tandas
-
రైలొస్తేనే బతుక్కి పట్టాభిషేకం
ఆ గ్రామాలు, గిరిజన తండాలన్నీ రైల్వే పట్టాల వెంబడే ఉంటాయి.. అందుకే వారి జీవన ప్రయాణం రైలు పరుగులపై ఆధారపడి ఉంటుంది. విధివంచితులు.. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి.. కుటుంబ భారం మీదపడి పిల్లలను పోషించుకునేందుకు కొందరు.. జీవనోపాధి లేక మరికొందరు.. రైళ్లలో పల్లీ, బఠాణీలు, సీజన్ పండ్లు అమ్ముకొని వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. రైలు బండి నడిస్తేనే.. కుటుంబానికి తిండి దొరుకుతుంది. - సాక్షి, మహబూబాబాద్ రైలులోనే ప్రయాణం మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, గార్ల, గుండ్రాతి మడుగు, మహబూబాబాద్, తాళ్లపూపల్లి, కేసముద్రం స్టేషన్ల పరిధిలోని తండాలతోపాటు, అటు విజయవాడ, ఇటు సికింద్రాబాద్, బల్లార్షా వరకు ఉన్న తండాల్లో మహిళలకు వ్యాపారమే ప్రధానాధారం. పండించిన పల్లీలు, తమ గ్రామాలు, తండాల పరిసరాలలో దొరికే సపోటా, ఈతపండ్లు, తాటిముంజలు, జామకాయలు ఇలా సీజన్ల వారీగా సేకరించి వాటిని విక్రయించి కుటుంబాలను పోషించుకునేందుకు గిరిజన మహిళలు రోజూ రైలులో ప్రయాణిస్తారు. ఇలా రోజూ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వీరి ప్రయాణం రాత్రి 10 గంటల వరకు ఉంటుంది.ఒక్కోరోజు రాత్రి 12 గంటల వరకు సరుకులు అమ్ముకొని ఇంటికి వస్తారు. కొన్ని సందర్భాల్లో రైల్వేస్టేషన్లలో తలదాచుకొని మర్నాడు ఇంటికి చేరిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రోజూ 200 మంది వరకు ఈ వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు.గుర్తింపు కార్డులివ్వాలి.. నా భర్త 14 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి పల్లీలు అమ్ముకుంటూ నాకున్న ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కుమారులను కష్టపడి సాదుకుంటూ వచ్చా. పొట్టకూటి కోసం పల్లీలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైలు బండి నడిస్తేనే తిండి దొరుకుతుంది. పెద్దసార్లు దయ ఉంచి గుర్తింపు కార్డులు ఇస్తే భయం లేకుండా వ్యాపారం చేసుకుంటాం. – బానోతు హచ్చి, బడితండా, కేసముద్రం మండలంబొగ్గు బండి ఉన్నప్పటి నుంచి.. నలభయ్యేళ్లుగా రైలులో పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చా. బొగ్గు బండి ఉన్నప్పటి నుంచి పల్లీలు అమ్మడం మొదలుపెట్టా. పల్లి గ్లాసు.. పైస నుంచి అమ్మిన. రైలులో ఎన్నోమార్లు ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. కోర్టులో జరిమానా కట్టి వచ్చేవాళ్లం. ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్న ప్రతిసారీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. పొట్టకూటికోసం పల్లీలు అమ్ముకుంటూ ఇబ్బందులు పడుతూ వచ్చాం. నాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పల్లీలు అమ్మి అందరి పెళ్లిళ్లు చేసిన. మగ పిల్లలను చదివించిన. – బానోతు చాంది, బడితండా, కేసముద్రంవితంతువులే అధికం మహబూబాబాద్ జిల్లాలో ఏ తండాను కదిలించినా కన్నీళ్లే ఉబుకుతాయి. గుడుంబాకు బానిసలు కావడం, తండాలను కబళించే వింత వ్యాధులతో పాతికేళ్లు నిండక ముందే మృత్యువాత పడిన మగవారు ఎక్కువగా ఉన్నారు. అప్పటికే వివాహాలు చేసుకొని ఇద్దరు, ముగ్గురు పిల్లలతో 20 ఏళ్లు కూడా నిండని భార్యపై పిల్లలు, వృద్ధ అత్తామామల భారం పడుతుంది. ఈ సంసార సాగరాన్ని దాటేందుకు రైళ్లలో వ్యాపారం చేసుకోవడం సాధారణమవుతోంది. ఇలా పల్లీలు, బఠాణీలు, పండ్లు అమ్ముకొని పిల్లలను పెద్ద చదువులు చదివించి ప్రభుత్వ కొలువుల్లో చేరి్పంచిన వారు కొందరైతే.. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి భారం తీర్చుకున్నవారు మరికొందరు ఉన్నారు. అవమానాలు.. ఆప్యాయతలు నిత్యం రైలులో ప్రయాణం చేసుకుంటూ సరుకులు అమ్మే మహిళలకు అవమానాలు.. అ ప్యాయతలు ఎదురవుతుంటాయి. టికెట్ లేదని కేసులు పెట్టి జైలుకు పంపిన రైల్వే అధికారులు ఉన్నారు. మహిళలు కావడంతో ఆకతాయిలు ఇబ్బంది పెట్టడం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపులు కూడా చవిచూడాల్సి వస్తుందని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం రోజూ ప్రయాణం చేసే వారి ఆప్యాయత కూడా ఉంటుందంటున్నారు. దశాబ్దాలుగా రైలునే నమ్ముకొని జీవించే తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. -
75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. రోడ్డుకు నోచుకోని తండాలు
సాక్షి, వికారాబాద్: స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నా గిరిపుత్రులు నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. తండాలు పంచాయతీలుగా మారినా వాటి దుస్థితి మారలేదు. రోడ్డు సౌకర్యంలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ కనీసం అంబులెన్స్‌లు కూడా రాలేని దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. బషీరాబాద్ మండలంలోని ఐదు గిరిజన తండాలకు నేటికీ రవాణా వ్యవస్థ లేకపోవడంతో కాలినడకనే దిక్కవుతోంది. మండలంలోని బోజ్యానాయక్‌తండా, బాబునాయక్ తండా, హంక్యానాయక్ తండా, వాల్యానాయక్‌తండా, పర్శానాయక్, తౌర్యనాయక్తండాలకు రోడ్డు సౌకర్యాలు లేవు. ప్రభుత్వం 2018లో ఎస్టీఎస్డీఎఫ్ (గిరిజన సొసైటీ డెవలప్మెంట్ ఫండ్) కింద రూ.4.28 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీఓ 369 విడుదల చేసింది. అయితే ఆ యేడాదిలో వరుసగా వచ్చిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ పనులకు సంబంధించిన టెండర్లు వాయిదా పడుతూవచ్చాయి. తీరా 2020 మేలో పనులకు టెండర్లు పిలువగా అప్పట్లోనే ఇద్దరు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు చేసుకున్నారు. దీంతో 2020 జూన్ 5న మంత్రి సబితారెడ్డి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. రెండు నెలల్లో రోడ్లువేసి బస్సు సర్వీసులు కూడా నడిపిస్తామని అప్పట్లో మంత్రి గిరిజనులకు హామీ ఇచ్చారు. అయితే వాల్యానాయక్‌తండా రోడ్డు తప్ప నేటికీ మిగతా ఐదు తండాలకు రోడ్డు పనులు ప్రారంభించలేదు. స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు ఒకవైపు జరుపుతుండగా గిరిజన తండాల రోడ్లకు మోక్షం లభించడంలేదని తండావాసులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఈ తండాలకు చెందిన గిరిజనులు బషీరాబాద్‌కు రావాలంటే రెండు మూడు కిలోమీటర్లు నడవాల్సిందే. ప్రాణాలు పోతున్నా పట్టింపులేదు మాసన్పల్లి అనుబంధ గ్రామం తౌర్యనాయక్తండాకు రోడ్డు సౌకర్యంలేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోక ప్రాణాలు కోల్పోయారు. కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు రోడ్డు వేయాలని ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. – భీమప్ప, సర్పంచ్, మాసన్పల్లి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు మండలంలోని బోజ్యానాయక్, బాబునాయక్, హంక్యానాయక్, తౌర్యానాయక్, వాల్యానాయక్తండాలకు రూ.4.28 కోట్ల ఎస్టీఎస్డీఎఫ్ నిధులు మంజూరు అయ్యాయి. ఈ పనులకు 2020లోనే అగ్రిమెంట్లు పూర్తిఅయ్యాయి. వాల్యానాయక్‌తండా పనులు పూర్తి అయ్యాయి. తౌర్యానాయక్తండా రోడ్డులో కల్వర్టు పనులు చేశాం. అయితే నిధులులేమి కారణంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – వంశీ కృష్ణ, ఏఈ, పీఆర్ గిరిజన భావాలకు అక్షరమేదీ? బొంరాస్‌పేట: గిరిజన తెగళ్లోని లంబాడీ, గోండు, ఎరుకల వారికి ఇప్పటికీ లిపి లేకపోయింది. ఈ తెగల వారు మాతృభాషలో మాట్లాడుకోవడం తప్ప అక్షరాలు రాయలేని పరిస్థితి. మాతృభాష ఒకటి, చదువు నేర్చేది మరో భాష కావడంతో తోటి విద్యార్థులతో తగినంత ప్రతిభ కనబర్చలేకపోతున్నారు. వివిధ మండలాల్లో గోండు, నాయకి, పర్జీ, గదవ వంటి మాృభాష కలిగిన వారున్నారు. లంబాడీ, ఎరుకల, బుడగజంగం తెగల వారికి లిపి లేదు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కంటే బొంరాస్‌పేటలో అత్యధికంగా 70కిపైగా గిరిజన తండాలున్నాయి. గిరిజన పిల్లలు మాతృభాషను మాట్లాడుకోవడానికే పరిమితమవుతున్నారు. చదువుకోవడంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై ఆధారపడాల్సి వస్తోంది. గిరిజన విద్యార్థులకు విద్యాబోధనలో ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి గిరిజన తెగల మాతృభాషలకు లిపి కల్పించాలని కోరుతున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ పలువురి అభిప్రాయాలు ఇలా.. లిపి రూపొందించాలి జనాభాలో 25 శాతానికిపైగా గిరిజన తెగల వారు ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారు. లంబాడీ భాషలో మాట్లాడే వారికి తెలుగులో చదవడం ఇబ్బంది ఏర్పడుతోంది. తోటి విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. లంబాడీతోపాటు గిరిజనుల భాషకు లిపి రూపొందించాలి. – విజయలక్షి, గిరిజన ఉపాధ్యాయురాలు తోటివారితో పోటీపడలేక.. మాతృభాష లంబాడీని సునాయాసంగా మాట్లాడుతున్నాం. తెలుగు, ఇతర భాషల్లో అంతగా మాట్లాడలేక పోతున్నాం. లంబాడ యాసలో మాట్లాడితే నవ్వుకుంటున్నారు. చదువులో ఇంకా ఇబ్బందిగా ఉంది. మిగతా విద్యార్థులకు మాతృభాష, చదువుకునే భాష ఒకటేకావడంతో చురుకుగా ఉన్నారు. – శాంతి, గిరిజన విద్యార్థిని, బాపల్లి -
తండాలకు బీటీ తళుకులు
సాక్షి, బాలానగర్: మండలంలోని పలు తండాలకు బీటీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మండలంలోని మేడిగడ్డ, చింతకుంట, చెన్నంగులగడ్డ, నేలబండ తండాలతోపాటు మొదంపల్లి, బోడజానంపేట్ వంటి పలు గ్రామాలకు బీటీ రోడ్డు పనులకు గత సంవత్సరంలో జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మేడిగడ్డ తండాకు రూ.కోటి యాబై లక్షలు, నేలబండ తండా హేమాజిపూర్కు రూ.2 కోట్లు, చింతకుంట తండాకు రూ.2 కోట్లు, చెన్నంగులగడ్డ తండా ఎక్వాయపల్లికి రూ.1.5 కోట్లు, మొదంపల్లి నుంచి పలుగుతండాకు రూ.2 కోట్ల నిధులతో సుమారు పది కిలోమీటర్లమేర బీటీ రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి. తీరనున్న తండావాసుల కష్టాలు.. గతంలో తండా నుంచి మండల కేంద్రానికి, గ్రామ పంచాయతీకి రావాలంటే రోడ్డు సరిగా ఉండేది కాదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎవరైనా గర్భిణులు కాన్సుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేసరికి కాన్పుకావడం, తల్లి లేదా బిడ్డ వైద్య సదుపాయాలు అందక చనిపోవడం జరిగేది. కానీ ప్రస్తుతం తండాలకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న బీటీ రోడ్లతో తండావాసుల కష్టాలు తీరనున్నాయి. తండాలకు మంచిరోజులు స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన తండాలకు ఏనాడు బీటీ రోడ్లు వేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రెండు మూడు సంవత్సరాలలోనే తండాలకు బీటీ రోడ్లు వేయడం గిరిజనులపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనబడుతుంది. –జర్పుల లక్ష్మణ్ నాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తండాలను గ్రామ పంచాయితీలు చేయడం, తండాలకు బీటీ రోడ్లు వేయడం, మంచినీటి కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ప్రతి గ్రామపంచాయతీకి, తండా గ్రామాలకు రోడ్లు వేస్తున్నాం. – ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ -
‘తండాలను పంచాయతీలు చేసినం’
కౌడిపల్లి(నర్సాపూర్): టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే మదన్ర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మడలంలోని రాజిపేట పంచాయతీ జాజితండాను కొత్తగా పంచాయతీగా ఏర్పాటు చేయడంతో సర్పంచ్ మహ్మపాష ఆధ్వర్యంలో తండాలో టీఆర్ఎస్పార్టీ జెండా అవిష్కరణ, పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరుకాగా వెంకట్రావ్‌పేట్ గేట్ నుంచి తండా వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు కొత్త పథకాలను సైతం ప్రవేశపెడుతూ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. తండాలను పంచాయతీలుగా చేస్తామన్న ఎన్నికల హామీ మేరకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పదేళ్లపాటు రిజర్వేషన్ల అమలు ఉండేలా చట్టం తెచ్చిందన్నారు. దీంతో ఎన్నికైన సర్పంచ్‌లు అభివృద్ధికి పాటు పడుతారని తెలిపారు. తండాలలో సర్పంచ్ల కోసం ఎన్నికల్లో పోటిపడటానికి మంచి వ్యక్తులను చూసి ఏకగ్రీవం చేసుకోవాలని కోరారు. సమైఖ్యంగా ఉండి అభివృద్ధి చేసుకునే వీలుంటుందని చెప్పారు. తండాలో టీఆర్ఎస్పార్టీ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్లో చేరిక ః జాజి, జగ్య, జయరాం, రామాలయం తండాలకు చెందిన మాజీ సర్పంచ్ పత్తినాయక్, వార్డుసభ్యులు అంబిబాయ్, అంబుర్యనాయక్, మాజీ వార్డు సభ్యులు వాల్య, రాములు నాయక్‌తోపాటు లక్ష్మన్, కిషన్, హీర్య, రెడ్య, విఠల్, హర్య, కాశ్య, గోపాల్, జీవుల, రాజు, వాల్య, గోప్య, గేమ్య తదితర వంద మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సార రామాగౌడ్, సర్పంచ్ ఎండీ పాష, నాయకులు లింగంగౌడ్, గణేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గూడెం, తండా.. పంచాయతీలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేలా, గ్రామాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా కొత్త చట్టాన్ని రూపొందించాలని రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. రాజ్యాంగం చెప్పిన విధంగా నిర్ణీత గడువులోగానే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కొత్తగా ఎన్నికైన పంచాయతీలు కొత్త చట్టానికి లోబడి పనిచేసేందుకు వీలుగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. పరిపాలనలో విశేష అనుభవమున్న అధికారులు, న్యాయ కోవి దులతో సంప్రదించి కొత్త చట్టానికి రూపకల్పన చేసే అధికారాన్ని ముఖ్యమంత్రికి అప్పగించింది. గిరిజన తండాలు, కోయ, గోండు గూడేలను, చెంచు పల్లెలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని... ప్రధాన గ్రామానికి దూ రంగా ఉండి పంచాయతీగా లేని పల్లెలను, శివారు గూడేలను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజలకు అత్యుత్తమ సేవలందించేలా మున్సిపాలిటీలను తీర్చిదిద్దడానికి కొత్త మున్సిపల్ చట్టాన్ని కూడా తేవాలని తీర్మానించింది. సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ భేటీ జరిగింది. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 11 వరకు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో.. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించారు. ఇటీవల జారీ చేసిన పలు ఆర్డినెన్సులను ఆమోదించారు. విప్లవాత్మకంగా కొత్త చట్టం కొత్తగా తెచ్చే పంచాయతీరాజ్ చట్టం విప్లవాత్మకంగా ఉంటుందని కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులతో పాటు వారు నిర్వహించే విధుల విషయంలోనూ స్పష్టత ఇచ్చేలా కొత్త చట్టం రూపొందిస్తామన్నారు. విధులను సక్రమంగా నిర్వర్తించని పంచాయతీలపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండేలా నిబంధనలు పొందుపరచాలని సీఎం ప్రతిపాదించగా.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు క్రమంలో ప్రధాన గ్రామానికున్న దూరాన్ని, శివారు పల్లెల జనాభాను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని... కొత్త చట్టం ద్వారా గ్రామాల్లో అద్భుతమైన, గుణాత్మకమైన మార్పు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినప్పడు వ్యవహరించినట్టుగానే.. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఉదారంగానే ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి ఆమోదం వివిధ శాఖల్లో కొత్త ఉద్యోగాల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ నుంచి అందిన దాదాపు పన్నెండు ఉద్యోగ సంబంధిత అంశాలను పరిశీలించింది. గతం లో ప్రభుత్వం అనుమతించిన ఉద్యోగాలకు ఆమోదంతోపాటు కొత్తగా మరికొన్ని పోస్టులకు అనుమతి తెలిపింది. బీబీనగర్ నిమ్స్‌కు 800 పోస్టులతోపాటు వైద్య, ఆరోగ్య శాఖలో 850 పోస్టులు, వీటితోపాటు నర్సాపూర్, తిర్మలాయపాలెం, జాఫర్ఘడ్, వీపనగండ్ల, మీర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్ గ్రేడ్ చేస్తూ వాటిలో మరో 300 కొత్త ఉద్యోగాలకు మంత్రివర్గం క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, నీటిపారుదల ప్రాజెక్టు లు, వాటికి అవసరమైన భూసేకరణ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పురోగతితో పాటు అసెంబ్లీలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఇటీవల జారీ చేసిన 8 ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టా దారు పాస్ పుస్తకాల చట్టం, పీడీ చట్టం, గేమిం గ్ చట్టం, వ్యాట్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్డినెన్స్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు 65 అంశాలను మంత్రివర్గం చర్చించింది. కాళేశ్వరం మార్పులకు గ్రీన్‌సిగ్నల్ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న మార్పుచేర్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్పుల కారణంగా సవరించిన అంచనాలకు ఓకే చేసింది. దీంతోపాటు కాళేశ్వరం లింక్–2 పనుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్షియం నుంచి రూ.11 వేల కోట్ల రుణం తీసుకుంటూ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల పరిధిలో ముంపు, అటవీ ప్రాం తాల కారణంగా చిన్నపాటి మార్పులు జరిగా యి. దీంతో గతంలో నిర్ణయించిన అంచనాల ను స్వల్పంగా పెంచారు. పాత ప్రాణహిత–చేవెళ్ల డిజైన్‌లో మెదక్, రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన 4 ప్యాకేజీలను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మిషన్ భగీరథకు అనుసంధానించి 31 పట్టణ, స్థానిక సంస్థల పరిధిలోని 9,078 గ్రామీణ ఆవాసాలకు 39.43 టీఎంసీల నీటిని అందించే ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు కేబినెట్ సబ్ కమిటీలు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. వ్యవసాయాధికారులను సమర్థంగా వినియోగించుకోవడం, రైతులకు గిట్టుబాటు ధర రావడం కోసం రైతు సమన్వయ సమితులను వినియోగించుకునే పద్ధతులను అధ్యయనం చేసేందుకు వ్యవసాయ మంత్రి పోచారం నేతృత్వంలో మరో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. గ్రామాల అభివృద్ధిపై దృష్టి కేబినెట్ భేటీలో తొలుత శాసనసభ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టాల్సిన బిల్లు లు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ జరిగింది. అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి చివరి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త పంచాయతీరాజ్ చట్టం, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, శివా రు పల్లెలకు ప్రత్యేక గ్రామపంచాయతీ హోదా కల్పించడం, గ్రామాలకు నిధులిచ్చి వాటిని అభివృద్ధి చేయడం, గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చడం, వాటికి విధులు నిర్దేశించడం తదితర అంశాలపై మంత్రులు, సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. 8 ఆర్డినెన్స్ బిల్లులకు ఓకే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఎనిమిది ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం, పీడీ చట్టం, గేమింగ్ చట్టం, వ్యాట్, దుకాణాలు – సముదాయాలు, ఆబ్కారీ చట్టాలకు సవరణ, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తదితర ఆర్డినెన్స్‌లు ఇందులో ఉన్నాయి. ఇక వీటితో పాటు 65 అంశాలను మంత్రివర్గం చర్చించింది. -
గ్రామపంచాయతీలుగా మారనున్న తండాలు
ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం సాక్షి, హైదరాబాద్: తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో సమీక్షించారు. 14 వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేంద్రం నుంచి అందాల్సిన రూ.900 కోట్ల నిధులను పొందేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ డైరెక్టర్ నీతూ కు మారి ప్రసాద్‌కు సూచిం చారు. ఉపాధిహామీ, పంచాయతీపనుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు కొత్త సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రూర్బన్ మిషన్ రెండో విడత ప్రతిపాదనలపై ఆయన ఆరాతీశారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి, జాయింట్ కమిషనర్లు బి.సైదులు, ఎస్జే ఆషా పాల్గొన్నారు.