badepalli
-
బాదేపల్లి కాదు.. జడ్చర్ల
జడ్చర్ల టౌన్: బాదేపల్లి మున్సిపాలిటీని జడ్చర్ల మున్సిపాలిటీగా మారుస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మున్సిపాలిటీ కమిషనర్ సునీత గురువారం విలేకరులకు తెలియజేశారు. బాదేపల్లి మున్సిపాలిటీలో జడ్చర్ల మేజర్ గ్రామపంచాయతీ, బూరెడ్డిపల్లి, నాగసాల గ్రామపంచాయతీలను విలీనం చేసిన విషయం తెలిసిందే. జనవరిలో బూరెడ్డిపల్లి, నాగసాల గ్రామాలు బాదేపల్లిలో విలీనం కాగా జడ్చర్ల మేజర్‌గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు మరో 2021 డిసెంబర్ వరకు ఉండటంతో విలీనం నిలిచిపోయింది. ఈ కారణంగా ఇప్పటి వరకు మున్సిపాలిటీ పేరు బాదేపల్లి పేరునే కొనసాగుతూ వచ్చింది. ప్రజల్లో సందేహాలు ఉండటంతో బాదేపల్లి మున్సిపాలిటీ పేరును జడ్చర్లగా మార్చాలని ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి పేరు మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019 ప్రకారం పేరును మార్చారు. ఇకపై జడ్చర్ల మున్సిపాలిటీగా కొనసాగనుంది. బ్యాంకు లావాదేవీలతోపాటు అన్ని వ్యవహారాల్లోనూ పేరు మార్పుచేసుకోవాలని కమిషనర్‌కు ఉత్తర్వులో సూచించారు. 2012నుంచి దోబూచులాట.. మున్సిపాలిటీ విషయంలో 2012నుంచి దోబూచులాట కొనసాగుతూనే ఉంది. 2012 జనవరిలో బాదేపల్లి, జడ్చర్ల మేజర్గ్రామపంచాయతీలను జడ్చర్ల మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే జడ్చర్ల గ్రామపంచాయతీకి చెందిన కొందరు కోర్టును ఆశ్రయించగా జడ్చర్లను గ్రామపంచాయతీగా కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత బాదేపల్లిని సైతం గ్రామపంచాయతీగా మార్చారు. 2014 జూన్‌లో తిరిగి బాదేపల్లిని మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇదే క్రమంలో 2016 డిసెంబర్లో జడ్చర్ల గ్రామపంచాయతీకి ఎన్నికలు జరగగా బాదేపల్లి మున్సిపాలిటీ కొనసాగుతూ వచ్చింది. గతేడాది మేలో నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం సమీప గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయగా బాదేపల్లి మున్సిపాలిటీలో జడ్చర్ల, బూరెడ్డిపల్లి, నాగసాలలను కలిపారు. అయినప్పటికి బాదేపల్లి పేరు కొనసాగింది. జడ్చర్ల విలీనానికి మరో ఏడాది గడువు ఉండగానే బాదేపల్లి పేరు మారుస్తూ ఉత్తర్వులు రావడం గమనార్హం. మార్పు చేస్తున్నాం బాదేపల్లి మున్సిపాలిటీని జడ్చర్లగా మారుస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు బాదేపల్లిని జడ్చర్లగా మార్పు చేస్తున్నాం. రికార్డులతో పాటు కార్యాలయ బోర్డులు అన్నీ శుక్రవారం నుంచి జడ్చర్లగానే వ్యవహరించబడతాయి. – సునీత, కమిషనర్, మున్సిపాలిటీ -
సీఎన్ఆర్ ఆధ్వర్యంలో గుండె పరీక్ష శిబిరం
జడ్చర్ల టౌన్ : సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టార్ హస్పిటల్స్ సహకారంతో హృదయ ఫౌండేషన్ ఆదివారం బాదేపల్లి జెడ్పీ హైస్కూల్లో చిన్నపిల్లల ఉచిత గుండె పరీక్ష శిబిరం నిర్వహించారు. శిబిరంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు నితిన్‌కుమార్, సుమన్ 150మంది చిన్నపిల్లలకు గుండె పరీక్షలు నిర్వహించారు. వారిలో 13మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. శిబిరంలో హృదయ ఫౌండేషన్ మేనేజర్ ట్రస్టీ మేక యుగంధర్, ఫౌండర్ ట్రస్టీ పద్మశ్రీ గోపిచంద్, డాక్టర్ జయరాజ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగారం, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ మల్లికార్జునప్ప, పిల్లల వైద్య నిపుణులు రమేష్‌బాబు, రవి, రమేష్‌చారి, నరేందర్, రాఘవేందర్, ఎంపీపీ లక్ష్మీశంకర్, జెడ్పీటీసీ జయప్రద, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్, డీఎస్పీ కృష్ణమూర్తి, ఎస్ఎస్ఓ చందునాయక్, పీఎసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కోడ్గల్‌యాదయ్య, మహ్మద్‌యూసూఫ్, శ్రీకాంత్, శంకర్‌నాయక్, తోటారెడ్డి, ఉమాశంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
దుబ్బాక, బాదెపల్లిలకు ‘పన్ను’ పోటు
సిద్దిపేటలో విలీనమైన 6 గ్రామ పంచాయతీలకు సైతం సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన దుబ్బాక, బాదెపల్లి(జడ్చర్ల) నగర పంచాయతీలతో పాటు సిద్దిపేట మునిసిపాలిటీలో విలీనమైన 6గ్రామపంచాయతీల్లో వచ్చే అక్టోబర్ 1 నుంచి ఆస్తి పన్నుల మోత మోగనుంది. ఈమేరకు ఆస్తి పన్ను ల సవరణకు ప్రత్యేక ఆదేశాలిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆస్తి పన్నుల పెంపు అమల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక మునిసిపల్ కమిషనర్లకు సర్క్యులర్ జారీ అయింది. దీని ప్రకారం ఈ నెల 10వ తేదీలోపు ఆయా నగర పంచాయతీ/మునిసిపాలిటీ పాలకవర్గాలు.. భవనాలు, స్థలాలపై విధించే ఆస్తి పన్నుల సవరణకు అనుమతిస్తూ తీర్మానం చేయాలి. ఆస్తి పన్నుల పెంపుపై తీసుకున్న నిర్ణయాన్ని ఈ నెల 15లోపు ప్రకటించి వచ్చే నెల 10వ తేదీలోపు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాలి. అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ఆస్తి పన్నుల సవరణకు అనుమతిస్తూ వచ్చే నెల 30వ తేదీలోపు కౌన్సిల్లో మళ్లీ తీర్మానం చేస్తారు. అనంతరం పన్నుల సవరణ ప్రక్రియకు శ్రీకారం చుడతారు. వార్షిక అద్దె విలువలో 25 శాతానికి మించకుండా నివాస భవనాలపై, 35 శాతానికి మించకుండా నివాసేతర భవనాలపై ఆస్తి పన్నులను విధిస్తారు. అదేవిధంగా ఖాళీ స్థలాలపై మార్కెట్ విలువలో 0.20 శాతాన్ని ఆస్తి పన్నుగా విధిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటింటా సర్వే జరిపి శాస్త్రీయ పద్ధతుల్లో తీసుకున్న కొలతల ఆధారంగా ఆస్తి పన్నుల డిమాండ్ నోటీసులను ప్రజలకు అందజేస్తారు. -
మురిపించారు.. మూసేశారు
జడ్చర్ల, న్యూస్‌లైన్: బాదేపల్లి మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్ల తీరు మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొనుగోళ్లు ప్రారంభించి ఆశించిన ధరలు కల్పిస్తామని రైతులను మురి పించిన అధికారులు, పాలకవర్గం ఆ తరువాత కొనుగోలు కేం ద్రాన్ని మూసివేసి నిరాశపరిచారు. సోమవారం మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు నిలిచిపోవడంతో స్థానిక మార్కెట్లో మొక్కజొన్న క్రయవి క్రయాలు స్తంభించిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదాముల కొరత కారణంగానే కొనుగోళ్లు నిలిచిపోయాయని బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్ రాంచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. గోదాముల సౌకర్యం కల్పించకపోతే సోమవారం యా ర్డులో మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉందని సో మవారం ‘సాక్షి’లో ‘మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం అందని ద్రా క్ష’ అనే కథనంతో ముందే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి గోదాముల సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యం వహించడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటికే దాదాపు 20వేల బస్తాల మొక్కజొన్నను కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ గోదాముల కొరత కారణంగా వాటిని యార్డులోనే నిల్వచేశారు. బాదేపల్లి యార్డులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని గద్వాలలోని గోదాములకు తరలించామని, అయితే అక్కడ గోదాములు నిండిపోవడంతో ఇతర గోదాములను తమకు కేటాయించకపోవడంతోనే ధాన్యం తరలింపు నిలిచిపోయిందని సింగిల్‌విండో చైర్మన్ తెలిపారు. కాగా, కొనుగోళ్లు నిలిచిపోవడం, ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో మార్కెట్ చైర్మన్ రమేశ్‌రెడ్డి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై దృష్టి సారించారు. సమస్యను కలెక్టర్, తదితర మార్కెటింగ్ శాఖ ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. తక్కువ ధరలకు రైతులు అమ్ముకోవద్దంటూ మైక్‌లో ప్రకటించారు. ధాన్యాన్ని తూకం వేసి యార్డులో నిల్వచేయాలని పేర్కొన్నారు. ఇందులో పొరపాట్లు జరిగితే కమీషన్ ఏజెంట్లను బాధ్యులు చేస్తామని హెచ్చరించారు. సింగివిండో చైర్మన్ రమేశ్‌రెడ్డి, యార్డు వైస్‌చైర్మన్ మాలిక్‌షాకీర్, యార్డు సెక్రటరీ అనంతయ్య, తదితరులతో సమావేశమై చర్చించారు. పతనమైన ధరలు అయితే స్థానిక మార్కెట్‌యార్డులో వ్యాపారులు ఒక్కసారిగా మొక్కజొన్న ధరలను తగ్గించేశారు. క్వింటాలుకు దాదాపు రూ.100 నుంచి రూ.200 వరకు తగ్గించారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలోపడ్డారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తున్న తరుణంలో వ్యాపారులు మార్క్‌ఫెడ్‌తో పోటీపడుతూ ధరలను అటుఇటుగా వేసేవారు. అయితే మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు నిలిచిపోవడంతో వ్యాపారులు తమకు ఇష్టమొచ్చినట్లు ధరలు వేశారని రైతులు పెదవివిరిచారు. సోమవారం 22 వేల బస్తాల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. వ్యాపారులు క్వింటాలుకు రూ.1000 నుంచి రూ.1100లోపు వేశారు. అక్కడక్కడ కొన్ని రాసులకు గరిష్టంగా రూ.1232 వరక వేశారు. నేడు కొనుగోళ్లు అనుమానమే? మంగళవారం కూడా బాదేపల్లి మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ కొనుగోళ్లపై సందేహం నెలకొంది. ఇప్పటికే మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన 20వేల బస్తాలు యార్డులోనే ఉన్నాయి. వీటికితోడు సోమవారం మరో 22వేల బస్తాలు వచ్చాయి. మళ్లీ మంగళవారం మరో 20వేల బస్తాలు వచ్చే అవకాశం ఉండటంతో మార్కెట్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. అంతేగాక తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పేరుకుపోయిన ధాన్యం పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి మార్కెట్లో మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు సజావుగా సాగేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.