రైలు పట్టాల వెంబడే గిరిజన తండాలు
రైళ్లలో పల్లీ, బఠాణీలు, సీజన్ పండ్ల అమ్మకంతోనే ఉపాధి
మానుకోటలో దశాబ్దాలుగా ఇదే జీవనం
వీరిలో సగానికిపైగా గిరిజన వితంతువులే..
ఆ గ్రామాలు, గిరిజన తండాలన్నీ రైల్వే పట్టాల వెంబడే ఉంటాయి.. అందుకే వారి జీవన ప్రయాణం రైలు పరుగులపై ఆధారపడి ఉంటుంది. విధివంచితులు.. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి.. కుటుంబ భారం మీదపడి పిల్లలను పోషించుకునేందుకు కొందరు.. జీవనోపాధి లేక మరికొందరు.. రైళ్లలో పల్లీ, బఠాణీలు, సీజన్ పండ్లు అమ్ముకొని వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. రైలు బండి నడిస్తేనే.. కుటుంబానికి తిండి దొరుకుతుంది. - సాక్షి, మహబూబాబాద్
రైలులోనే ప్రయాణం
మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, గార్ల, గుండ్రాతి మడుగు, మహబూబాబాద్, తాళ్లపూపల్లి, కేసముద్రం స్టేషన్ల పరిధిలోని తండాలతోపాటు, అటు విజయవాడ, ఇటు సికింద్రాబాద్, బల్లార్షా వరకు ఉన్న తండాల్లో మహిళలకు వ్యాపారమే ప్రధానాధారం.
పండించిన పల్లీలు, తమ గ్రామాలు, తండాల పరిసరాలలో దొరికే సపోటా, ఈతపండ్లు, తాటిముంజలు, జామకాయలు ఇలా సీజన్ల వారీగా సేకరించి వాటిని విక్రయించి కుటుంబాలను పోషించుకునేందుకు గిరిజన మహిళలు రోజూ రైలులో ప్రయాణిస్తారు. ఇలా రోజూ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వీరి ప్రయాణం రాత్రి 10 గంటల వరకు ఉంటుంది.
ఒక్కోరోజు రాత్రి 12 గంటల వరకు సరుకులు అమ్ముకొని ఇంటికి వస్తారు. కొన్ని సందర్భాల్లో రైల్వేస్టేషన్లలో తలదాచుకొని మర్నాడు ఇంటికి చేరిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రోజూ 200 మంది వరకు ఈ వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు.
గుర్తింపు కార్డులివ్వాలి..
నా భర్త 14 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి పల్లీలు అమ్ముకుంటూ నాకున్న ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కుమారులను కష్టపడి సాదుకుంటూ వచ్చా. పొట్టకూటి కోసం పల్లీలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైలు బండి నడిస్తేనే తిండి దొరుకుతుంది. పెద్దసార్లు దయ ఉంచి గుర్తింపు కార్డులు ఇస్తే భయం లేకుండా వ్యాపారం చేసుకుంటాం. – బానోతు హచ్చి, బడితండా, కేసముద్రం మండలం
బొగ్గు బండి ఉన్నప్పటి నుంచి..
నలభయ్యేళ్లుగా రైలులో పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చా. బొగ్గు బండి ఉన్నప్పటి నుంచి పల్లీలు అమ్మడం మొదలుపెట్టా. పల్లి గ్లాసు.. పైస నుంచి అమ్మిన. రైలులో ఎన్నోమార్లు ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. కోర్టులో జరిమానా కట్టి వచ్చేవాళ్లం.
ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్న ప్రతిసారీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. పొట్టకూటికోసం పల్లీలు అమ్ముకుంటూ ఇబ్బందులు పడుతూ వచ్చాం. నాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పల్లీలు అమ్మి అందరి పెళ్లిళ్లు చేసిన. మగ పిల్లలను చదివించిన. – బానోతు చాంది, బడితండా, కేసముద్రం
వితంతువులే అధికం
మహబూబాబాద్ జిల్లాలో ఏ తండాను కదిలించినా కన్నీళ్లే ఉబుకుతాయి. గుడుంబాకు బానిసలు కావడం, తండాలను కబళించే వింత వ్యాధులతో పాతికేళ్లు నిండక ముందే మృత్యువాత పడిన మగవారు ఎక్కువగా ఉన్నారు. అప్పటికే వివాహాలు చేసుకొని ఇద్దరు, ముగ్గురు పిల్లలతో 20 ఏళ్లు కూడా నిండని భార్యపై పిల్లలు, వృద్ధ అత్తామామల భారం పడుతుంది.
ఈ సంసార సాగరాన్ని దాటేందుకు రైళ్లలో వ్యాపారం చేసుకోవడం సాధారణమవుతోంది. ఇలా పల్లీలు, బఠాణీలు, పండ్లు అమ్ముకొని పిల్లలను పెద్ద చదువులు చదివించి ప్రభుత్వ కొలువుల్లో చేరి్పంచిన వారు కొందరైతే.. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి భారం తీర్చుకున్నవారు మరికొందరు ఉన్నారు.
అవమానాలు.. ఆప్యాయతలు
నిత్యం రైలులో ప్రయాణం చేసుకుంటూ సరుకులు అమ్మే మహిళలకు అవమానాలు.. అ ప్యాయతలు ఎదురవుతుంటాయి. టికెట్ లేదని కేసులు పెట్టి జైలుకు పంపిన రైల్వే అధికారులు ఉన్నారు. మహిళలు కావడంతో ఆకతాయిలు ఇబ్బంది పెట్టడం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపులు కూడా చవిచూడాల్సి వస్తుందని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం రోజూ ప్రయాణం చేసే వారి ఆప్యాయత కూడా ఉంటుందంటున్నారు. దశాబ్దాలుగా రైలునే నమ్ముకొని జీవించే తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment