రాంచి: ప్రేమే నేరమౌనా, పెళ్లే భారమౌనా! అని బాధ పడుతోంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ యువజంట. గత ఆరు నెలలుగా జిల్లా అధికారుల చుట్టూ కాళ్లు కందిపోయేలా తిరుగుతున్నా వారి పెళ్లిని అధికారులు రిజిస్టర్ చేయడం లేదు. ఆ భార్యాభర్తలు ఇరుమతాలకు చెందిన వారవడం వల్ల వారి పెళ్లిని రిజిస్టర్ చేస్తే రాష్ట్రంలో, ముఖ్యంగా దాద్రిలో మత ఘర్షణలు చెలరేగుతాయని అధికారులు చెబుతున్నారు. ఓ ముస్లిం కుటుంబం ఫ్రిజ్‌లో ఆవు మాంసాన్ని దాచుకున్నారనే అనుమానంతో ఆ కుటుంబానికి చెందిన ముస్లిం పెద్దను హిందూ మూకలు హత్య చేయడం, పర్యవసానంగా మత కలహాలు చెలరేగడం తెల్సిందే.
24 ఏళ్ల మనోజ్ భాటి హిందువు. 20 ఏళ్ల సల్మా ముస్లిం మతస్థురాలు. వీరిద్దరు దాద్రి పట్టణానికి సమీపంలోని చిటెహ్రా గ్రామానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు పరిచయస్థులు. ఏడాదిపాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దానికోసం గతేడాది అక్టోబర్ 19వ తేదీన అలహాబాద్ నగరానికి పారిపోయారు. సల్మాకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నారు. వారు మనోజ్ భాటిపై కిడ్నాప్ కేసు పెట్టారు. మనోజ్‌తోపాటు అలహాబాద్ వెళ్లిన సల్మా అక్కడ హిందూ మతాన్ని స్వీకరించారు. తన పేరును స్వప్నా ఆర్యగా మార్చుకున్నారు. అనంతరం ఆ జంట ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత ఆర్య సమాజ్ ఇచ్చిన పెళ్లి సర్టిఫికెట్‌తో దాద్రికి తిరిగొచ్చారు. తాను మైనర్‌ను కాదని, మేజర్‌నని స్టడీ సర్టిఫికెట్, వైద్య పరీక్షల ద్వారా నిరూపించుకున్నారు. ఫలితంగా మనోజ్‌పై దాఖలైన కిడ్నాప్ కేసును పోలీసులు ఎత్తివేశారు. తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోవడం కోసం ఆ యువజంట దాద్రి రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లింది. అయితే వారి పెళ్లిని రిజిస్టర్ చేయడానికి అక్కడి ఉన్నతాధికారి నిరాకరించారు. దాద్రిలో గొడవలు జరుగుతాయన్న నెపంతోనే పెళ్లి రిజిస్ట్రేషన్‌ను నిరాకరించారని ఆ యువజంట చెబుతోంది. పెళ్లి రిజిస్టర్ చేయాలంటే అక్కడి ఉన్నతాధికారి తమను 20 వేల రూపాయల లంచం అడిగారని మనోజ్ మీడియా ముందు ఆరోపించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ జంట జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది.
ఈ విషయంలో తాము జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా అదనపు మేజిస్ట్రేట్, సీనియర్ మేజిస్ట్రేట్, ఇలా అందరిని కలుసుకున్నామని, ఇంతవరకు ఎవరు కూడా తమకు న్యాయం చేయలేక పోయారని మనోజ్ ఆరోపించారు. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు కూడా లేఖ రాశామని, ఇంతవరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన వాపోయారు. షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు హిందూ మహిళలను వివాహమాడినా సమాజంలో మతాతీత పెళ్లిళ్లను ఎందుకు అనుమతించడం లేదో తనకు అర్థం కావడం లేదని మనోజ్ వ్యాఖ్యానించారు. ఏ అధికారి అయినా దాద్రి సంఘటనను సాకుగా చూపిస్తున్నారని, వాస్తవానికి ఆ సంఘటన తర్వాత ఎన్ని వదంతులు ప్రచారమైనా దాద్రిలో మతసామరస్యం దెబ్బతినలేదని మనోజ్ తెలిపారు. పైగా తమ పెళ్లి ఇరు మతాల ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని అంటున్నారు.