గూడెం, తండా.. పంచాయతీలే! | Gudem, tandas also includes in panchayathies says kcr | Sakshi
Sakshi News home page

గూడెం, తండా.. పంచాయతీలే!

Published Tue, Oct 24 2017 2:20 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

Gudem, tandas also includes in panchayathies says kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేలా, గ్రామాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా కొత్త చట్టాన్ని రూపొందించాలని రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. రాజ్యాంగం చెప్పిన విధంగా నిర్ణీత గడువులోగానే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కొత్తగా ఎన్నికైన పంచాయతీలు కొత్త చట్టానికి లోబడి పనిచేసేందుకు వీలుగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. పరిపాలనలో విశేష అనుభవమున్న అధికారులు, న్యాయ కోవి దులతో సంప్రదించి కొత్త చట్టానికి రూపకల్పన చేసే అధికారాన్ని ముఖ్యమంత్రికి అప్పగించింది. గిరిజన తండాలు, కోయ, గోండు గూడేలను, చెంచు పల్లెలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని... ప్రధాన గ్రామానికి దూ రంగా ఉండి పంచాయతీగా లేని పల్లెలను, శివారు గూడేలను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజలకు అత్యుత్తమ సేవలందించేలా మున్సిపాలిటీలను తీర్చిదిద్దడానికి కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కూడా తేవాలని తీర్మానించింది. సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ భేటీ జరిగింది. మధ్యాహ్నం 3.30  నుంచి రాత్రి 11 వరకు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో.. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించారు. ఇటీవల జారీ చేసిన పలు ఆర్డినెన్సులను ఆమోదించారు.

విప్లవాత్మకంగా కొత్త చట్టం
కొత్తగా తెచ్చే పంచాయతీరాజ్‌ చట్టం విప్లవాత్మకంగా ఉంటుందని కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులతో పాటు వారు నిర్వహించే విధుల విషయంలోనూ స్పష్టత ఇచ్చేలా కొత్త చట్టం రూపొందిస్తామన్నారు. విధులను సక్రమంగా నిర్వర్తించని పంచాయతీలపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండేలా నిబంధనలు పొందుపరచాలని సీఎం ప్రతిపాదించగా.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు క్రమంలో ప్రధాన గ్రామానికున్న దూరాన్ని, శివారు పల్లెల జనాభాను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని... కొత్త చట్టం ద్వారా గ్రామాల్లో అద్భుతమైన, గుణాత్మకమైన మార్పు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినప్పడు వ్యవహరించినట్టుగానే.. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఉదారంగానే ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఉద్యోగాల భర్తీకి ఆమోదం
వివిధ శాఖల్లో కొత్త ఉద్యోగాల భర్తీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ నుంచి అందిన దాదాపు పన్నెండు ఉద్యోగ సంబంధిత అంశాలను పరిశీలించింది. గతం లో ప్రభుత్వం అనుమతించిన ఉద్యోగాలకు ఆమోదంతోపాటు కొత్తగా మరికొన్ని పోస్టులకు అనుమతి తెలిపింది. బీబీనగర్‌ నిమ్స్‌కు 800 పోస్టులతోపాటు వైద్య, ఆరోగ్య శాఖలో 850 పోస్టులు, వీటితోపాటు నర్సాపూర్, తిర్మలాయపాలెం, జాఫర్‌ఘడ్, వీపనగండ్ల, మీర్జాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్‌ గ్రేడ్‌ చేస్తూ వాటిలో మరో 300 కొత్త ఉద్యోగాలకు మంత్రివర్గం క్లియరెన్స్‌ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, నీటిపారుదల ప్రాజెక్టు లు, వాటికి అవసరమైన భూసేకరణ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పురోగతితో పాటు అసెంబ్లీలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపైనా ఈ సమావేశంలో చర్చించారు.  ఇటీవల జారీ చేసిన 8 ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టా దారు పాస్‌ పుస్తకాల చట్టం, పీడీ చట్టం, గేమిం గ్‌ చట్టం, వ్యాట్, రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆర్డినెన్స్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు  65 అంశాలను మంత్రివర్గం చర్చించింది.

కాళేశ్వరం మార్పులకు గ్రీన్‌సిగ్నల్‌
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న మార్పుచేర్పులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మార్పుల కారణంగా సవరించిన అంచనాలకు ఓకే చేసింది. దీంతోపాటు కాళేశ్వరం లింక్‌–2 పనుల కోసం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కన్సార్షియం నుంచి రూ.11 వేల కోట్ల రుణం తీసుకుంటూ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల పరిధిలో ముంపు, అటవీ ప్రాం తాల కారణంగా చిన్నపాటి మార్పులు జరిగా యి. దీంతో గతంలో నిర్ణయించిన అంచనాల ను స్వల్పంగా పెంచారు. పాత ప్రాణహిత–చేవెళ్ల డిజైన్‌లో మెదక్, రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన 4 ప్యాకేజీలను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మిషన్‌ భగీరథకు అనుసంధానించి 31 పట్టణ, స్థానిక సంస్థల పరిధిలోని 9,078 గ్రామీణ ఆవాసాలకు 39.43 టీఎంసీల నీటిని అందించే ప్రణాళికకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

రెండు కేబినెట్‌ సబ్‌ కమిటీలు
రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు. వ్యవసాయాధికారులను సమర్థంగా వినియోగించుకోవడం, రైతులకు గిట్టుబాటు ధర రావడం కోసం రైతు సమన్వయ సమితులను వినియోగించుకునే పద్ధతులను అధ్యయనం చేసేందుకు వ్యవసాయ మంత్రి పోచారం నేతృత్వంలో మరో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు.

గ్రామాల అభివృద్ధిపై దృష్టి
కేబినెట్‌ భేటీలో తొలుత శాసనసభ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టాల్సిన బిల్లు లు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ జరిగింది. అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి చివరి వరకు పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, శివా రు పల్లెలకు ప్రత్యేక గ్రామపంచాయతీ హోదా కల్పించడం, గ్రామాలకు నిధులిచ్చి వాటిని అభివృద్ధి చేయడం, గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చడం, వాటికి విధులు నిర్దేశించడం తదితర అంశాలపై మంత్రులు, సీనియర్‌ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

8 ఆర్డినెన్స్‌ బిల్లులకు ఓకే
ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఎనిమిది ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టాదారు పాస్‌ పుస్తకాల చట్టం, పీడీ చట్టం, గేమింగ్‌ చట్టం, వ్యాట్, దుకాణాలు – సముదాయాలు, ఆబ్కారీ చట్టాలకు సవరణ, రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తదితర ఆర్డినెన్స్‌లు ఇందులో ఉన్నాయి. ఇక వీటితో పాటు  65 అంశాలను మంత్రివర్గం చర్చించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement