ఉంటారు. తాళం తేవాల్సిన సర్పంచ్ చెంబు పట్టుకొని పొలాల్లోకి వెళ్లాడని, రాగానే తాళం తీస్తామని వాళ్లు చెబుతారు. ‘అదేంటి...ఈ ఊరికి సర్పంచ్ మహిళ కదా’ అంటే ‘అది రిజర్వేషన్ కోసం మాత్రమే. గెలిచాక ఆమె భర్తే మాకు సర్పంచ్’ అని చెబుతారు.
చెంబు పని ముగించుకొని వచ్చిన సర్పంచ్ జేబులో చేయి పెడితే తాళం ఉండదు. ఎక్కడైతే కూచున్నాడో అక్కడే పడేసుకొని ఉండొచ్చని అందరినీ తీసుకొని తాళం వెతకడానికి బయలుదేరిపోతాడు. ఊళ్లో దిగ్గానే ఈ తాళం గొడవ ఏమిటా అని అభిషేక్ వాళ్లతోపాటు పొలాలకు అడ్డం పడతాడు. కాని తాళం దొరకదు. తాళం పగులగొడదామంటాడు అభిషేక్. ‘అలా కుదరదు. అది మా ఆవిడ తన పుట్టింటి నుంచి తెచ్చిన తాళం. దానిని పగలగొడితే నా వీపు పగులుతుంది’ అంటాడు సర్పంచ్. ఆ తర్వాత ఏమైందనేది సరదా కలిగించే ఫస్ట్ ఎపిసోడ్.
చిన్న సమస్యలు– పెద్ద బెంగలు
అభిషేక్‌కు పంచాయితీ ఆఫీసులోనే ఒక గది నివాసానికి ఇస్తారు. అక్కడే ఉద్యోగం. అక్కడే వండుకు తిని పడుకోవడం. చుట్టూ చీమ చిటుక్కమనని ఖాళీ ప్రాంతం. పలకరించే మనిషి ఉండడు. ఢిల్లీలోలాగా ఉదయం తొమ్మిదికి లేస్తే ఆఫీస్ బాయ్ చాలా కంగారుపడిపోయి ‘అదేంటి మధ్యాహ్నం నిద్రలేస్తున్నారు మీరు’ అంటాడు. ఆ టైమ్‌లో లేవడం వారికి వింత. సర్పంచ్ ఊళ్లో పులేగానీ ఇంట్లో పిల్లి. దానికి తోడు రాత్రయితే చాలు కరెంటు పోతుంటుంది. ఈ ఊళ్లో ఒక్క నిమిషం ఉండేది లేదు... క్యాట్ ఎగ్జామ్ రాసి ఇక్కడి నుంచి బయటపడదామనుకుంటాడు అభిషేక్. అందుకోసం ఊరికి శాంక్షన్ అయిన సోలార్ లైట్లలో ఒకటి పంచాయతీ ఆఫీసులో ఏర్పాటు చేసుకుందామనుకుంటాడు. అది ఊరి చివర మర్రిచెట్టు దగ్గర పెట్టడానికి కేటాయించిన లైటు. అది దెయ్యాల మర్రి. అక్కడ పెట్టడం ముఖ్యం అంటాడు సర్పంచ్. లైటు కావాలంటే అక్కణ్ణుంచి దెయ్యాన్ని బయటకు పంపాలంటాడు. అభిషేక్ ఆ దెయ్యం సమస్యను ఎట్లా పరిష్కరించాడనేది రెండో ఎపిసోడ్.
