సాక్షి, వికారాబాద్: స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నా గిరిపుత్రులు నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. తండాలు పంచాయతీలుగా మారినా వాటి దుస్థితి మారలేదు. రోడ్డు సౌకర్యంలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ కనీసం అంబులెన్స్‌లు కూడా రాలేని దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. బషీరాబాద్ మండలంలోని ఐదు గిరిజన తండాలకు నేటికీ రవాణా వ్యవస్థ లేకపోవడంతో కాలినడకనే దిక్కవుతోంది.
మండలంలోని బోజ్యానాయక్‌తండా, బాబునాయక్ తండా, హంక్యానాయక్ తండా, వాల్యానాయక్‌తండా, పర్శానాయక్, తౌర్యనాయక్‌తండాలకు రోడ్డు సౌకర్యాలు లేవు. ప్రభుత్వం 2018లో ఎస్టీఎస్‌డీఎఫ్ (గిరిజన సొసైటీ డెవలప్‌మెంట్ ఫండ్) కింద రూ.4.28 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీఓ 369 విడుదల చేసింది. అయితే ఆ యేడాదిలో వరుసగా వచ్చిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ పనులకు సంబంధించిన టెండర్లు వాయిదా పడుతూవచ్చాయి. తీరా 2020 మేలో పనులకు టెండర్లు పిలువగా అప్పట్లోనే ఇద్దరు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు చేసుకున్నారు.
దీంతో 2020 జూన్ 5న మంత్రి సబితారెడ్డి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. రెండు నెలల్లో రోడ్లువేసి బస్సు సర్వీసులు కూడా నడిపిస్తామని అప్పట్లో మంత్రి గిరిజనులకు హామీ ఇచ్చారు. అయితే వాల్యానాయక్‌తండా రోడ్డు తప్ప నేటికీ మిగతా ఐదు తండాలకు రోడ్డు పనులు ప్రారంభించలేదు. స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు ఒకవైపు జరుపుతుండగా గిరిజన తండాల రోడ్లకు మోక్షం లభించడంలేదని తండావాసులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఈ తండాలకు చెందిన గిరిజనులు బషీరాబాద్‌కు రావాలంటే రెండు మూడు కిలోమీటర్లు నడవాల్సిందే.
ప్రాణాలు పోతున్నా పట్టింపులేదు
మాసన్‌పల్లి అనుబంధ గ్రామం తౌర్యనాయక్‌తండాకు రోడ్డు సౌకర్యంలేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోక ప్రాణాలు కోల్పోయారు. కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు రోడ్డు వేయాలని ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు.
– భీమప్ప, సర్పంచ్, మాసన్‌పల్లి
కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు
మండలంలోని బోజ్యానాయక్, బాబునాయక్, హంక్యానాయక్, తౌర్యానాయక్, వాల్యానాయక్‌తండాలకు రూ.4.28 కోట్ల ఎస్టీఎస్‌డీఎఫ్ నిధులు మంజూరు అయ్యాయి. ఈ పనులకు 2020లోనే అగ్రిమెంట్లు పూర్తిఅయ్యాయి. వాల్యానాయక్‌తండా పనులు పూర్తి అయ్యాయి. తౌర్యానాయక్‌తండా రోడ్డులో కల్వర్టు పనులు చేశాం. అయితే నిధులులేమి కారణంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– వంశీ కృష్ణ, ఏఈ, పీఆర్
గిరిజన భావాలకు అక్షరమేదీ?
బొంరాస్‌పేట: గిరిజన తెగళ్లోని లంబాడీ, గోండు, ఎరుకల వారికి ఇప్పటికీ లిపి లేకపోయింది. ఈ తెగల వారు మాతృభాషలో మాట్లాడుకోవడం తప్ప అక్షరాలు రాయలేని పరిస్థితి. మాతృభాష ఒకటి, చదువు నేర్చేది మరో భాష కావడంతో తోటి విద్యార్థులతో తగినంత ప్రతిభ కనబర్చలేకపోతున్నారు. వివిధ మండలాల్లో గోండు, నాయకి, పర్జీ, గదవ వంటి మాృభాష కలిగిన వారున్నారు. లంబాడీ, ఎరుకల, బుడగజంగం తెగల వారికి లిపి లేదు.
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కంటే బొంరాస్‌పేటలో అత్యధికంగా 70కిపైగా గిరిజన తండాలున్నాయి. గిరిజన పిల్లలు మాతృభాషను మాట్లాడుకోవడానికే పరిమితమవుతున్నారు. చదువుకోవడంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై ఆధారపడాల్సి వస్తోంది. గిరిజన విద్యార్థులకు విద్యాబోధనలో ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి గిరిజన తెగల మాతృభాషలకు లిపి కల్పించాలని కోరుతున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ పలువురి అభిప్రాయాలు ఇలా..
లిపి రూపొందించాలి
జనాభాలో 25 శాతానికిపైగా గిరిజన తెగల వారు ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారు. లంబాడీ భాషలో మాట్లాడే వారికి తెలుగులో చదవడం ఇబ్బంది ఏర్పడుతోంది. తోటి విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. లంబాడీతోపాటు గిరిజనుల భాషకు లిపి రూపొందించాలి.
– విజయలక్షి, గిరిజన ఉపాధ్యాయురాలు
తోటివారితో పోటీపడలేక..
మాతృభాష లంబాడీని సునాయాసంగా మాట్లాడుతున్నాం. తెలుగు, ఇతర భాషల్లో అంతగా మాట్లాడలేక పోతున్నాం. లంబాడ యాసలో మాట్లాడితే నవ్వుకుంటున్నారు. చదువులో ఇంకా ఇబ్బందిగా ఉంది. మిగతా విద్యార్థులకు మాతృభాష, చదువుకునే భాష ఒకటేకావడంతో చురుకుగా ఉన్నారు.
– శాంతి, గిరిజన విద్యార్థిని, బాపల్లి
Comments
Please login to add a commentAdd a comment