marriage registration
-
ఏటా జరిగే వివాహాలు 2.5 లక్షలు..
తెలంగాణలో ఐదేళ్లుగా ఒకేరీతిలో వివాహ రిజిస్ట్రేషన్లు 2023–24లో అత్యధికంగా 1.09 లక్షల రిజిస్ట్రేషన్లుగ్రేటర్ పరిధిలోనే 40 శాతం.. వరంగల్, కరీంనగర్‌లలో భారీగానే నమోదు ‘కల్యాణలక్ష్మి-’లబ్ధి కోసం ఏడాదికి 2 లక్షల వరకు దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: వివాహ రిజిస్ట్రేషన్లు ఓ మోస్తరుగానే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఏటా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయనే అంచనా ఉండగా, రిజిస్ట్రేషన్లు మాత్రం లక్షలోపే ఉంటున్నాయని లెక్కలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే వివాహాల రిజిస్ట్రేషన్లు సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2019–20 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏటా సుమారు 90 వేలకు పైగా మాత్రమే వివాహ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఐదేళ్ల కాలంలో కూడా ఈ సంఖ్యలో మార్పు లేకపోవడం విశేషం. అయితే..2023–24లో మాత్రం ఈ రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజా నివేదికలో వెల్లడైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా 1.09 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు జరిగాయని తేలింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే గ్రేటర్ పరిధిలోనే 40 శాతం వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2023–24 సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 15,733 రిజి్రస్టేషన్లు జరిగాయి. రంగారెడ్డిలో 13,502, హైదరాబాద్ జిల్లాలో 10,925 మంది తమ వివాహాలను రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్లో 14,027, వరంగల్ జిల్లాలో 11,565 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఐదు జిల్లాల్లోనే సగం రిజి్రస్టేషన్లు జరగ్గా, మిగిలిన ఏడు రిజి్రస్టేషన్ జిల్లాల్లో కలిపి మరో సగం జరగడం గమనార్హం. ఏ డాక్యుమెంట్లు కావాలంటే...! వివాహరిజిస్ట్రేషన్ల విషయంలో అలసత్వం వద్దని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు పెద్దగా సమయం పట్టదని, స్లాట్ బుక్ అయిన రోజునే పూర్తవుతుందంటున్నారు. అయితే డాక్యుమెంట్లు పూర్తిస్థాయిలో సమరి్పంచాల్సి ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి పత్రిక, 2 పెళ్లి ఫొటోలు, వధూవరుల ఆధార్‌కార్డులు, వయసు ధ్రువీకరణ పత్రం, ముగ్గురు సాక్షులు, వారి ఆధార్ కార్డులు తప్పకుండా ఉండాలి. వివాహానికి చట్టబద్ధత కల్పించడంతోపాటు విదేశాలకు వెళ్లాలనుకునే దంపతులకు ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ఇటీవలి కాలంలో వివాహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆధార్ కార్డులో చిరునామా మార్పు కావాలన్నా, కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఈ సర్టిఫికెట్ అవసరం. అయితే, కల్యాణలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవసరమవుతోంది. కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి కోసం ఏడాదికి 2 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తుండగా, అందులో ఎక్కువగా స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు) ఇచ్చే వివాహ ధ్రువపత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, స్థానిక సంస్థల్లో ధ్రువపత్రాలు ఒకసారి, వివాహాల రిజిస్ట్రేషన్లు మరోసారి కాకుండా నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇతర అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. గతం కంటే అవగాహన పెరిగింది కానీ..అది సరిపోదని, ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సి ఉంది. జరిగే ప్రతి వివాహం రిజిస్ట్రేషన్ అయితేనే అన్ని విధాలుగా మంచిదని సూచిస్తున్నాయి. -
నిజాన్ని దాచి పెళ్లి చేశారు.. నిజం తెలుసుకున్న వరుడు
విశాఖ లీగల్: ఓ జంటకు అగ్ని సాక్షిగా వివాహం జరిగింది. కొంత కాలం కాపురం చేశారు. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అన్ని విషయాలు దాచి పెట్టి మళ్లీ పెళ్లి కోసం మహిళ కుటుంబ సభ్యులు పరిణయ వేదికలో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనకు ఆకర్షితుడైన బాధితుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పిలిచినా రాకపోవడంతో అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్థానం సూచనతో ఇద్దరూ రాజీపడి కొంత కాలం కాపురం చేసి మళ్లీ విడిపోయారు. ఈ సారి ఆమె తల్లిదండ్రులు అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో అతను ఆమె గురించి ఆరా తీసి.. ఆ వివరాలతో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమైపె పోలీసులు కేసు పెట్టారు. నేరం రుజువు కావడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు న్యాయమూర్తి ఏడాది జైలు, రూ.5 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన పక్షంలో అదనంగా నెల రోజులపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలివీ. ఫిర్యాది విశాఖలో సిరిపురం ప్రాంతానికి చెందిన ఎడ్ల శ్రీనివాసరావు. తన వివాహం కోసం భారత్ మ్యాట్రిమోనీ అనే వివాహ వేదికను ఆశ్రయించాడు. ఆయన పేర్కొన్న విధంగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ప్రాంతానికి చెందిన రమాదేవి అనే ఉపాధ్యాయురాలు జోడి కుదిరినట్టు మ్యాట్రిమోనీ ప్రతినిధులు అతనికి సమాచారం ఇచ్చారు. ఇరు కుటుంబాలు ఇష్టపడటంతో 2012 డిసెంబర్ 22న వీరికి వివాహం జరిగింది. కొంత కాలం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత రమాదేవి పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి పిలిచినా రాలేదు. దీంతో శ్రీనివాసరావు విశాఖలోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్థానం ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో మళ్లీ రమాదేవిని కాపురానికి పంపించారు. అయినా ఆమెలో మార్పు రాలేదు. చివరికి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో విడాకులు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా రమాదేవి తల్లిదండ్రులు కృష్ణమూర్తి, ప్రభావతి, సోదరుడు నరేంద్ర, సోదరి ప్రొఫెసర్ సునీత మరికొందరు శ్రీనివాసరావుపై అక్రమ కేసులు బనాయించారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు రమాదేవి కుటుంబ వివరాలను సేకరించాడు. సునీల్ అనే వ్యక్తితో రమాదేవికి 2003 జూన్ 21న వివాహం జరిగింది. ఆ వివాహం రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో చట్టరీత్యా విడాకులు తీసుకున్నారు. ఆ వివరాలన్నీ శ్రీనివాసరావుకు చెప్పలేదు. ఈ వివరాలు సేకరించిన శ్రీనివాసరావు తగిన ఆధారాలతో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ జరిపిన పోలీసులు.. ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై నేరాభియోగ పత్రాలను దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి టి.వి.రాజేష్.. నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు ఇచ్చారు. ఇటువంటి కేసులు దాఖలు కావడం అరుదుగా జరుగుతుందని పలువురు వ్యాఖ్యానించారు. -
మూడుముళ్ల బందీ!
కళ్యాణదుర్గం: సాంకేతికత రోజురోజుకూ పెరుగుతున్నా...ఆధునిక సమాజం వైపు అడుగులు వేస్తున్నా...జిల్లాలో బాల్య వివాహాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లంటే ఏమిటో కూడా తెలియని వయసులో బాలికలను అత్తారింటికి పంపి, వారి బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులే సంకెళ్లు వేస్తున్నారు. మరికొందరు ఆడపిల్లలను బరువుగా భావించి వదిలించుకునే ఆలోచనతో పెళ్లిపీటలెక్కిస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో మానసికంగా, శారీరకంగా బాలికలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా...పెడచెవిన పెడుతున్నారు. ప్రేమ వివాహాలు, మేనరికాలు, వలసలు, వరుడికి ఉద్యోగం ఉందని పరిపక్వత లేని బాల్యాన్ని మాంగల్యంతో బందీ చేస్తున్నారు. ఆడ పిల్లలను ఇంటి వద్ద ఉంచలేక 18 ఏళ్లలోపే వివాహాలు జరిపిస్తున్న వారు కొందరైతే... పిల్లలు చదువుకునే సమయంలో ప్రేమ, పెళ్లి వైపు వెళ్తే కుటుంబ పరువు పోతుందనే భయంతో మరికొందరు ఇలా చేస్తున్నారు. అడ్డుకట్టకు మార్గాలు... గ్రామస్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్ సూపర్వైజర్, సీడీపీఓ, మండల స్థాయిలో తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు బాల్య వివాహాలను అడ్డుకునే అధికారం ఉంది. ఎవరైనా చైల్డ్‌లైన్(112)కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. 18 ఏళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లి చేయకూడదని, ఒక వేళ బాల్య వివాహం చేస్తే కలిగే అనర్థాల గురించి ఇప్పటికే ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయి సమావేశాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, మండల మహిళా సమాఖ్య, సంరక్షణ అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి బాల్య వివాహాల నిరోధానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ‘వివాహ రిజిస్ట్రేషన్ చట్టం – 2002’ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. గ్రామ, వార్డు స్థాయిలో మహిళా సంరక్షణ కార్యదర్శి ద్వారా వివాహ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని ఆదేశాలిచ్చారు. పెళ్లికి ముందే వధువు, వరుడు ఇద్దరూ సంతకం చేసిన దరఖాస్తును నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, వివాహ వధువు, వరుడు ఇద్దరూ సంతకం చేసిన దరఖాస్తును నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, వివాహ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని ఆదేశాలిచ్చారు. ఆహ్వాన పత్రికలతో కలిసి సమర్పించాలి. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో ఇటీవల ఓ బాల్య వివాహం జరగబోతోందన్న సమాచారం అందుకున్న ఐసీడీఎస్, పోలీసు అధికారులు గ్రామానికి వెళ్లారు. వధూవరుల కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పటికి ఆ వివాహం అడ్డుకున్నారు. అయితే మరుసటి రోజే అధికారుల కళ్లుగప్పి ఇరు కుటుంబాల వారు మరో ప్రాంతానికి వెళ్లి పెళ్లి తంతు ముగించారు. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి పంచాయతీలో రెండు నెలల క్రితం బాల్య వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకుని ఐసీడీఎస్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని నిలుపుదల చేశారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా కొందరు తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు. దీంతో బాల్య వివాహాలు జిల్లాలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అధికారులకు ముందస్తు సమాచారం అందితే వెంటనే అక్కడికి వెళ్లి బాల్య వివాహాలు అడ్డుకుని.. బాలల బంగారు భవిష్యత్తు బుగ్గిపాలు కాకుండా చూస్తున్నారు. శిక్షలతోనే బాల్య వివాహాలకు చెక్ బాల్య వివాహాలు చేస్తున్న వారిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి.. శిక్ష పడేలా చేస్తే బాల్య వివాహాలకు చెక్ పడుతుంది. గ్రామాల్లో అన్ని రకాలుగా ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రాలేదు. అమ్మాయిలను చదివిస్తే కొంతవరకు వీటిని తగ్గించవచ్చు. గ్రామాలలో చట్టంపై అవగాహన కలి్పస్తే తగ్గుముఖం పడుతాయి. – శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ మా ఊర్లో బాల్య వివాహాలకు తావులేదు నా పేరు వన్నూరమ్మ. నేను ఆర్డీటీ సంస్థలో లీడరుగా పనిచేస్తున్నాను. ఊర్లో బాల్య వివాహాలు అడ్డుకోవడం, మహిళలపై దాడులు ఇలాంటి వాటిని అరికట్టడానికి పనిచేస్తున్నాను. పదేళ్లుగా మా ఊర్లో బాల్య వివాహాలు జరగలేదు. అలా ఎవ్వరైనా చేయాలని చూసినా వెంటనే అక్కడికి చేరుకుని ఐసీడీఎస్ అధికారులతో పాటు పోలీసుల (డయల్ 100)కు, చైల్డ్‌లైన్ (112)కు సమాచారం అందిస్తున్నాం. – వన్నూరమ్మ, మోరేపల్లి బాలికల విద్యను ప్రోత్సహించాలి బాలికల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక డ్రాపౌట్స్ పూర్తిగా తగ్గిపోయింది. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు బాలికలకు వరంగా మారాయి. చదువు ఉంటే బాల్య వివాహాలు అనే ఆలోచన రాదు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. – ఉషశ్రీచరణ్, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి (చదవండి: శుద్ధ అబద్ధం: మినరల్ కాదు జనరల్ వాటర్) -
వివాదాస్పద చట్టంపై రాజస్థాన్ సర్కార్ యూటర్న్
జైపూర్: వివాదాస్పదమైన బాల్య వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని చేసిన చట్టంపై రాజస్థాన్ ప్రభుత్వం వెనక్కుతగ్గింది. తప్పనిసరి రిజిస్ట్రేషన్ల వివాహ(సవరణ)బిల్లు-2021ను రాజస్థాన్‌లో గత నెల అసెంబ్లీలో ఆమోదించిన విషయం తెలిసిందే. మైనర్ల వివాహాలు సహా అన్ని వివాహాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సవరణ చట్టం తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం ద్వారా బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. దీంతో గవర్నర్ వద్ద ఉన్న ఈ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు సీఎం అశోక్ గెహ్లోత్ పేర్కొన్నారు. చట్టాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ బాల్య వివాహాలను తమ ప్రభుత్వం అరికడుతుందని సీఎం తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే సవరణ చట్టాన్ని తీసుకువచ్చామని కానీ, నిరసన వ్యక్తమవటం వల్ల వెనక్కు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన చట్టం ప్రకారం 18 ఏళ్లకు తక్కువగా ఉన్న యువతలు, 21 ఏళ్లకు తక్కువ ఉన్న యువకులకు సంబంధించిన వివాహాలను రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొంది. బల్యవివాహాలను తగ్గించాలనే ఉద్దేశంలో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఇక రాజస్థాన్‌లో బాల్యవివాహాల సంఖ్య అధికంగా ఉన్న విషయం తెలిసిందే. -
రిజిస్ట్రేషన్‌తో పెళ్లికి చట్టబద్ధత
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): వివాహం చేసుకున్న వారంతా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పెళ్లికి చట్టబద్ధత లభిస్తుందని కలెక్టర్ రామ్మోహన్రావు తెలిపారు. అందుకే గ్రామపంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. వివాహ చట్టం–2002 అమలుకు సంబంధించి ఆయన బుధవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. వివాహం చేసుకునే వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తద్వారా చట్టబద్ధత లభిస్తుందని తెలిపారు. వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు కలుగుతాయని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలకు ఉపయోగపడుతుందన్నారు. బాల్య వివాహాలను అరికట్టవచ్చని, ఒక పెళ్లి తరువాత మరో పెళ్లి చేసుకునే వారిని గుర్తించి అడ్డుకోవచ్చని తెలిపారు. దంపతులు విడిపోతే భరణం పొందటానికి కీలకంగా మారుతుందని వివరించారు. ఒకవేళ తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారికి జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష పడుతుందన్నారు. వివాహ చట్టం–2002 ప్రకారం గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్లో మున్సిపల్ కమిషనర్, జిల్లా స్థాయిలో కలెక్టర్ రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలకు వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలను, దరఖాస్తు ఫారాలను, రిజిస్టర్‌ను ప్రతి గ్రామ పంచాయతీకి పంపిస్తున్నట్లు చెప్పారు. వివాహాలు చేసుకున్న వివరాలు ఆ రిజిస్టర్లో నమోదు చేసి ప్రతి నెలా నివేదికలు పంపాలని అధికారులకు సూచించారు. పెళ్లి జరిగిన నెల రోజుల్లోగా దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, నెల దాటి 60 రోజుల్లోగా రూ.100 ఫీజుతో రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. పెళ్లి సమయంలో కూడా రిజిస్టర్ చేయించడానికి ముందుగా సమాచారం అందిస్తే రిజిస్ట్రేషన్ అధికారి వచ్చి వివరాలు తీసుకుని రిజిస్టర్ చేస్తారని తెలిపారు. డీసీపీ ఉషా విశ్వనాథ్, ఐసీడీఎస్ అధికారిణి ఝాన్సీ, డీపీఓ జయసుధ, సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వివాహ నమోదుతో పలు లాభాలు
మాచవరం(గురజాల): గ్రామ పంచాయతీల్లో వివాహాల నమోదు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. దీంతో ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల ఆడపిల్ల ల వివాహాలకు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు సక్రమంగా అందడంలేదు. అన్ని కులాలు, మతాల వారు వివాహాలను నమో దు చేయించుకోవాలని చట్టంలో పొందుపరిచారు. వివాహం అయిన 60 రోజుల్లోగా నమోదు చేసుకోవచ్చు. కానీ ఎక్కడ ఎలా నమోదు చేసుకోవాలో తెలియక, సరైన అవగాహన లేకపోవడంతో వివాహాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంలేదు. పథకాలపై అవగాహన అవసరం వివాహ రిజిస్ట్రేషన్ చట్టం 2012 వివాహ నమోదు బాధ్యత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. ఆడపిల్లకు 18 ఏళ్లు, మగ పిల్లవాడికి 21 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసి గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో ముస్లిం, గిరిజన, ఆదర్శ వివాహాలు చేసుకున్న వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. గిరిజనులకు గిరిజన పుత్రిక, ముస్లింలకు దుల్హన్ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 50 వేలు ప్రోత్సాహక నగదు అందుతుంది. ఇటీవల ఎస్సీలకు ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక ప్రకటించింది. నమోదు ఇలా చేసుకోవాలి వివాహం చేసుకున్న గ్రామంలో పంచాయతీ కార్యదర్శికి ముందుగా సమాచారం ఇచ్చి నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. వధువు, వరుడు ఆధార్ కార్డులు, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, వ్యక్తిగత ఫొటోలు(పాస్‌పోర్టులు), పెళ్లి కార్డులు, పెళ్లి ఫోటో, ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి. వీటిని పరిశీలించిన కార్యదర్శి రిజిస్ట్రేషన్ చేసి ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. వివాహం జరిగిన 20 నుంచి 60 రోజుల్లో నమోదు చేసుకోవచ్చు. 20 రోజుల్లో అయితే ఉచితంగా, 60 రోజుల్లోపు అయితే రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ఆన్లైన్లో వివాహ రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: వివాహ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రారు కార్యాలయాన్ని వెతుక్కుంటూ వెళ్లాల్సిన శ్రమ తప్పనుంది. సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి ఆన్లైన్లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేసుకుని వివాహ సర్టిఫికేట్ పొందే వెసులుబాటు కల్పించాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటివరకూ పెళ్లికుమారుడు, లేదా పెళ్లి కుమార్తె నివాస ప్రాంతంలోని, లేదా వివాహం చేసుకున్న ప్రాంతం పరిధిలోని సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలోనే వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అమల్లో ఉంది. ఇక నుంచి రాష్ట్రంలోని ఏ మీసేవ కేంద్రంలోనైనా వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేసింది. వివాహాలు నమోదు చేసుకుని వివాహ సర్టిఫికేట్ తీసుకోదలచిన దంపతులు మీసేవ కేంద్రానికి తగిన డాక్యుమెంట్లతో వెళ్లాల్సి ఉంటుంది. దంపతులు ఇద్దరి ఆధార్ కార్డులు, వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లి ఫొటోలు, పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు దంపతులిద్దరూ తామిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను మీసేవ కేంద్రంలోని ఆపరేటర్‌కు సమర్పించాలి. వీటి ఆధారంగా ఈకేవైసీ (నో యువర్ కష్టమర్) డేటాను మీసేవ కేంద్రం ఆపరేటర్ చెక్ చేసి ధ్రువీకరించుకుంటారు. తర్వాత దంపతులిద్దరి సంతకాలు, సాక్షి సంతకాలను ఆపరేటర్ తీసుకుంటారు. వీటిని మీసేవ కేంద్రం సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఫొటోలు, దంపతులు, సాక్షుల సంతకాలను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. ఈ డేటా వెంటనే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి వస్తుంది. దీనిని సంబంధిత సబ్ రిజిస్ట్రారు తనిఖీ చేసి ఆమోదిస్తారు. సబ్ రిజిస్ట్రారు ఆమోదించగానే డిజిటల్ సిగ్నేచర్‌తో కూడిన వివాహ సర్టిఫికేట్‌ను దంపతులు మీసేవ కేంద్రాల ద్వారా తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు త్వరలో చేస్తామని సంబంధిత అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. మోసాలకు అవకాశం మీసేవ కేంద్రాల ద్వారా వివాహ రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తే మోసాలు జరిగే ప్రమాదం ఉంటుందని క్షేత్రస్థాయి అధికారులు తెలిపారు. మీసేవకు అనుమతిస్తే విదేశాల్లో ఉన్న, విదేశాలకు వెళ్లిన వారి విషయంలో మోసపూరిత వివాహ సర్టిఫికేట్లు జారీ అయ్యే ప్రమాదం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ తదితర జిల్లాల వారు అధిక సంఖ్యలో విదేశాల్లో ఉన్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన వారు దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల్లో అధికంగా ఉండగా మిగిలిన జిల్లాల వారు ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లి స్థిరపడ్డారు. దంపతులు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో హాజరుతో నిమిత్తం లేకుండా మీసేవ కేంద్రాల్లో సంతకాల ఆధారంగా వివాహ సర్టిఫికేట్లు జారీ చేసే విధానం తెస్తే భవిష్యత్తులో కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంటుందని, ఇలా కాకుండా తగు జాగ్రత్తలను విధి విధానాల్లో చేర్చాలని క్షేత్రస్థాయి అధికారులు సూచిస్తున్నారు. ఫోర్జరీ రిజిస్ట్రేషన్లు భర్త విదేశాల్లో ఉంటే భార్య ఫ్యామిలీ వీసా కింద విదేశాలకు వెళ్లాలంటే వివాహ సర్టిఫికేట్ తప్పనిసరి. అమెరికాలో ఉన్న వారు హడావుడిగా ఇక్కడకు వచ్చి వివాహం చేసుకుని వెళ్లిపోతుంటారు. తర్వాత కొన్ని నెలలకో, రోజులకో భార్యను/ భర్తను అక్కడికీ తీసుకెళ్లేందుకు కుటుంబ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు. దీనికి వివాహ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోనిదే సర్టిఫికేట్ రాదు. వివాహ నమోదు కోసం అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి వెళ్లాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. దీంతో ఇక్కడకు రాకుండానే ఫోర్జరీ సంతకాలు చేయించి వివాహ సర్టిఫికేట్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఫోర్జరీ సంతకాలను అనుమతించి వివాహ సర్టిఫికేట్ ఇస్తే భవిష్యత్తులో కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందనే భయంతో సబ్రిజిస్ట్రార్లు అనుమతించడంలేదు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రయివేటు వ్యక్తులయినందున డబ్బులకు ఆశపడి ఫోర్జరీ సంతకాలను అనుమతిస్తారు. దీనివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. – నెల్లూరుకు చెందిన సబ్ డివిజనల్ పోలీసు అధికారి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు దంపతులిద్దరూ మా ఎదుట సంతకాలు చేసిన తేదీ, సమయాన్ని మేం రిజిష్టర్‌లో నమోదు చేసుకునే వివాహ సర్టిఫికేట్ ఇస్తాం. విదేశాల నుంచి రాలేని పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి నాకు సన్నిహితుని ద్వారా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. రూ.1.50 లక్షలు ఇస్తామని పెళ్లికొడుకు హాజరు లేకుండా (ముందుగానే సంతకం చేసిన పేపర్ పెట్టుకుని) వివాహాన్ని నమోదుచేసి వివాహ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరారు. ఇలా చేస్తే ఆ సమయంలో ఆ వ్యక్తి విదేశాల్లో ఏమైనా తప్పు చేసి దొరికిపోతే మా ఉద్యోగానికి ఎసరే కాకుండా క్రిమినల్ కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అందువల్ల నేను అంగీకరించలేదు. మీసేవ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగితే ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశం ఎక్కువ. – రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక సబ్ రిజిస్ట్రారు -
పెళ్లి - చట్టబద్ధత
ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో పడిన పెళ్లిళ్ల నమోదు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వివాహమైన నెలరోజుల్లోగా రిజిస్టర్ చేసుకోవడం, దాన్ని ఆధార్‌తో అను సంధానించడం తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని మంగళవారం లా కమిషన్ నివేదిక సిఫార్సు సిఫార్సు చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆలస్యమైన పక్షంలో రోజుకు రూ. 5 చొప్పున జరిమానా వసూలు చేయాలని, గరిష్టంగా ఇది రూ. 100 ఉండాలని కూడా సూచించింది. మన సమాజంలో పెళ్లనేది ఇద్దరి జీవి తాలతోపాటు రెండు కుటుంబాలను ఏకం చేసే వ్యవస్థ. అయితే ఈ వ్యవస్థలో మహిళలు ఎంతో వివక్ష ఎదుర్కొంటున్నారు. దీనికి కుల, మత భేదాల్లేవు. ధనిక, బీద తారతమ్యం లేదు. చదువు, డబ్బు, ఉద్యోగం, హోదా వంటివేవీ ఆడదాన్ని ఈ వివక్ష నుంచి కాపాడలేకపోతున్నాయి. ఇంటా, బయటా అను నిత్యం అనేక రూపాల్లో మహిళలపట్ల అమలవుతున్న వివక్షను పారదోలాలని ఐక్యరాజ్యసమితి సంకల్పించి దాదాపు నాలుగు దశాబ్దాలవుతోంది. అందుకు సంబంధించిన అంత ర్జాతీయ ఒడంబడికపై మన దేశం సంతకం చేసి ఈ నెలాఖరుకు 37 ఏళ్లు పూర్తవుతోంది. వివాహాల నమోదు తప్పనిసరి చేస్తూ ప్రతి దేశమూ చట్టం తీసు కురావాలని ఈ ఒడంబడిక చెబుతోంది. అయితే 1993లో ఆ ఒప్పందాన్ని ధ్రువీ కరించే సందర్భంగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తున్న ఒప్పందంలోని 16(2) అధికరణం ఆచరణ సాధ్యం కాదని మన దేశం చెప్పింది. భిన్న మతాలు, సంప్ర దాయాలు, అంతంతమాత్రంగా ఉన్న అక్షరాస్యత వగైరా కారణాల వల్ల భారత్ లాంటి సువిశాల దేశంలో ఇది కష్టమని వివరించింది. ఆ విషయంలో చేయ దల్చుకున్నదేమిటో మాత్రం చెప్పలేదు. నిజానికిది తప్పించుకు తిరిగే ధోరణి. వివాహాల నమోదు లేకపోవడం సమస్యలు సృష్టిస్తున్నదా లేదా అని చూడాలి తప్ప అలా నమోదు చేయడం ఎందుకు అసాధ్యమో ఏకరువు పెట్టడం సమంజసం కాదు. నమోదు లేకపోవడం వల్ల జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు అన్యాయం జరుగుతున్నదను కుంటే.. ఎన్ని అవరోధాలనైనా అధిగమించి ఆ అన్యాయాన్ని సరిదిద్దడం ప్రభుత్వం బాధ్యత. సమాజం బాధ్యత. అదొక్కటే సమస్యకు పరిష్కారం కాదనుకుంటే దాంతోపాటు చేయాల్సినవేమిటో గుర్తించి అమలు చేయడమూ వాటి బాధ్యతే. సకల జనామోదం పొందాకే చట్టాన్ని రూపొందిస్తామని, అంతవరకూ ఏ అన్యా యాన్నయినా చూసీచూడనట్టు వదిలేస్తామని అనడం సరైంది కాదు. హిందువుల్లో విడాకులకు వీలు కల్పించే హిందూ వివాహ చట్టం తీసుకొచ్చినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ, ఆనాటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ అంబేడ్కర్ సంప్రదాయ వాదుల నుంచి ఎంతో ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. హిందూ సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేయదల్చుకున్నారని విమ ర్శలు వచ్చాయి. అయినా ఆ చట్టం వచ్చింది. పెళ్లిళ్లను రిజిస్టర్ చేసే నిబంధన లేక పోవడం వల్ల ఆడదానికి జరుగుతున్న అన్యాయాలు అన్నీ ఇన్నీ కాదు. ఎన్నారై పెళ్లిళ్లలో ఇలాంటివి ఎక్కువుంటున్నాయి. బహుభార్యత్వం నేరమని చట్టం చెబు తున్నా అవివాహితుణ్ణని చెప్పి మోసగించి నలుగురైదుగురిని పెళ్లాడిన కేసులు అడపా దడపా బయటికొస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మనిషి చనిపోయాకే అతడికి వేరేచోట మరో కుటుంబం ఉన్నట్టు వెల్లడవుతుంటుంది. ఇలాంటపుడు పెళ్లయినట్టు సాక్ష్యం చూపలేక, భార్యగా గుర్తింపు లేక, వారసత్వ హక్కులు పొంద లేక, భరణం రాక మహిళలు రోడ్డున పడుతున్నారు. ఒక్కోసారి పిల్లల కస్టడీ కూడా సమస్యవుతోంది. పెళ్లిళ్లపై అధికారిక రికార్డులు లేకపోవడం వల్ల మోసగాళ్లు సుల భంగా తప్పించుకుంటున్నారని 2005లో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ వెంటనే జాతీయ మహిళా కమిషన్ ఒక బిల్లు కూడా రూపొందించింది. మహారాష్ట్ర, గుజ రాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేశాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో రాజ్యసభలో ఇందుకోసం బిల్లు పెట్టారు. అది ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో ప్రవేశపెట్టేలోగానే ఆ సభ కాస్తా రద్ద యింది. దాంతో బిల్లు మురిగిపోయింది. దేశంలో ప్రధానమైన హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్సీ మతాలకు వేర్వేరుగా వైయక్తిక చట్టాలున్నాయి. 1872నాటి క్రైస్తవ వివాహ చట్టం, 1936నాటి పార్సీ వివాహచట్టం పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశాయి. ముస్లిం వైయక్తిక చట్టం ప్రకారం నిఖానామాలో వివాహాన్ని కాజీ నమోదు చేస్తారు. 1955నాటి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 8లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ గురించి ఉన్నా మత విశ్వాసాల ప్రకారం పెళ్లి చేసుకున్నాక దాన్ని నమోదు చేయించుకోవడమా లేదా అన్నది ఆ జంటకే విడిచిపెట్టారు. ఏ మతానికీ సంబంధంలేని 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం ఉంది. అయితే హిందూ వివాహ చట్టం తప్పనిసరి చేయకపోవడం వల్ల అధిక సంఖ్యాకులు వివాహ నమోదు ప్రక్రియ జోలికే పోరు. ఈ నిబంధన ఉంటే బాల్య వివాహాల జోరు తగ్గుతుందని ఆశించేవారు కూడా ఉన్నారు. ప్రపంచ దేశాల్లో జరిగే బాల్యవివాహాల్లో 40 శాతం పైగా మన దేశంలోనే ఉన్నట్టు యునిసెఫ్ చెబుతోంది. అయితే తప్పనిసరి నమోదు నిబంధన దానికదే సమస్యగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్టయితే అది మరిన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. ఈ నిబంధన సంగతి తెలియక వివాహ బంధంలో చిక్కుకున్నవారు అనంతరకాలంలో పెళ్లి చెల్లదన్న తీర్పువస్తే ఏం కావాలి? పిల్లలు, ఆస్తి, భరణం వగైరా అంశాల్లో వారికి లభించే న్యాయం ఏమిటి? పైగా ఇలా చేసే చట్టం మతాలకు అతీతంగా వర్తింపజేస్తూ రూపొందిస్తారా లేక ఇప్పటికే అలాంటి నిబంధన అమలవుతున్న మతాలను మినహాయిస్తారా? మినహాయించకపోతే అందువల్ల తలెత్తగల సమస్య లేమిటి? వీటన్నిటినీ అన్ని కోణాల్లోనూ ఆలోచించి, అందరి అభిప్రాయాలూ పరి గణనలోకి తీసుకుని పకడ్బందీగా ఈ చట్టాన్ని రూపొందించాలి. ఏం చేసినా మహి ళల శ్రేయస్సు, సంక్షేమం గీటురాయి కావాలి. -
ప్రతి వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
హన్మకొండ: గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో జరిగే ప్రతి వివాహాన్ని తప్పనిసరిగా వివాహాల రిజిస్ట్రేషన్ చట్టం–202 కింద రిజిష్టర్ చేయాలని జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వివాహాల రిజిస్ట్రేషన్, బాల్యవివాహాలు, పిల్లల దత్తత అంశంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వివాహాల రిజిస్ట్రేషన్ చట్టంలో నిబంధనలు అధికారులు తప్పనిసరిగా పాటిస్తూ రిజిస్ట్రేషన్ చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని అన్నారు. సర్టిఫికెట్ జారీ కోసం అధికారులు గ్రామ పంచాయతీ నిధులు వాడుకోవాలన్నారు. వివాహ అధికారులుగా నియామకమైన పంచాయతీ కార్యదర్శులు సంబంధిత నివేదికలు వీఓఆర్డీలకు అక్కడి నుంచి డీపీఓకు పంపాలని అన్నారు. సమగ్ర నివేదికను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో రూపొందించాలని అన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ శైలజ, డీపీఓ మహమూది, జెడ్పీ సీఈఓ విజయ్‌గోపాల్, తరుణి ప్రతినిధి మమతరఘువీర్, అనితారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ రామ్మోహన్, జిల్లా బాలల పరిరక్షణ విభగం ప్రతినిధి సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచార పోస్టర్లు కలెక్టర్ ఆవిష్కరించారు. -
‘మా పెళ్లి ఎందుకు రిజిస్టర్ చేయరు?’
రాంచి: ప్రేమే నేరమౌనా, పెళ్లే భారమౌనా! అని బాధ పడుతోంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ యువజంట. గత ఆరు నెలలుగా జిల్లా అధికారుల చుట్టూ కాళ్లు కందిపోయేలా తిరుగుతున్నా వారి పెళ్లిని అధికారులు రిజిస్టర్ చేయడం లేదు. ఆ భార్యాభర్తలు ఇరుమతాలకు చెందిన వారవడం వల్ల వారి పెళ్లిని రిజిస్టర్ చేస్తే రాష్ట్రంలో, ముఖ్యంగా దాద్రిలో మత ఘర్షణలు చెలరేగుతాయని అధికారులు చెబుతున్నారు. ఓ ముస్లిం కుటుంబం ఫ్రిజ్‌లో ఆవు మాంసాన్ని దాచుకున్నారనే అనుమానంతో ఆ కుటుంబానికి చెందిన ముస్లిం పెద్దను హిందూ మూకలు హత్య చేయడం, పర్యవసానంగా మత కలహాలు చెలరేగడం తెల్సిందే. 24 ఏళ్ల మనోజ్ భాటి హిందువు. 20 ఏళ్ల సల్మా ముస్లిం మతస్థురాలు. వీరిద్దరు దాద్రి పట్టణానికి సమీపంలోని చిటెహ్రా గ్రామానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు పరిచయస్థులు. ఏడాదిపాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దానికోసం గతేడాది అక్టోబర్ 19వ తేదీన అలహాబాద్ నగరానికి పారిపోయారు. సల్మాకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నారు. వారు మనోజ్ భాటిపై కిడ్నాప్ కేసు పెట్టారు. మనోజ్‌తోపాటు అలహాబాద్ వెళ్లిన సల్మా అక్కడ హిందూ మతాన్ని స్వీకరించారు. తన పేరును స్వప్నా ఆర్యగా మార్చుకున్నారు. అనంతరం ఆ జంట ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్య సమాజ్ ఇచ్చిన పెళ్లి సర్టిఫికెట్తో దాద్రికి తిరిగొచ్చారు. తాను మైనర్‌ను కాదని, మేజర్‌నని స్టడీ సర్టిఫికెట్, వైద్య పరీక్షల ద్వారా నిరూపించుకున్నారు. ఫలితంగా మనోజ్‌పై దాఖలైన కిడ్నాప్ కేసును పోలీసులు ఎత్తివేశారు. తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోవడం కోసం ఆ యువజంట దాద్రి రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లింది. అయితే వారి పెళ్లిని రిజిస్టర్ చేయడానికి అక్కడి ఉన్నతాధికారి నిరాకరించారు. దాద్రిలో గొడవలు జరుగుతాయన్న నెపంతోనే పెళ్లి రిజిస్ట్రేషన్‌ను నిరాకరించారని ఆ యువజంట చెబుతోంది. పెళ్లి రిజిస్టర్ చేయాలంటే అక్కడి ఉన్నతాధికారి తమను 20 వేల రూపాయల లంచం అడిగారని మనోజ్ మీడియా ముందు ఆరోపించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ జంట జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ విషయంలో తాము జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా అదనపు మేజిస్ట్రేట్, సీనియర్ మేజిస్ట్రేట్, ఇలా అందరిని కలుసుకున్నామని, ఇంతవరకు ఎవరు కూడా తమకు న్యాయం చేయలేక పోయారని మనోజ్ ఆరోపించారు. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు కూడా లేఖ రాశామని, ఇంతవరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన వాపోయారు. షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు హిందూ మహిళలను వివాహమాడినా సమాజంలో మతాతీత పెళ్లిళ్లను ఎందుకు అనుమతించడం లేదో తనకు అర్థం కావడం లేదని మనోజ్ వ్యాఖ్యానించారు. ఏ అధికారి అయినా దాద్రి సంఘటనను సాకుగా చూపిస్తున్నారని, వాస్తవానికి ఆ సంఘటన తర్వాత ఎన్ని వదంతులు ప్రచారమైనా దాద్రిలో మతసామరస్యం దెబ్బతినలేదని మనోజ్ తెలిపారు. పైగా తమ పెళ్లి ఇరు మతాల ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని అంటున్నారు. -
అటకెక్కిన వివాహ రిజిస్ట్రేషన్లు..
పరిగి: వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అటకెక్కింది. పంచాయతీలే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూడాలంటూ ప్రభుత్వం తప్పనిసరి నిబంధన విధించినా.. పంచాయతీలు పట్టించుకోవడం లేదు. దీంతో యథేచ్ఛగా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీ వివాహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతే పెళ్లిళ్లు జరిపించుకోవాలనే నిబంధన చట్టంలో చాలకాలం నుంచి ఉన్నప్పటికీ.. ఆ చట్టం సమగ్రంగా లేనందున ఎక్కడో ఓచోట తప్ప.. ఎక్కడా అమలుకు నోచుకోలేదు. పరిస్థితుల దృష్ట్యా అమలు పరిచేందుకు ఏ గ్రామ పంచాయతీ ఇప్పటివరకు సాహసించ లేదు. కానీ 2012లో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుపడింది. 2012 ముందువరకు ఉన్న వివాహ రిజిస్ట్రేషన్ చట్టంలో మతాల ప్రాతిపదికన కొన్ని మినాహాయింపులు ఉండగా.. 2012 కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో సర్వజనీనంగా అన్ని మతాలవారికి ఈ రిజిస్ట్రేషన్ చట్టం వర్తించేలా చట్టం మారింది. కానీ పంచాయతీల నిర్లక్ష్యంతో ఎక్కడా అది కనిపించడం లేదు. ఇదీ నిబంధన.. గత 2002 సంవత్సరంలో ప్రభుత్వం ముం దస్తు వివాహ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఆ చట్టం అమలుకోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించ లేదు. కనీసం గ్రామ పంచాయతీలకు సర్య్కులర్లు కూడా పంపలేదు. దీంతో చట్టం వచ్చిన విషయం ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయింది. అయితే బాల్యవివాహాల నిర్మూలన కోసం పనిచేసిన పలు స్వచ్ఛంద సంస్థలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో 2002 క్లాజ్ 12 ప్రకారం గ్రామపంచాయతీల్లో వివాహానికి ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని 2006లో ప్రభుత్వం పీఆర్ 193 జీఓను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత, తప్పనిసరిగా అమలు చేసే అధికారాలను గ్రామపంచాయతీలకు కట్టబెట్టింది. గతంలో బాల్యవివాహాల నియంత్రణకు ప్రభుత్వం కొన్ని కమిటీలను కూడా నియమించింది. కానీ చట్టంలో ఉన్న లొసుగులు, అధ్యంతరాలవల్ల ఏ ఒక్క చోట ఇది అమలుకు నోచుకున్న పాపానపోలేదు. పక్కాగా అమలు చేస్తే.. బాల్యవివాహాలు తగ్గే అవకాశం.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 30 నుంచి 40 శాతం బాల్యవివాహాలే జరుగుతున్నాయని ఎంవీ ఫౌండేషన్, చైల్డ్‌లైన్ లాంటి స్వచ్ఛంద సంస్థల లెక్కలు చెబుతున్నాయి. పుట్టిన ప్రతీ బిడ్డకు వెంటనే జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటంతోపాటు తప్పనిసరిగా ముందస్తు వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు జరిగితే బాల్యవివాహాలు పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందని అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో బాల్యవివాహాల తగ్గుదలతోపాటు స్త్రీలకు రక్షణ చేకూరనుంది. దీని ద్వారా స్త్రీల అక్రమ రవాణా కూడా నివారించడానికి వీలవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో వివాహాలు జరుగకున్నా మెడలో తాళి వేసి స్త్రీలను, బాలికలను విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పక్కగా అమలు చేయటం ద్వారా బాలికలు, స్త్రీల అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పెళ్లికి 300 మందికి మించి వస్తే ...
ఇకపై ఆడంబరాల వివాహాలకు చెల్లుచీటి! ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్న ప్రభుత్వం బెంగళూరు : లక్షలు... కోట్ల రూపాయలు... ఖర్చు చేసి ధూంధాం... అంటూ పెళ్లి చేసుకుంటామంటే ఇక కుదరకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆడంబరాల పెళ్లిళ్లకు అడ్డుకట్ట వేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లును శాసనసభలో సభ్యుల అనుమతి కోసం ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రంలో విమర్శలు చెలరేగుతున్నాయి. కాగా, ఈ ముసాయిదా బిల్లులో కొన్ని ముఖ్య నిబంధనలు.... *కల్యాణ మండపం అద్దె రూ. 50 వేలకు మించకూడదు *అతిథిలు 300కు కంటే ఎక్కువ మంది హాజరుకాకూడదు *పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి *నిబంధనలు ఉల్లంఘిస్తే వధూవరుల తల్లిదండ్రుల నుంచి అపరాధ రుసుమును వసూలు చేస్తారు. -
45 నిమిషాల్లోనే రిజిస్టేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో భూ రిజిస్ట్రేషన్లు, వివాహ రిజిస్ట్రేషన్ల విధానాన్ని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథరెడ్డి గురువారం ప్రారంభించారు. ఎక్కడినుంచైనా, ఏ రిజిస్ట్రేషన్ అయినా ఆన్ లైన్ లో చేసుకోవచ్చని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. 45 నిమిషాల్లో రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కు కూడా ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. దీనివల్ల వినియోగదారులకు చాలా సమయం కలిసొస్తుందని అన్నారు. -
మీ పెళ్లి చట్టబద్ధమేనా?
