పంచాయతీ ఉపపోరుకు నోటిఫికేషన్ విడుదల
-
సెప్టెంబర్ 8న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
-
26 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ
-
వచ్చేనెల 3న నామినేషన్ల విత్‌డ్రా
-
4 సర్పంచ్, 24 వార్డు, ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నిక
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లాలో పంచాయతీ ఉప పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్ జారీ చే శారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన పలు పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు, ఒక ఎంపీటీసీ స్దానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 8న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 26న జిల్లా ఎన్నికల అధికారి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. 26 ఉదయం 10.30 గంటల నుంచి 29 సాయంత్రం 5 గంటల వరనకు నామినేషన్లను స్వీకరిస్తారు. 30న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్క్రూటినీ, 31 సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లపై ఆర్డీవో అప్పిళ్ళను స్వీకరిస్తారు. సెప్టంబర్ 1 అప్పిళ్ళను ఆర్డీవో పరిశీలించి వివరాలు వెల్లడిస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. 8న ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
అధికారుల హడావిడి
జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. దీనిలో భాగంగా జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్ , డీపీఓ నారాయణరావులు ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా ఈవీఎంలను సిద్ధం చేశారు. మొత్తం 90 ఈవీఎంలను పరిశీలించారు. వీటిలో 90 కంట్రోల్ యూనిట్, 90 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి.
పూర్తయిన ఓటరుజాబితా...
2016 మే 31 వరకు వచ్చిన ఓటరు దరఖాస్తులతో జూన్ 20న నూతన ఓటరు జాబితాను ప్రకటించారు. ఇందుకోసం 2016 జనవరిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసిన ఫొటో ఓటర్ల జాబితాలను ఆయా పంచాయతీలు, వార్డులలో ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను సైతం అధికారులు గుర్తించారు.
నోటిఫికేషనే తరువాయి...
పంచాయతీల ఉప పోరుకు జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను సైతం ప్రకటించారు. ఈవీఎంల చెకప్ సైతం పూర్తవడంతో ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చుల అంచనాలను పంపారు.
సర్పంచ్ స్థానాలివే...
జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలు, 24 వార్డు సభ్యుల స్థానాలు, ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు అ«ధికారులు సన్నద్ధం అవుతున్నారు. వాటిలో చింతకాని , కల్లూరు మండలంలో చిన్నకోరుకొండ , రఘనాథపాలెం మండలంలో చిమ్మపూడి, టేకులపల్లి మండలంలో బడ్డుతండా సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కామేపల్లి మండలం మద్దులపల్లి ఎంపీటీసీ స్థానానికి కూడా ఎన్నిక నిర్వహించనున్నారు. వీటితో పాటు 24 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.