మాట పెళుసు– మనసు మెత్తన
ఊళ్లో చాలామంది మాట పెళుసుగా ఉంటుంది. కాని అవసరం వచ్చినప్పుడు అందరిదీ మెత్తటి మనసే. ఒక రోజు పంచాయతీ ఆఫీసులో కంప్యూటర్ మానిటర్‌ని దొంగలు పట్టుకెళతారు. అది కథానాయకుడి మీద పడుతుంది. కాని సర్పంచ్, ఊరి మనుషులు అతణ్ణి కాపాడుతారు. వార్డు మెంబర్ ఇంట్లో ఒకాయన కుమార్తె పెళ్లి నిశ్చయమవుతుంది. పంచాయతీ వార్డు మెంబర్ ఇంట్లో పెళ్లి అంటే పంచాయతీ ఆఫీసులోని ఉద్యోగులందరూ పని చేయాల్సిన వాళ్లే. అభిషేక్ ఒళ్లు హూనమవుతుంది. ఊళ్లో ఫ్యామిలీ ప్లానింగ్ కోసం గోడల మీద నినాదాలు రాయిస్తాడు అభిషేక్. ‘ఇద్దరు పిల్లలు ముద్దు... మూడోవాడు ఎద్దు’ అనే అర్థంలో ఆ స్లోగన్స్ ఉంటాయి. ఊళ్లో చాలామందికి ముగ్గురు, నలుగురు సంతానం ఉంటారు. వాళ్లంతా తగాదాకు వస్తారు. సర్పంచే మళ్లీ కాపాడతాడు. చాలాసార్లు ఊరి ప్రజల తెలియనితనం అమాయకత్వం సమస్యలు తెస్తాయి. కాని తెలివి మీరి వచ్చే సమస్యల కంటే తెలివి తక్కువగా వచ్చే సమస్యలు సులువుగా ఉంటాయని కథానాయకుడికి అర్థమవుతుంది.
ఊరిలో ప్రేక్షకుడి నివాసం
‘పంచాయత్’ అని పేరు పెడితే పంచాయతీ ఆఫీసు గొడవలు, రాజకీయాలు అనుకుంటాం. కాని ఇదో ఊరి మనుషుల మనోహర కథ. ఎపిసోడ్లు జరుగుతున్నంతసేపు ప్రేక్షకుడు ఆ ఊళ్లోనే ఉన్నట్టుగా భావిస్తాడు. ఎపిసోడ్లు ముగిశాక ఆ ఊళ్లోనే విహరిస్తాడు. నిర్మాత, దర్శక, రచయితలు అలా కథను మలిచారు. గతంలో మాల్గుడి డేస్ ఎపిసోడ్లు ఎలా ఉంటాయో ఈ సిరీస్‌లోని ఎపిసోడ్లు కూడా అలాగే ఉంటాయని చెప్పొచ్చు. అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్‌ను చూసిన వారంతా మెచ్చుకుంటూ ఉన్నారు. దానికి కారణం అత్యంత సహజమైన, నిజమైన మానవీయ ప్రవర్తనలను చూపడమే. అక్కడ అవినీతి అంటే ఎదుటివారికి సొరకాయను లంచం ఇవ్వడమే. సంపాదన అంటే పాలడబ్బులు నిక్కచ్చిగా వసూలు చేయడమే. ఊరి సౌందర్యం ఇప్పుడు ఇలా లేకపోవచ్చు. కాని ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
నిర్మాణం
సుప్రసిద్ధ నటుడు రఘువీర్ యాదవ్ సర్పంచ్ భర్తగా, నటి నీనాగుప్తా సర్పంచ్‌గా నటించారు. వెబ్ సిరీస్ ద్వారా పేరు తెచ్చుకున్న జితేంద్ర కుమార్ హీరోగా నటించాడు. మిగిలినవారంతా కొత్తనటులే. ఈ సిరీస్‌ను భోపాల్ దగ్గర ఉన్న ఒక ఊరిలో షూట్ చేశారు. సంగీతం, ఫొటోగ్రఫీ ఎంత చక్కగా ఉంటాయో చెప్పలేము. మొదటి సీజన్ ముగిసింది. రెండో సీజన్ కోసం జనం ఎదురు చూస్తున్నారంటే ఎంత ఆదరణ పొందిందో ఊహించొచ్చు. అమేజాన్ ప్రైమ్‌లో తప్పక చూడదగ్గ సిరీస్ ఇది.
Comments
Please login to add a commentAdd a comment