ఇల్లు కొంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కానీ.. పెళ్లి చేసుకుంటే కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా..? వివాహానికీ చట్టబద్ధత ఉంటుందా..? ఇలా.. ఈ విషయంపై నిరక్షరాస్యులకే కాదు.. అక్షరాస్యులకూ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అధికారులు సరైన ప్రచారం చేపట్టక పోవడంతోనే వివాహ రిజిస్ట్రేషన్లపై ప్రజలకు అవగాహన లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఏటా వేల సంఖ్యల్లో వివాహాలు జరుగుతున్నా ఇందులో పట్టుమని పది కూడా రిజిస్ట్రేషన్‌కు నోచుకోవడం లేదు. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడం.. అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో వివాహాలకు చట్టభద్రత కొరవడుతోంది. పెళ్లికి చట్టబద్ధత కల్పించడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎవరికీ తెలియకపోవడం కూడా దీనికి కారణమవుతోంది. ఫలితంగా పలు పథకాల వర్తింపులో చాలామంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. అసలు వివాహాలను ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి.. చేసుకుంటే ఉపయోగాలేమిటి.. తదితర వంటి అంశాలపై కథనం. మన సంప్రదాయంలో వివాహానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లంటే నూరేళ్ల పంట అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇటీవల వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం పరిపాటిగా మారింది. లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేసుకుంటున్న వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను అధికారులూ పట్టించుకోకపోవడంతో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు నమోదు కావడం లేదు. చట్ట ప్రకారం హిందూ వివాహ చట్టం ప్రకారం హిందువుల్లో వివాహం చేసుకున్న ప్రతి జంట రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాని దీనికి తగిన ప్రచారం కల్పించకపోవటంతో ఆ దిశగా పెళ్లిళ్లు నమోదు కావడం లేదు. వివాహాలు అధికంగా జరుగుతున్నా రిజిస్ట్రేషన్ సంఖ్య మాత్రం అంతకంతకూ దిగజారుతోంది. ఇదే కాకుండా కులాంతర, మతాంతర వివాహాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతాయి. అండర్ స్పెషల్ మ్యారేజెస్ చట్టం ప్రకారం రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహమైన రోజున వీరికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. ఇలా జరిగినవి కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఒక్కటి కూడా నమోదు కాలేదు ఏటా వివాహాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే చట్టబద్ధత పొందుతున్నాయి. వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అంతంత మాత్రంగానే అమలవుతోంది. వేలల్లో వివాహాలు జరుగుతున్నా వివాహాల రిజిస్ట్రేషన్ నమోదు పెరగటం లేదు. వివాహాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ పదకొండేళ్ల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి తగిన యంత్రాంగం లేకపోవటంతో అమలుకు నోచుకోలేదు. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడం, అధికారులు ప్రచారం చేయకపోవటం ప్రధానం కారణం. దరఖాస్తు చేసుకుంటేనే ఫంక్షన్‌హాళ్లు వివాహా నమోదు చట్టాన్ని అమలు చేసేందుకు ఫంక్షన్‌హాళ్లు, మ్యారేజ్‌హాల్స్, దేవాలయాలకు నగరపాలక సంస్థ కమిషనర్ పేరుతో నోటీసు లు అందజేయాలి. వివాహ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ధ్రు వీకరణ పత్రం అందజేస్తేనే వివాహం చేసుకునే వారికి ఫంక్షన్ హాళ్లు అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. అధికారులు దీన్ని అమలు చేయడం లేదు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇక ఇళ్ల వద్ద పెళ్లిళ్లు చేసుకునే వారిలో చాలామందికి అసలు ఈ విషయమే తెలియదు. అవగాహన కల్పించాలి వివాహ రిజిస్ట్రేషన్ విషయంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టబద్ధత వల కలిగే ప్రయోజనాలను వివరించటం ద్వారా వివాహాల నమోదు సంఖ్య పెరుగుతుంది. జిల్లా కేంద్రంలో జరిగే ప్రతి వివాహం నగరపాలక సంస్థలో తప్పని సరిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న విషయం ఇప్పటికి ప్రజలకు తెలియదంటే దీనిపై ప్రచారం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు విధాలుగా దరఖాస్తు పెండ్లికి నెల ముందు నగరపాలక సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి ముందే సమాచారం ఇవ్వటం వల్ల తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వధువు, వరుడి పాస్‌పోర్టు సైజు ఫొటోలు, లగ్న పత్రికను విధిగా ధరఖాస్తు ఫారంతో జతపర్చాలి. ముందుగా దరఖాస్తు చేసుకోనివారు వివాహం చేసుకున్న నెల రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పెండ్లి ఫొటోలు, వధువు, వరుడి రెండు పాస్ ఫొటోలు, లగ్న పత్రికను దరఖాస్తుతో జతపర్చాలి. నగరపాలక సంస్థ సిబ్బంది విచారణ చేపట్టి.. క్లియరెన్స్ ఇవ్వగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రయోజనాలు *వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. *కుటుంబానికి సంబంధించిన అన్ని పథకాల వర్తింపునకు ఇది చాలా అవసరం. *వరకట్న వేధింపుల సందర్భాలలో నేరాలు రుజువు కావడానికి ముఖ్య ఆధారం. *హింసకు గురైన లేదా గురవుతున్న స్త్రీ, పురుషులిద్దరికి ఇది సౌకర్యమే. *బాల్య వివాహాలు నివారించవచ్చు. *విదేశాలకు వెళ్లే జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.