సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియామకమై, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపులో 70 శాతం మార్కులు వచ్చిన వారినే క్రమబద్దికరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ అధికారిక మెమోను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు.
జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని జేపీఎస్‌ల పనితీరును సమీక్షించి మార్కులు ఇస్తున్నాయని, కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో 70శాతం, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని క్రమబద్దికరిస్తూ నియామక ఉత్తర్వులు అందజేయాలని ఈ మెమో లో స్పష్టం చేశారు. ఒకవేళ 70శాతం మార్కులు రాకపోతే ఆయా జేపీఎస్‌లకు మరో ఆరునెలల గడువు ఇవ్వాలని, అప్పుడు మరోమారు పనితీరు మదింపు చేసి అప్పటి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఆ మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి
జిల్లా స్థాయిలో ఆయా కమిటీల మదింపు నివేదికలను గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని, పనితీరు సంతృప్తిగా ఉన్న జేపీఎస్‌లకు ఇచ్చే నియామక ఉత్తర్వులను కూడా ఇదే యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు అప్పగించారు. అర్హత పొందిన జేపీఎస్‌లకు ఇవ్వాల్సిన నియామక ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదాను కూడా ఈ మెమోతో జతచేసి జిల్లాలకు పంపారు.
ప్రభుత్వ నిర్ణయం విడ్డూరం: టీపీఎస్‌ఏ
పనితీరు మదింపులో 70శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే క్రమబద్దికరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విడ్డూరంగా ఉన్నా యని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్‌ఏ) వ్యాఖ్యానించింది.
డైరెక్ట్‌గా రిక్రూట్ అయి మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని టీపీఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, ఇ. శ్రీనివాస్‌లు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామీ ణాభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో అనేక గందరగోళాలకు తావిస్తోందని, తమ డిమాండ్ ప్రకారం అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయకుంటే పోరాటా నికి దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment