అటకెక్కిన వివాహ రిజిస్ట్రేషన్లు..
పరిగి: వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అటకెక్కింది. పంచాయతీలే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూడాలంటూ ప్రభుత్వం తప్పనిసరి నిబంధన విధించినా.. పంచాయతీలు పట్టించుకోవడం లేదు. దీంతో యథేచ్ఛగా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీ వివాహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతే పెళ్లిళ్లు జరిపించుకోవాలనే నిబంధన చట్టంలో చాలకాలం నుంచి ఉన్నప్పటికీ.. ఆ చట్టం సమగ్రంగా లేనందున ఎక్కడో ఓచోట తప్ప.. ఎక్కడా అమలుకు నోచుకోలేదు. పరిస్థితుల దృష్ట్యా అమలు పరిచేందుకు ఏ గ్రామ పంచాయతీ ఇప్పటివరకు సాహసించ లేదు.
కానీ 2012లో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుపడింది. 2012 ముందువరకు ఉన్న వివాహ రిజిస్ట్రేషన్ చట్టంలో మతాల ప్రాతిపదికన కొన్ని మినాహాయింపులు ఉండగా.. 2012 కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో సర్వజనీనంగా అన్ని మతాలవారికి ఈ రిజిస్ట్రేషన్ చట్టం వర్తించేలా చట్టం మారింది. కానీ పంచాయతీల నిర్లక్ష్యంతో ఎక్కడా అది కనిపించడం లేదు.
ఇదీ నిబంధన..
గత 2002 సంవత్సరంలో ప్రభుత్వం ముం దస్తు వివాహ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఆ చట్టం అమలుకోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించ లేదు. కనీసం గ్రామ పంచాయతీలకు సర్య్కులర్లు కూడా పంపలేదు. దీంతో చట్టం వచ్చిన విషయం ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయింది. అయితే బాల్యవివాహాల నిర్మూలన కోసం పనిచేసిన పలు స్వచ్ఛంద సంస్థలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి.
దీంతో 2002 క్లాజ్ 12 ప్రకారం గ్రామపంచాయతీల్లో వివాహానికి ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని 2006లో ప్రభుత్వం పీఆర్ 193 జీఓను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత, తప్పనిసరిగా అమలు చేసే అధికారాలను గ్రామపంచాయతీలకు కట్టబెట్టింది. గతంలో బాల్యవివాహాల నియంత్రణకు ప్రభుత్వం కొన్ని కమిటీలను కూడా నియమించింది. కానీ చట్టంలో ఉన్న లొసుగులు, అధ్యంతరాలవల్ల ఏ ఒక్క చోట ఇది అమలుకు నోచుకున్న పాపానపోలేదు.
పక్కాగా అమలు చేస్తే.. బాల్యవివాహాలు తగ్గే అవకాశం..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 30 నుంచి 40 శాతం బాల్యవివాహాలే జరుగుతున్నాయని ఎంవీ ఫౌండేషన్, చైల్డ్‌లైన్ లాంటి స్వచ్ఛంద సంస్థల లెక్కలు చెబుతున్నాయి. పుట్టిన ప్రతీ బిడ్డకు వెంటనే జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటంతోపాటు తప్పనిసరిగా ముందస్తు వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు జరిగితే బాల్యవివాహాలు పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందని అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో బాల్యవివాహాల తగ్గుదలతోపాటు స్త్రీలకు రక్షణ చేకూరనుంది. దీని ద్వారా స్త్రీల అక్రమ రవాణా కూడా నివారించడానికి వీలవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో వివాహాలు జరుగకున్నా మెడలో తాళి వేసి స్త్రీలను, బాలికలను విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పక్కగా అమలు చేయటం ద్వారా బాలికలు, స్త్రీల అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.