సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీల్లో పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ పంచాయతీల జాబితా నుంచి రామన్నగూడెం తండాతోపాటు మరో ఎనిమిది తండాలను తొలగించడాన్ని సవాలు చేస్తూ రమావత్ ప్రదాస్ నాయక్, రమావత్ నాగేశ్వర నాయక్‌లు గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు.
రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. పంచాయతీరాజ్, మునిసిపాలిటీ చట్ట నిబంధనలను సవాలు చేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా దాదాపు 100 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ప్రజాభిప్రాయాలను తెలుసుకోలేదు
పంచాయతీల విలీనంపై చట్టం నిర్దేశించిన విధి విధానాలకు అధికారులు తిలోదకాలు ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. విలీనంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, గ్రామసభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తేలుసుకోవాల్సి ఉండగా, అధికారులు ఆ పని చేయకుండా ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. పంచాయతీలను మునిసిపాలిటీల్లో విలీనం చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అధికారుల తీరు వల్ల పెద్ద సంఖ్యలో గ్రామీణులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.
ఉపాధి హామీ పథకం కింద లభిస్తున్న ఉపాధి లేకుండా పోతుందని తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ అన్ని విషయాలపై అధ్యయనం చేసిన తరువాతనే విలీన నిర్ణయం తీసుకున్నామన్నారు. పలు పంచాయతీలు మునిసిపాలిటీల్లో కలిసిపోయి ఉన్నాయని, ఆ గ్రామాలకు కరెంటు, తాగనీరు ఆ మునిసిపాలిటీల ద్వారానే అందుతోందని తెలిపారు. పంచాయతీల విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment