సిద్దిపేటలో విలీనమైన 6 గ్రామ పంచాయతీలకు సైతం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన దుబ్బాక, బాదెపల్లి(జడ్చర్ల) నగర పంచాయతీలతో పాటు సిద్దిపేట మునిసిపాలిటీలో విలీనమైన 6గ్రామపంచాయతీల్లో వచ్చే అక్టోబర్ 1 నుంచి ఆస్తి పన్నుల మోత మోగనుంది. ఈమేరకు ఆస్తి పన్ను ల సవరణకు ప్రత్యేక ఆదేశాలిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆస్తి పన్నుల పెంపు అమల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక మునిసిపల్ కమిషనర్లకు సర్క్యులర్ జారీ అయింది.
దీని ప్రకారం ఈ నెల 10వ తేదీలోపు ఆయా నగర పంచాయతీ/మునిసిపాలిటీ పాలకవర్గాలు.. భవనాలు, స్థలాలపై విధించే ఆస్తి పన్నుల సవరణకు అనుమతిస్తూ తీర్మానం చేయాలి. ఆస్తి పన్నుల పెంపుపై తీసుకున్న నిర్ణయాన్ని ఈ నెల 15లోపు ప్రకటించి వచ్చే నెల 10వ తేదీలోపు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాలి. అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ఆస్తి పన్నుల సవరణకు అనుమతిస్తూ వచ్చే నెల 30వ తేదీలోపు కౌన్సిల్‌లో మళ్లీ తీర్మానం చేస్తారు.
అనంతరం పన్నుల సవరణ ప్రక్రియకు శ్రీకారం చుడతారు. వార్షిక అద్దె విలువలో 25 శాతానికి మించకుండా నివాస భవనాలపై, 35 శాతానికి మించకుండా నివాసేతర భవనాలపై ఆస్తి పన్నులను విధిస్తారు. అదేవిధంగా ఖాళీ స్థలాలపై మార్కెట్ విలువలో 0.20 శాతాన్ని ఆస్తి పన్నుగా విధిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటింటా సర్వే జరిపి శాస్త్రీయ పద్ధతుల్లో తీసుకున్న కొలతల ఆధారంగా ఆస్తి పన్నుల డిమాండ్ నోటీసులను ప్రజలకు అందజేస్తారు.