
కుటుంబం కళ్లెదుట రేప్ చేయాలని తీర్పు
పంజాబ్ ప్రావిన్సు, పాకిస్తాన్: అన్నయ్య చేసిన తప్పుకు చెల్లెలి జీవితం బలైంది. ఉమర్ వడ్డా అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం ముజఫరాబాద్ ప్రావిన్సులోని తన స్వగ్రామం రాజ్‌పూర్ చెందిన ఓ అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె కుటుంబం తమకు న్యాయం చేయాలంటూ గ్రామ పంచాయితీని ఆశ్రయించింది.
ఇరువర్గాల వాదనలు విన్న పంచాయితీ పెద్దలు ఉమర్ చెల్లెల్ని ఆమె కుటుంబం చూస్తుండగా రేప్ చేయాలని బాధితురాలి సోదరుడు అష్ఫాక్‌ను ఆదేశించింది. పెద్దల తీర్పును ఉమర్ తల్లిదండ్రులు ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. దీంతో అష్ఫాక్ ఆమె కుటుంబం ముందే బాలిక(16)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కళ్లెదుట కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతుంటే ఏమి చేయలేకపోయామని, తప్పు చేసిన వారిని, తీర్పు చెప్పిన వారిని శిక్షించాలంటూ బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లైంగికదాడులకు పాల్పడిన ఇరువురు వ్యక్తులను అరెస్టు చేశారు. తీర్పు చెప్పిన 30మంది గ్రామపెద్దలపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.