ఉప ఎన్నికల వేడి
Published Wed, Oct 19 2016 11:45 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
–నేడు పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన
– రెండు జెడ్పీటీసీ, 18 సర్పంచ్ పదవులు, 22 ఎంపీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నిక
– 129 వార్డు పదవులకూ ఉప సమరం
కొవ్వూరు :
స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ప్రజాప్రతినిధుల ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక ఎన్నికల కమిషన్ ఏర్పాటులో జాప్యం కారణంగా వీటికి ఉప ఎన్నికలు మరుగునపడ్డాయి. దాదాపు మూడేళ్ల నాలుగు నెలల అనంతరం ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సమాయత్తం అవుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఐదేళ్ల పదవీ కాలంలో ముగిసిన రోజులు మిన హాయిస్తే సుమారు ఏడాదిన్నర మాత్రమే పదవిలో ఉంటారు. పదవీ కాలం తక్కువే అయినా ఉప ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 18 సర్పంచ్, 22 ఎంపీటీసీ, రెండు జెడ్పీటీసీ స్థానాలతోపాటు 129 పంచాయతీ వార్డు మెంబర్ పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితోపాటు కొవ్వూరు, తణుకు మునిసిపాలిటీల్లో ఒక్కొక్క కౌన్సిలర్ ఉప ఎన్నిక నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ నుంచి జిల్లాలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల జెడ్పీటీసీ సభ్యులతోపాటు కుక్కునూరులో ఎనిమిది, వేలేరుపాడులో ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో విలీనమైన రెండు మండలాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పాలనాపరంగా రెండు మండలాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వపరంగా అందే రాయితీలకు సైతం ఇక్కడి ప్రజలు దూరమవుతున్నారు. మొత్తంగా ఈ ఉప ఎన్నికల్లో అన్నీ పదవులు కలిపి 171 పదవులకు ఉప సమరం జరగనుంది.
టీడీపీలో గుబులు
అధికార టీడీపీకి ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణమాఫీలతో పాటు కీలక హామీలు సక్రమంగా అమలు కాకపోవడం ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. గ్రామాల్లో ఏ ఒక్కరికీ ఇల్లు, ఇల్లు స్థలం మంజూరుకాకపోవడంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఇంటికో ఉద్యోగం, బాబు వస్తే జాబు, నిరుద్యోగులకు రూ.2 వేలు భతి హామీలను తుంగలో తొక్కడంపై నిరుద్యోగులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా పేదలకు అందకపోవడం వంటి అంశాలు ఆ పార్టీ నేతల్లో గుబులు రేపుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు సర్కారు అవలభిస్తున్న వైఖరి కారణంగా ఉప ఎన్నికలపై ఏవిధమైన ప్రభావం పడుతుందోన న్న భయం నాయకులను వెంటాడుతోంది.
వ్యూహ, ప్రతివ్యూహాలు
రానున్న ఉప ఎన్నికలకు అధికార టీడీపీ, వైఎస్సార్ సీపీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై స్థానిక నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. కులాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. పెద్ధేవం, కుమారదేవంలో వైఎస్సార్ సీపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొనే అవకాశం ఉండటంతో టీyీ పీ బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఆరికిరేవుల, నెలటూరులో తమ ఎంపీటీసీ స్థానాలు పదిలం చేసుకోవాలని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళుతూ సమస్యలు తెలుసుకుంటూ ప్రతిపక్షం బలమైన పాత్ర పోషిస్తుంది. దీంతో నవంబర్ 1 నుంచి జనచైతన్య యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Advertisement